తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి రంగంలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విటర్ ద్వారా ఈ విషయం తెలియజేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని బలపరచాలని నిర్ణయించినట్లు పవన్ వెల్లడించారు. ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులతో పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో్‌షతో లోతైన చర్చ జరిగిందన్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని వారు గట్టిగా చెప్పారని తెలిపారు. ‘జనసేన అభ్యర్థి పోటీ చేయడం కంటే తిరుపతి అభివృద్ధి ముఖ్యమని భావించాం.

అందరికీ ఆమోదయోగ్యుడైన, బలమైన అభ్యర్థి ఉంటూ తప్పకుండా ఈ స్థానాన్ని బీజేపీకి వదిలిపెడతామని ఆది నుంచీ చెబుతున్నాం. బీజేపీ అభ్యర్థికి విజయం సాధించగల సత్తా ఉందని భావించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. తిరుపతి స్థానాన్ని 1999లో బీజేపీ కైవసం చేసుకున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం’ అని పేర్కొన్నారు. ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటి రక్షణకు బీజేపీ తగు చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ఉందన్నారు. రాష్ట్రంలో అరాచక శక్తుల పీచమణచడానికి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల మాదిరిగా తిరుపతిలో పోరాటం చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అగ్రనాయకులు పలుమార్లు జరిగిన ఉభయ పార్టీల సమావేశాల్లో స్పష్టం చేశారు.
వైసీపీ ఆగడాలకు దీటైన సమాధానం చెబుతామని వారు చెబుతున్నారు’ అని తెలిపారు. జనసేన పక్షాన మేం ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ, నాయకులు, జెండా మోసే కార్యకర్తలు సంస్థాగతంగా బలపడడానికేనని గమనిస్తారని ఆశిస్తున్నామన్నారు. ‘తిరుపతిపై నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు దూరదృష్టితో ఆలోచిస్తాయని ఆశిస్తున్నాను. తిరుపతిలో విజయం కోసం కృషి చేద్దాం’ అని పిలుపిచ్చారు.
అభ్యర్థిని నాయకత్వం ప్రకటిస్తుంది: వీర్రాజు
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీయే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విటర్‌లో వెల్లడించారు. జనసేన నేత పవన్ కల్యాణ్‌తో జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభ్యర్ధి ఎవరనే వివరాలను కేంద్ర నాయకత్వం ప్రకటిస్తుందన్నారు.