తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి విషయంలో సహాయ నిరాకరణ చేస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నవజాత శిశువు లాంటి కొత్త రాష్ట్రానికి నిలదొక్కుకోవడానికి అన్ని రకాలా సాయం అందించాల్సిన బాధ్యతను కేంద్రం పూర్తిగా విస్మరించిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు. తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆత్మనిర్బర్ భారత్ లాంటి నినాదాలు ఇస్తే సరిపోదని, దాన్ని ఆచరణలో చూపాలని అన్నారు. రాష్ట్రాలతో కలిసి పని చేస్తేనే కేంద్రం నినాదాలు వాస్తవ రూపం దాలుస్తాయని చెప్పారు. 24 గంటల కరెంటు, సింగిల్ విండో అనుమతుల విధానంతో 15 వేల కంపెనీలు, 2.12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించామని, 15 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ కృషిని ప్రపంచమంతా అభినందిస్తుంటే కేంద్రం మాత్రం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదన్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్రాన్ని ప్రశంసించడం తప్ప అణా పైసా సాయం చేయడం లేదని, రాష్ట్ర ప్రజలకు శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు దక్కాయని వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రం కోసం గొంతు విప్పాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.

ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు…
రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, విద్యా సంస్ధల ఏర్పాటును గాలికొదిలేసింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరమే లేదని తేల్చేసి, తెలంగాణ వ్యతిరేకిగా నిరూపించుకుంది.
పారిశ్రామిక అభివృద్ధికి ప్రాణాధారమైన రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలన్న మా విజ్ఞప్తులకూ కేంద్రం స్పందించడం లేదు.
ఇప్పటికే 8 రైల్వే లైన్ల నిర్మాణాలు పెండింగులో ఉన్నాయి. మరో మూడు సర్వేలు పెండింగులో ఉన్నాయి. 4 కొత్త లైన్ల ప్రతిపాదనలపైనా ఎలాంటి స్పందనా లేదు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వాలని, ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరాం. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పాం. కేంద్రం నుంచి స్పందన లేదు.
రాష్ట్రం ఏర్పాటుకు ముందే హైదరాబాద్‌కు దక్కిన ఐటీఐఆర్‌ను ఎన్‌డీఏ సర్కారు రద్దు చేసింది. తద్వారా రాష్ట్రంలో ఐటీపరిశ్రమ వృద్దిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినా, రాష్ట్ర ఐటీరంగం దూసుకుపోతోంది.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రెండు ఎలకా్ట్రనిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లకు అద్భుత స్పందన వచ్చింది. మరో ఈఎంసీ ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం స్పందించడం లేదు.
హైదరాబాద్ ఫార్మా సిటీకి ఆత్మనిర్బర్ భారత్ కింద ఎలాంటి మద్దతు లభించడం లేదు. మౌలిక వసతుల కోసం 3900 కోట్లు అడిగాం. స్పందన లేదు.
చేయాల్సిన సాయం చేయకుండా ఫార్మా పార్కు స్కీమ్ అంటూ.. చాటలో తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్లు ఏడాదిగా రాష్ట్రాల మధ్య అనారోగ్యకరమైన పోటీ పెట్టి కాలయాపన చేస్తోంది.
ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు తెలంగాణలోనే తయారవుతోంది. ప్రపంచ దేశాల రాయబారులు వచ్చి మన జినోమ్ వ్యాలీ ప్రాధాన్యతను గుర్తిస్తుంటే కేంద్రం మాత్రం ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు.
ఇక్కడ కంపెనీలు ఉంటే వ్యాక్సిన్ పరీక్షల కోసం వందల కిలోమీటర్ల దూరంలోని కసౌలీలో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ లేబరేటరీకి వెళ్లాల్సి వస్తోంది. కనీసం టెస్టింగ్ లేబరేటరీని ఇక్కడ పెట్టాలన్నా ఖాతరు చేయడం లేదు.
హైదరాబాదులో అద్భుతమైన ఎయురోస్పేస్, డిఫెన్స్ ఎకో సిస్టం ఉన్నా కూడా డిఫెన్స్ ఇండస్ర్టియల్ కారిడార్లలో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు. బుందేల్‌ఖండ్‌కు కేటాయించి పరిశ్రమ అవసరాలకన్నా రాజకీయాలే ముఖ్యమని కేంద్రం చాటింది. కేంద్రం సహకారం లేకుండా డిఫెన్స్ ఇంక్యుబేటర్ మరియు సెంటర్ అఫ్ ఎక్స్‌లెన్స్ నడుపుకుంటాం.. మంజూరు చేయండన్నా ఉలుకూ పలుకూ లేదు.
మెగా క్లస్టర్ పాలసీలో భాగంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు సాయం అందించమని ఎన్నిసార్లో అడిగాం. ఒక్క రూపాయి కేటాయించలేదు.
సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్, జాతీయ టెక్స్‌టైల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, హ్యాండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ.. ఇవన్నీ అడగ్గా స్పందన లేదు.
తెలంగాణకు డ్రైపోర్టు అడిగాం. పట్టించుకోలేదు.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించిన 23 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు దక్కలేదు .
జహీరాబాద్ నిమ్జ్ మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు అడిగితే పైసా ఇవ్వలేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 7 శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరగలవని కేటీఆర్ చెప్పారు. 2013-14లో రూ.57,000 కోట్లు ఉండేవని గుర్తు చేశారు.
ఉద్యోగులతో టీఆర్‌ఎ్‌సకు పేగు బంధం
ప్రభుత్వ ఉద్యోగులకు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం పేగు బంధం లాంటిదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు అనేక మినహాయింపులు కల్పించి ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. లక్షా 33 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు తెలిపారు. మరో 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో శుక్రవారం కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు.