ఇప్పటిదాకా కేవలం 0.35ు మంది భారతీయులకు టీకా వేశారు. ఇదే వేగాన్ని పాటిస్తే దేశప్రజలందరికీ టీకాలు వేయడానికి 18 ఏళ్లు పడుతుంది.. లోక్‌సభలో కాంగ్రెస్ ధ్వజం!

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారిపై పోరాటంలో కీలకమైన వ్యాక్సిన్ ఎందుకు అందరికీ అందుబాటులోకి రావట్లేదు? టీకాలకు కొరత ఎందుకు ఏర్పడుతోంది? దేశప్రజలందరూ టీకా వేయించుకోవడానికి ఎన్నాళ్లు పడుతుంది? కనీసం 50 కోట్ల మందికి టీకాలు వేయడానికి ఎన్నిరోజులు పడుతుంది?… ఇలా వ్యాక్సిన్ ఉత్పత్తిపై, లభ్యతపై ప్రజల్లో ఎన్నో సందేహాలు. వాటికి సమాధానాలను పరిశీలిస్తే.. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఏటా ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో కోట్లాది మంది చిన్నారులకు వేసే వ్యాక్సిన్లలో సింహభాగం సీరమ్‌లో తయారయ్యేవే.
అలాంటి సంస్థ.. పలు దేశాలతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరా చేయలేక ఇబ్బంది పడుతోంది. భారతదేశం తన అవసరాలకు ప్రాధాన్యమివ్వాల్సిందిగా సూచించినందున.. కొవిషీల్డ్ కోసం ఎదురుచూస్తున్న దేశాలు ఓపిక పట్టాలని వేడుకొంటూ సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ఫిబ్రవరి 21న ట్వీట్ చేశారు. దీంతో.. బ్రిటన్‌కు రావాల్సిన వ్యాక్సిన్లను ఇండియా అడ్డుకుంటోందంటూ అక్కడి పత్రికలు పతాకశీర్షికలతో వార్తలు ప్రచురించాయి. కానీ, వాస్తవమేంటంటే.. ముడిపదార్థాల కొరత వల్ల సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సహా ప్రపంచంలోని పలు వ్యాక్సిన్ తయారీ సంస్థలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి.
నిజానికి.. మన దేశంలో కొవిషీల్డ్ వినియోగానికి అత్యవసర అనుమతులు రాకముందే సీరమ్ సంస్థ.. నిమిషానికి 5000 డోసుల ఉత్పత్తి సామర్థ్యంతో రంగంలోకి దిగింది. దీంతో, అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చే సమయానికే 4 కోట్ల డోసుల టీకాలను సిద్ధంగా ఉంచగలిగింది. కొవిషీల్డ్‌తోపాటు, అమెరికా సంస్థ నోవావాక్స్ అభివృద్ధి చేసిన టీకాను కూడా కలిపి.. నెలకు 10 కోట్ల డోసులకు పెంచుకుంటామని జనవరిలో ఆ సంస్థ తెలిపింది. కానీ.. సీరమ్ ఉత్పత్తి సామర్థ్యం ఇంకా 6-7 కోట్ల దగ్గరే ఉంది. అంత సామర్థ్యం ఉన్నా.. టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో సీరమ్ జోరు తగ్గింది. జాన్సన్ అండ్ జాన్సన్‌తో టీకా తయారీ ఒప్పందం కుదుర్చుకున్న బయొలాజికల్-ఈ (బయో-ఈ) కూడా ముడిపదార్థాల కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అమెరికా ఆంక్షలు ఎందుకు?
అమెరికా జనాభాలో దాదాపు 30 కోట్ల మందికి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది బైడెన్ సర్కారు ఆలోచన. అందుకు 60 కోట్ల డోసుల టీకా కావాలి. అందుకు తగిన ముడిపదార్థాలు కావాలి. వ్యాక్సిన్ ముడిపదార్థాలను ఎప్పటిలాగానే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే.. అమెరికన్లకు అవసరమైనన్ని టీకాలు ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే.. బైడెన్ సర్కారు.. రక్షణ ఉత్పత్తుల చట్టంతో టీకా ముడిపదార్థాల ఎగుమతిపై ఆంక్షలు విధించింది.
వేటిపై ఆంక్షలు?
వ్యాక్సిన్ తయారీలో అత్యంత కీలకమైన ముడిపదార్థాలు.. యాంటీవైరల్ ఏజెంట్లు, యాంటీ సెప్టిక్ ద్రవాలు, స్టెరైల్ వాటర్, వైరస్ డీఎన్‌ఏకు సంబంధించిన కొన్ని భాగాలు, గాజు సీసాలు (టీకా పంపిణీకి), సింగిల్ యూజ్ బయో రియాక్టర్ బ్యాగులు, సెల్ కల్చర్ మీడియా (కొవాగ్జిన్‌లాంటి ఇనాక్టివేటెడ్ టీకాల తయారీలో అత్యంత కీలకం), ఫిల్టర్లు, కొన్ని రసాయనాలు తదితరాలు.
మన కంపెనీల ఉత్పత్తి సామర్థ్యాలు..
ఈ ఏడాది ఆగస్టు నాటికి 60 కోట్ల డోసుల టీకాలను.. 30 కోట్ల మంది ప్రజలకు వేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. అంటే సగటున నెలకు 8.5 కోట్ల డోసులు కావాలి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యాన్ని సాధించడం కష్టమేనని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే.. సీరమ్ సామర్థ్యం ఇంకా నెలకు 6-7 కోట్లుగానే ఉంది. అందులోనే.. ‘కొవాక్స్ ఇనిషియేటివ్’కు 20 కోట్ల డోసులు ఇవ్వడానికి సీరమ్ సంస్థ అంగీకరించింది. వివిధ దేశాలకు 90 కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకా, 14.5 కోట్ల డోసుల నోవావాక్స్ టీకా ఇవ్వడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది.
అంటే.. సీరమ్ సంస్థ నెలకు ఉత్పత్తి చేసే 6-7 కోట్ల డోసుల్లో దాదాపు 4 కోట్ల డోసులే మనకు వస్తాయి. ఇక కొవాగ్జిన్ టీకాల సేకరణ, వినియోగం రెండూ తక్కువగానే ఉన్నాయి. తమ వద్ద 2 కోట్ల డోసుల టీకా ఉందని ఈ ఏడాది జనవరిలో భారత్ బయోటెక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఇప్పటిదాకా ప్రజలకు ఇచ్చిన డోసులే 40 లక్షల లోపున్నాయి.
తాజాగా 12 కోట్ల వ్యాక్సిన్లకు ప్రభుత్వం ఆర్డర్ ఇస్తే.. అందులో కొవాగ్జిన్ వాటా కేవలం 2 కోట్లే. మిగిలిన 10 కోట్లూ కొవిషీల్డ్ టీకాలే. అంటే ప్రస్తుతానికి కొవాగ్జిన్ టీకాల మీద పెద్దగా ఆశపెట్టుకోవాల్సిన పనిలేదు. ఫైజర్, మోడెర్నా టీకాలు విదేశాల్లో అందుబాటులో ఉన్నా.. మన వాతావరణ పరిస్థితులకు అవి అంతగా పనికిరావు.
రానున్న టీకాలు..
మరిన్ని టీకాలు ప్రస్తుతం.. ఫేజ్ 1, 2, 3.. ఇలా వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో.. రష్యా టీకా ‘స్ఫుత్నిక్ వి’కి అనుమతులు వస్తే.. సంవత్సరానికి దాదాపు 35 కోట్ల డోసుల టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే నెలకు దాదాపు మూడు కోట్ల డోసులు. ఇక.. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకొవ్ డి టీకాను 3 డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. దీని తయారీ ప్రారంభమైతే ఏడాదికి 15 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయి. అంటే నెలకు దాదాపుగా 1.25 కోట్ల డోసులు. అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ఇది. ఇండియాలో సీరమ్ సంస్థతో తయారీ ఒప్పందం ఉంది. దానికి వినియోగ అనుమతులు వస్తే.. నెలకు 4-5 కోట్ల కోవోవ్యాక్స్ డోసులు ఉత్పత్తి కావొచ్చు. ఇంకా.. బయో-ఈ తయారు చేసే జాన్సన్ అండ్ జాన్సన్ టీకా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నేజల్ టీకా (ముక్కు ద్వారా ఇచ్చేది).. ఇవన్నీ అందుబాటులోకి వస్తే.. ఈ ఏడాది చివరికి 30 కోట్ల మంది భారతీయులకు టీకా లక్ష్యాన్ని అందుకోవచ్చని.. వచ్చే ఏడాది చివరికి గణనీయ సంఖ్యలో ప్రజలకు టీకా వేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
భారత్ బయోటెక్ 70 కోట్ల డోసులు!
భారత్ బయోటెక్ సంస్థ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2021 చివరినాటికి 70 కోట్ల డోసులకు పెంచుకుంటామని మూడు నెలల క్రితం ప్రకటించింది. అందులో 20 కోట్ల డోసులు హైదరాబాద్‌లో తయారవుతాయని, మరో 50 కోట్ల డోసులు మూడు ఇతర నగరాల్లో తయారుచేస్తామని తెలిపింది. అదే నిజమైతే.. ఈ ఏడాది చివరికి కొవాగ్జిన్ డోసులు కూడా భారీసంఖ్యలో అందుబాటులోకి వస్తాయని భావించవచ్చు.
5.98 కోట్ల టీకాలు.. విదేశాలకు
టీకా దౌత్యం పేరుతో ఇప్పటిదాకా 76 దేశాలకు పంపిన వ్యాక్సిన్లు..
కానుకగా ఇచ్చినవి : 81,55,000
విక్రయం: 3,41,67,000
డబ్ల్యూహెచ్‌వో కొవాక్స్ కార్యక్రమానికి: 1,74,99,000
మొత్తం: 5,98,21,000
4,09,20,100
కొవిషీల్డ్
టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా
ఇచ్చిన టీకాల సంఖ్య 4,46,30,101.
అందులో ఏ టీకాలు ఎన్నంటే…
కొవాగ్జిన్ 37,10,001