వెబ్ సిరీస్ చూస్తూ.. 75 మంది ప్రాణాలు కాపాడిన యువకుడు..

0
349
Spread the love

ఆ యవకుడు రాత్రంతా మేలుకోనే ఉన్నాడు. నిద్ర పట్టడం లేదు. ఉదయం నాలుగు గంటలవుతుంది. అతడు ఫోన్ లో ఏదో సినిమా చూస్తున్నాడు. ఇంతలో కిచెన్ లో ఏదో శబ్దం వినిపించింది. పిల్లి వచ్చిందేమో అని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మరోసారి కిచెన్ నుంచి సౌండ్. ఆ యువకుడికి అనుమానం వచ్చింది. వెళ్లి చూశాడు. సన్నగా దుమ్ము. కిచెన్ లో సామాన్లన్నీ అటూ ఇటూ వణుకుతున్నాయి. అప్పుడర్థమైంది ఆ యువకుడికి. ఇల్లు కూలబోతుందని.. అంతే హఠాత్తుగా అక్కడ్నుంచి పరిగెత్తుకెళ్లి 75 మంది ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివిగో..

మహారాష్ట్ర లోని ముంబయికి సమీపంలో ఉన్న డొంబివ్లి లో గత గురువారం (అక్టోబర్ 29న) ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న కునాల్ మోహైత్.. రెండస్తుల బిల్డింగ్ లో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి అందరూ పడుకున్నా.. నిద్ర రాక ఫోన్ లో వెబ్ సిరీస్ చూస్తున్నాడు. సమయం నాలుగవుతుండగా.. ఇంటిలోని కిచెన్ లో ఏదో శబ్దం రావడంతో అనుమానం వచ్చిన కునాల్.. అక్కడికి వెళ్లి చూశాడు. దీంతో మెల్లమెల్లగా అది కూలుతున్నట్టు అనిపించింది. దీంతో పరిగెత్తుకుని వెళ్లిన కునాల్.. ముందు తల్లిదండ్రులను నిద్రలేపి అక్కడ్నుంచి వారిని కిందికి పంపించాడు. అనంతరం ఆ బిల్డింగ్ లో నివసిస్తున్నమిగతావాళ్లను నిద్ర లేపి అందరినీ రక్షించాడు.
కాగా, తొమ్మిది నెలల క్రితమే ఈ భవనాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించినా అక్కడ నివసిస్తున్నవారంతా వారి మాటలు పట్టించుకోలేదు. అంతేగాక వారంతా నిరుపేద కూలీలు. దినసరి కూలీలుగా పనిచేసుకుంటూ బతుకులు వెల్లదీస్తున్నారు. కానీ బిల్డింగ్ మాత్రం పాత కాలం నాటిది కావడంతో గతంలోనే అది కూలడానికి సిద్ధంగా ఉండేది. మొన్న కురిసిన వర్షాలకు అది మరింత శిథిలావస్థకు చేరుకుని గురువారం కూలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here