తప్పుకుంటే క్యాష్‌… లేకుంటే కేస్‌!

0
256
Spread the love

పురపాలక ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం అధికార వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలతో టీడీపీ అభ్యర్థులు అల్లాడుతున్నారు. ఈ ఒత్తిళ్ల నుంచి వారిని కాపాడడం పార్టీ నేతలకు ప్రయాసగా మారింది. కొన్నిచోట్ల అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించగా, మరి కొన్నిచోట్ల అభ్యర్థులే ఇళ్లకు తాళాలు వేసి కుటుంబాలతో సహా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. నామినేషన్ల ఉపసంహరణల గడువు బుధవారం వరకు ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు.. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై ఒత్తిళ్లు తెచ్చి.. నామినేషన్లను ఉపసంహరింపచేసి తమ వారిని ఏకగ్రీవం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. కుదిరితే భారీ ఎత్తున నగదును ఇచ్చి దారిలోకి తెచ్చుకుంటున్నారు. ‘మాట వినని’ వారిని కేసులతో బెదిరించి లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకొంటే కార్పొరేషన్లలో అయితే రూ.25 లక్షల నుంచి 30 లక్షలు, మునిసిపాలిటీల్లో అయితే రూ.10 నుంచి 20 లక్షల వరకు ఇస్తామని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. రాజధానికి పొరుగున ఉన్న ఒక జిల్లాలో ఉన్న ఒక మంత్రి నియోజకవర్గంలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతున్నాయి.

టీడీపీ అభ్యర్థి ఎవరైనా తప్పుకొంటే రూ.25 లక్షలు ఇస్తామని ఆయన ఆఫర్‌ ఇచ్చి, తమ అభ్యర్థులతో రాయబారాలు పంపుతున్నారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. కోస్తా ప్రాంతంలోని ఒక నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి పెద్ద ఫలితం దక్కలేదు. దీంతో అక్కడి ఎమ్మెల్యే అదే నియోజకవర్గంలో జరగబోతున్న మునిసిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. వార్డు కౌన్సిలర్‌గా నామినేషన్‌ వేసిన టీడీపీ అభ్యర్థి ఎవరైనా తప్పుకొంటే రూ.20 లక్షలు ఇస్తామని ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రలోభాల నుంచి తమ అభ్యర్థులను కాపాడుకోడానికి అక్కడి టీడీపీ నేతలు తంటాలు పడుతున్నారు.

చిత్తూరులో మరో సమస్య

చిత్తూరు జిల్లాలోని టీడీపీ అభ్యర్థులు మరో రకమైన సమస్య ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి పోటీ నుంచి తప్పుకోవాలని హుకుం జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు పాత కేసులు తోడటం లేదా వారి బంధువుల కేసులు బయటకు తీయడం చేస్తున్నారు. ఒక మాజీ మేయర్‌ కొడుకుపై సరిగ్గా రెండు రోజుల ముందు పోలీసులు ఆకస్మికంగా కేసు నమోదు చేశారు. పోలీసుల నుంచి ఈ తరహా ఒత్తిడి తట్టుకోలేక నలుగురైదుగురు టీడీపీ అభ్యర్థులు ఇళ్లకు తాళాలు వేసి కుటుంబాలతో సహా నగరం వదిలి వెళ్లిపోయారు. చిత్తూరులో పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందని తెలియడం వల్లే టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం అక్కడకు వెళ్లే ప్రయత్నం చేశారు.

బెదిరింపులతో లొంగదీసుకుని

రాయలసీమలో వైసీపీ నేతల బెదిరింపులు, ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి. కర్నూలు కార్పొరేషన్‌లో ఏకంగా 11 మంది టీడీపీ అభ్యర్థులు పార్టీ మారిపోయారు. నామినేషన్లు వేసిన వారిలో ఎవరినో ఒకరిని వెతుక్కొని మళ్లీ పార్టీ అభ్యర్థిగా పెట్టుకోవాల్సి వచ్చింది. కొత్తగా నామినేషన్లకు అవకాశం ఇచ్చి ఉంటే బెదిరింపులు, ప్రలోభాలకు అవకాశం ఉండేది కాదని, ఎవరైనా లొంగిపోయినట్లు అనుమానం ఉంటే వారి స్థానంలో కొత్తవారిని పెట్టుకునేవారమని టీడీపీ నేతలు అంటున్నారు.

మంత్రి అప్పలరాజు ఇలాకాలో..

శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి అప్పలరాజు నియోజకవర్గం పలాసలో జరుగుతున్న ఎన్నికల్లో నలుగురు టీడీపీ అభ్యర్థులను మంత్రి తమ పార్టీలో చేర్చేసుకున్నారు. మిగిలిన అభ్యర్థులపై కూడా దృష్టి పెట్టడంతో వారిని టీడీపీ నేతలు శిబిరాలకు తరలించారు. ప్రచారం చేయడం మాని ముందు అభ్యర్థులను కాపాడుకోవాల్సి వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here