మరో సిటింగ్ సీటును ఎట్టిపరిస్థితుల్లో కోల్పోరాదన్న పట్టుదలతో అధికార టీఆర్‌ఎస్..! తమకు పట్టున్న నియోజకవర్గంలో గెలిచి వరుస ఓటముల పరంపరకు ముగింపు పలకాలన్న కసితో కాంగ్రెస్..! మరోసారి సత్తా చాటి.. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని నిరూపించాలన్న తపనతో బీజేపీ. ఇలా అన్ని పార్టీలకూ నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. అయితే అభ్యర్థి ఎంపికే అతిపెద్ద సమస్యగా ఉంది. కాంగ్రెస్ ఒక్కటే అభ్యర్థి విషయంలో పూర్తి స్పష్టతతో ఉంది. ఇప్పటికే తమ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి పేరును ఖరారు చేసి ప్రచారానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. టీఆర్‌ఎస్, బీజేపీ మాత్రం అభ్యర్థి విషయంలో తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

సాగర్ ఉప ఎన్నికపై సర్వే జరిపించామని, 48 శాతానికి పైగా ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థికే దక్కనున్నాయని ఇటీవల మంత్రుల సమావేశంలో సీఎం కేసీఆర్ అన్న విషయం తెలిసిందే. కాగా, ఆ సర్వేలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే సానుకూలమన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ను స్థానికేతరుడైనందున పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇచ్చినా సెంటిమెంట్ పనిచేయలేదని, సాగర్‌లోనూ భగత్ విషయంలో అలాగే జరుగుతుందంటూ స్థానిక ఆశావహులు అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది.
అయితే స్థానికుడైన యాదవ సామాజికవర్గం నేతకే టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ గత మూడు రోజుల్లో ముగ్గురు స్థానిక (యాదవ) నేతలతో స్వయంగా ఫోన్లో మాట్లాడటం దీనినే సూచిస్తోందని అంటున్నారు. అయితే స్థానిక ఆశావహుల్లో జానారెడ్డి వంటి సీనియర్ నేతను ఢీ కొట్టగల నేత ఎవరన్నదానిపైనా పార్టీలో స్పష్టత లేదు. పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని సర్వేలో తేలినట్లు సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో ఏ మాత్రం పొరపాటు దొర్లినా అది కాంగ్రె్‌సకు కలిసి వస్తుందన్న ఆందోళన టీఆర్‌ఎస్ వర్గాల్లో నెలకొని ఉంది. ఈ సిటింగ్ సీటునూ పోగొట్టుకుంటే పార్టీలో అసమ్మతి స్వరాలు బలపడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టీఆర్‌ఎస్ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఎలాంటి అసమ్మతి తలనొప్పులు లేకుండా ప్రస్తుతం తన ప్రచారాన్ని సాఫీగా చేసుకుంటున్నారు.
సాగర్‌లో అన్నీ తమకు కలిసివచ్చే అంశాలే ఉన్నాయని ఆ పార్టీ భావిస్తోంది. టీడీపీ మినహా ఇతర పార్టీలు ఇంతవరకూ అభ్యర్థిని ఖరారు చేయకపోవడం, పార్టీలో సహజంగా ఉండే అసమ్మతి ఇక్కడ లేకపోవడం, సాగర్‌లో గెలిస్తేనే పార్టీకీ, తమకూ మనుగడ ఉంటుందున్న భావన పార్టీ నేతల్లోనూ ఏర్పడడం తమకు సానుకూల అశాలని చెబుతున్నారు.
ముఖ్యంగా జానారెడ్డి వంటి సీనియర్ నేత అభ్యర్థి కావడంతో గెలిచాక ఫిరాయింపులు ఉండవన్న విశ్వాసమూ ఓటర్లలో ఏర్పడిందని కాంగ్రెస్ నేత ఒకరు అభిప్రాయ పడ్డారు. అయితే విజయం నల్లేరుపై నడకేమీ కాదన్న అభిప్రాయమూ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయంగా ఎదిగే దిశగా సాగర్ ఉప ఎన్నిక ఒక అవకాశంగా వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే అక్కడ ఇద్దరు ఇన్‌చార్జులను నియమించింది.
గుర్రంబోడు భూములపై ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించిన బీజేపీ.. తద్వారా హుజూర్‌నగర్‌తోపాటు సాగర్ నియోజకవర్గ గిరిజనులనూ ఆకర్షించే ప్రయత్నం చేసింది. కాగా, బీజేపీ టికెట్ కోసం పోటీలో ప్రధానంగా స్థానిక నేతలు నివేదితారెడ్డి, కడారి అంజయ్య యాదవ్, రవికుమార్ నాయక్, ఇంద్రసేనారెడ్డి ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే టీఆర్‌ఎస్ ఎంపిక చేసే అభ్యర్థిని బట్టి సామాజిక అంచనాల ఆధారంగా తమ అభ్యర్థిపై నిర్ణయం ఉంటుందని బీజేపీ నేత ఒకరు తెలిపారు. ఇక టీడీపీ కూడా ఈ స్థానంలో అభ్యర్థిగా మువ్వా అరుణ్‌కుమార్‌ను ప్రకటించింది.
‘సాగర్’ అభ్యర్థిపై సీఎం కసరత్తు
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు టీఆర్‌ఎస్ అభ్యర్థిని ఖరారు చేసే పనిలో సీఎం కేసీఆర్ తలమునకలయ్యారు. గత మూడు రోజులుగా నియోజకవర్గానికి చెందిన ముగ్గురు నేతలకు కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి వివరాలు సేకరించారు. త్రిపురారం మండలానికి చెందిన పెద్దబోయిన శ్రీనివాస్ యాదవ్, నిడమనూరు మండలానికి చెందిన మన్నెం రంజిత్‌యాదవ్, కట్టెబోయిన గురవయ్య యాదవ్‌లకు సీఎం ఫోన్ చేసి మాట్లాడారు.
‘ఎక్కడైనా ల్యాండ్ లైన్ నంబర్‌లో సిద్ధంగా ఉండండి, సీఎంగారు మీతో మాట్లాడతారు’ అంటూ ఎంపీ సంతోష్‌కుమార్ నుంచి సమాచారం అందడంతో రేసులో లేని నేతలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ల్యాండ్ లైన్ నంబరు చెప్పిన తరువాత సీఎం లైన్‌లోకి వచ్చారు.
‘‘మీ గురించి విన్నాం. మీ సామాజికవర్గం ఓట్లు నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి? మీరు అభ్యర్థి అయితే మీ సామాజికవర్గం అంతా మీతో ర్యాలీ అవుతుందా? జానారెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన అక్కడక్కడ కాంగ్రెస్ కండువాలు కప్పతున్నారు కదా? యాదవులకు టికెట్ ఇస్తే బీజేపీ నుంచి కడారి అంజయ్య పోటీలో లేకుండా చూసుకోగలుతారా? మీరు టీఆర్‌ఎస్‌లో ఎప్పుడు చేరారు?’’ అంటూ సీఎం ప్రశ్నలు వేశారు. ‘‘మీకు మంచి పేరుంది, మీ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నాం’’ అని తెలిపారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు పై ముగ్గురి వివరాలు సేకరించారు.