హైదరాబాద్: ఊహించినట్లే- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె., ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. పూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రవేశించారు. త్వరలోనే కొత్త పార్టీని పెట్టబోతోన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) పేరుతో కొత్త రాజకీయ పక్షాన్ని ప్రారంభించనున్నారు. వచ్చేనెల పార్టీ పేరును అధికారికంగా ప్రకటించబోతోన్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అప్పుడే ఆరంభం కానుంది.
కొద్దిసేపటి కిందటే ఆమె హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని నివాసంలో వైఎస్సార్ అభిమానులు, వైసీపీ సానుభూతిపరులతో సమావేశం అయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం అవసరమైన కసరత్తు త్వరలోనే చేపట్టబోతోన్నారని అంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, సానుభూతిపరులతో జిల్లాలవారీగా నిర్వహిస్తోన్న వరుస భేటీల అనంతరం పార్టీ ప్రకటన చేస్తారనే ప్రచారం సాగుతోంది.
అదే సమయంలో భారీ బహిరంగను నిర్వహించాలని వైఎస్ షర్మిల భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కొండా రాఘవరెడ్డి పర్యవేక్షిస్తారని సమాచారం. చేవెళ్ల.. వైఎస్సార్‌తో ప్రత్యేక అనుబంధం ఉన్న ప్రాంతం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ప్రజా ప్రస్థానం పేరుతో చేపట్టిన 1500 కిలోమీటర్ల పాదయాత్రకు తొలి అడుగు పడిందక్కడే. కాంగ్రెస్ మాజీ నాయకురాలు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గం ఇది.

చేవెళ్ల నుంచే మహా ప్రస్థానాన్ని ప్రారంభించారు..వైఎస్సార్. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకూ ఆయన పాదయాత్ర సాగింది. ఆ తరువాత ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. అదే సెంటిమెంట్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో వైఎస్ షర్మిల.. ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తారనే ప్రచారం సాగుతోంది. చేవెళ్లలోనే పార్టీ పేరును ప్రకటించడంతో పాటు అయిదు లక్షలమందితో బహిరంగ సభను నిర్వహిస్తారని చెబుతున్నారు