టీఎస్-ఐపాస్ పథకాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్నామని… కేంద్ర ప్రభుత్వం అణాపైసా కూడా సహాయం చేయలేదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. వెనకబడిన రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పారిశ్రామికీకరణకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని విభజన చట్టంలో పొందుపరిచినా కేంద్రం నుంచి స్పందన లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ గడిచిన ఆరేండ్లలో టీఎస్-ఐపాస్ కింద రూ. 2,13,431 కోట్ల పెట్టుడితో 15,236 పరిశ్రమలు ఆమోదం పొందాయని, అందులో రూ. 97,405 కోట్ల పెట్టుబడితో 11,954 పరిశ్రమలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,67,729 మందికి ఉపాధి కల్పన జరిగినట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామికీకరణను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా జిల్లాలకు కూడా విస్తరిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. స్థానికులకు 70శాతం ఉపాధి కల్పించే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కరోనా సమయంలో ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో తెలంగాణకు నయాపైసా కూడా రాలేదని స్పష్టంచేశారు.
