హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఓ కేసుకు సంబంధించి ఇచ్చిన 18 పేజీల తీర్పులో భాషపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.‘సుదీర్ఘ వాక్యాలు, మధ్య మధ్యలో ఎందుకో కామా పెట్టారు. నాకైతే ఏమీ అర్థం కానట్లు అనిపించింది. నా భాషా సామర్థ్యంపై నాకే అనుమనం వచ్చింది’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ సందర్భంగా ‘రాత్రి 10.10కి చదవడం మొదలు పెట్టాను. 10.55కి పూర్తయింది. ఓరి దేవుడో.. అప్పటికి తల తిరిగిపోయింది. టైగర్‌బామ్ రాసుకున్నా’ అని జస్జిస్ షా నివ్వెరపోయారు. ఈ ఒక్క కేసులోనే కాదని, పదే పదే ఇలాగే జరుగుతోందన్నారు. సామాన్య కక్షదారులకు సైతం అర్థమయ్యేలా సరళంగా తీర్పు రాయాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

ఒక్కరే మహిళా జడ్జి ఉన్నారు..
‘జస్టిస్ ఇందు మల్హోత్రా పదవీ విరమణతో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో ఇక ఒక్కరే మహిళా న్యాయమూర్తి విధుల్లో ఉంటారు. ఇది చింతించాల్సిన విషయం. ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది’ అని జస్టిస్ చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తొలి మహిళా న్యాయవాది, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా పదవీ విరమణ సందర్భంగా సుప్రీం కోర్టు యంగ్ లాయర్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఇందు మల్హోత్రా మాట్లాడుతూ.. యువ న్యాయవాదుల వస్త్రదారణపై సూచనలు చేశారు. వృత్తిలో ఉన్నత స్థాయికి చేరడానికి నడవడిక చాలా ముఖ్యమన్నారు. దానికి వస్త్రాధారణ ఎంతో దోహదపడుతుందన్నారు. సమయపాలన ప్రధానమైనదని చెప్పారు. కొందరు న్యాయవాదుల వృత్తిపరమైన, నాగరికమైన వస్త్రాధారణ తనను పలుమార్లు ఆకట్టుకుందని చెప్పారు.