ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో 1.5 కి.మీ నుండి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటంతో గురు, శుక్ర వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. వరంగల్ రూరల్, మహబూబాబాద్, ములుగు, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం మోస్తరు వాన పడింది. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి. నాగోల్, అడ్డగుట్ట ప్రాంతాల్లో 2.9 సెం.మీ, ఖైరతాబాద్‌లో 2.8, రెయిన్ బజార్, డబీర్‌పురా, మల్లాపూర్, తిరుమలగిరి, అస్మన్‌ఘాట్, మెట్టుగూడ, మైత్రీవనం ప్రాంతాల్లో 2.8 సెం.మీ వర్షపాతం నమోదయింది. నగరంలో నాలుగు రోజుల క్రితం 33.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా, శుక్రవారం 27.8 డిగ్రీలు నమోదయింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కాగా, దక్షిణ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. దీంతో అకాల వర్షాలు తగ్గిపోయి శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.

ఆదిలాబాద్‌ను వణికిస్తున్న చలి
ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం చిరు జల్లులు కురిశాయి. బోథ్‌లో 15.4, భీంపూర్‌లో 15.5 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చల్లని ఈదురు గాలులతో జనం వణికిపోతున్నారు. కొన్నిచోట్ల పగటి పూటనే చలి మంటలు వేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, డిచ్‌పల్లి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కాగా, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి పరిధిలోని తుమ్మలపల్లికి చెందిన కుర్వ వెంకటేశ్(22) మిర్చిపై తట్లు కప్పేందుకు పొలానికి వెళ్లాడు. అతడు చేనులో పని చేస్తుండగా 20 అడుగుల దూరంలో పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.