బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ, రియా చక్రవర్తి ప్రధానంగా రూపొందిన ‘’చెహ్రే’’ సినిమా టీజర్ గురువారం విడుదలైంది. చిత్రనిర్మాతలు టీజర్‌ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తే, ఇమ్రాన్ హష్మీ మాత్రం తన ట్విట్టర్ హేండిల్ ద్వారా తన అభిమానుల కోసం అంటూ పండగ చేసుకున్నాడు. అన్నూ కపూర్ వాయిస్‌తో కొన్ని డైలాగ్‌లు వినిపించగా, అమితాబ్, ఇమ్రాన్ హష్మీ లుక్స్ టీజర్‌లో కనిపిస్తాయి. టీజర్‌తో పాటు, ఇమ్రాన్ హష్మీ ట్విట్టర్ అక్కౌంట్లో ‘’ Are you ready to face the game…… because the play in the court has already started. The teaser is out now. See Chehre in theatres on April 9th’’ అని మెసేజ్ పెట్టాడు. ఎంతైనా అమితాబ్ సినిమా కదా.. భయంకరమైన ఫాలోయింగ్ క్షణాలలో వచ్చేసింది. డైలాగ్స్ ఎఫెక్ట్‌తో టీజర్‌కి కొంత అట్రాక్షన్ ఏర్పడినా, ముఖ్యంగా ఈ టీజర్‌కి ఎక్కువగా, అంటే ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ పాప్యులారిటీ రావడానికి కారణం ఈ టీజర్‌లో అమితాబ్, ఇమ్రాన్ హష్మీలతో పాటూ ప్రముఖ పాత్రను పోషించిన రియా చక్రవర్తి ఇందులో లేకపోవడమే.

లోగడ కూడా చెహ్రే ప్రమోషనల్ క్యాంపైన్‌లో రియా ఎక్కడా కనిపించలేదు. లేదా నిర్మాతలు, దర్శకుడు ఇతర నటులు కూడబలుక్కుని రియాని మాయం చేశారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కొన్ని రోజులు ముందు చెహ్రే పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కూడా రియా చక్రవర్తి అందులో మిస్ అయినప్పుడు రియా చాలా బాధ పడిందని, అంత పెద్ద సినిమాలో అవకాశం రావడమే గగనమైతే, వచ్చినదానిలో తాను మిస్ అవడం పట్ల రియా కన్నీరు పెట్టుకుందని బాలీవుడ్ మీడియా అమెకు వత్తాసు పలికింది. ఇప్పుడు మళ్ళీ టీజర్‌లో.. రియాని టీజ్ చేయడానికే ఈ టీజర్ రిలీజ్ చేశారా అని కూడా కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు.
“2020లో రియా ఫేస్ చేసిన అవాంతరాల తర్వాత మళ్ళీ వృత్తిగత జీవితాన్ని సర్దుబాటు చేసుకోవడానికి రియా చాలా ప్రయత్నం చేస్తోంది. కానీ ఇటువంటి ఎదురుదెబ్బని మాత్రం ఆమె కలలో కూడా ఊహించలేదు. ఎదురుచూడలేదు. బహుశా బాలీవుడ్ ఆమె సెకెండ్ ఇన్నింగ్స్‌ని ఒప్పుకోవడం లేదేమోననిపిస్తోంది గతేడాది చాలా ఆటంకాలను రియా ఎదుర్కొంది. వాళ్ళు అనుకోవచ్చు ఇలా చేస్తే రియాని తొక్కేయొచ్చని. కానీ ఇది నిజమంటారా? ఆమె తప్పకుండా ఈ యుద్దంలో గెలుస్తుంది’’ అని రియా క్లోజ్ ఫ్రెండ్ చెబుతున్నాడు. రియా చక్రవర్తి చుట్టూ చాలా విచిత్రమైన చిక్కుముడులు అల్లుకుంటున్నాయి అని బాలీవుడ్‌లో పరిస్థితులు చెబుతున్నాయి. సుశాంత్ రాజ్‌పుత్ అభిమాని ఒకరైతే దాదాపుగా ట్విట్టర్ వేదికగా పెద్ద ఫైటే చేశాడు. రియాని పెట్టినందుకు చెహ్రే సినిమాని తరిమికొట్టమని. కొసమెరుపు ఏంటంటే రియా చక్రవర్తి జాతకం చూసిన ముంబై పండితులు మాత్రం రియా మళ్ళీ విజయవంతంగా సినిమాలలో రాణిస్తుందని చెబుతున్నారుట. మరి రియా గ్రహాలు ఏం చెబుతున్నాయో.. కాలమే ఆ తీర్పు చెప్పాలి.