అవినీతి ‘ఆత్మ’లు!

0
280
Spread the love

వ్యయసాయంలో వస్తున్న కొత్త పోకడలను అందిపుచ్చుకోవటానికి, అన్నదాతల్లో అవగాహన పెంపొందించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలుచేస్తున్న ‘వ్యవసాయ- సాంకేతిక యాజమాన్య సంస్థ’(ఆత్మ), వ్యవసాయశాఖ అధికారులకు బంగారుబాతులా మారింది. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్లుగా… ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారులు(డీఏవోలే), ఏడీఏ కన్వీనర్‌గా ఉండే బ్లాక్‌ టెక్నాలజీ బృందాలతో కలిసి ‘ఆత్మ’ నిధులు కొల్లగొడుతున్నారు. 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న ‘ఆత్మ’ ప్రాజెక్టు పేరుతో ఏడేండ్లలో రూ. 70.56 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో సింహభాగం దొంగబిల్లులే ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.‘ఆత్మ’ ప్రాజెక్టులో ప్రధానంగా మూడు అంశాలున్నాయి. ఒకటి ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించటం! ఒక్క ప్రదర్శన క్షేత్రం నిర్వహిస్తే రూ. 4 వేలు చెల్లిస్తారు. ఇలా మండలానికి 10- 20 చొప్పున బడ్జెట్‌కు అనుగుణంగా నిర్వహించుకోవచ్చు. రెండోది… విజ్ఞాన- విహార యాత్రలు! రైతులకు వ్యవసాయంలో కొత్త అంశాలపై అవగాహన కలిగించటానికి డివిజన్‌, జిల్లా, రాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లోగానీ విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లొచ్చు. రైతుల సంఖ్యకు అనుగుణంగా దీనికి బడ్జెట్‌ ఉంటుంది.

మూడోది రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించటం! ఈ మూడు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సరిగా జరగటంలేదు. రైతులకు శిక్షణలు, ప్రదర్శనక్షేత్రాలు నిర్వహించినట్లు, విజ్ఞాన- విహారయాత్రలకు తీసుకెళ్లినట్లు తప్పుడు బిల్లులు సమర్పించి ప్రాజెక్టు అధికారులే నిధులు మింగేస్తున్నారు. అయితే ఆత్మ నిధులు ఆడిట్‌ను ప్రైవేటు ఆడిటర్లతో చేయిస్తున్నారు. వారికి పర్సంటేజీ ముట్టజెప్పి ఆడిట్‌ చేయిస్తున్నారు. ఆడిట్‌ పూర్తయితే చాలు… అక్రమాలు జరిగినా, జరగకపోయినా ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అకౌంట్లు మొత్తం క్లోజ్‌ చేస్తున్నారు ఆ వివరాలను గోప్యంగా పెడుతున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు డైరెక్టర్‌ నేరుగా నిధులు వాడుకోవటానికి వెసులుబాటులేదు. ప్రతి డివిజన్‌కు ఉండే ‘బ్లాక్‌ టెక్నాలజీ టీమ్‌’(బీటీటీ)ల ద్వారా మాత్రమే ఖర్చు చేయటానికి వీలుంటుంది. బీటీటీకి ఏడీఏ కన్వీనర్‌గా, ఒక రైతు చైర్మన్‌గా ఉంటారు. 15- 20 మంది రైతులు ఇందులో సభ్యులుగా ఉంటారు. జిల్లాకు వచ్చిన నిధులను సంబంధిత పీడీ… డివిజన్లకు డివైడ్‌ చేయాలి. పీడీలుగా డీఏవోలే ఇన్‌చార్జిగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న 95మంది బీటీఎంలు, 188 మంది ఏటీఎంలు వీరి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. వీరికితోడుగా ఏవోలు, ఏడీఏలు, డీడీఏలు, జేడీఏలు ఆత్మ నిధుల వి(దుర్వి)నియోగంలో క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు.

ఆదిలాబాద్‌లో బండారం బట్టబయలు

ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిఽధిలో ఉన్న వ్యవసాయ డివిజన్లకు ‘ఆత్మ’ నిధుల విభజన చేయలేదు. బీటీటీలకు బదులు నేరుగా పీడీ కార్యాలయం నుంచే నిధులు ఖర్చు చేశారు. రైతులకు శిక్షణ కార్యక్రమాలు, ప్రదర్శన క్షేత్రాలు, విజ్ఞాన యాత్రలు నిర్వహించినట్లు దొంగ బిల్లులు సమర్పించి నేరుగా ప్రాజెక్టు డైరెక్టరే నిధులు డ్రా చేశారు. ఈ అంశాలను అప్పటి ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ డి. దివ్య ధ్రువీకరించారు. 2020 ఫిబ్రవరి మూడో తేదీన రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అయితే అప్పుడు కమిషనరేట్‌ లో ఉండే అధికారులు పట్టించుకోకపోవటంతో ఆత్మ నిధుల దుర్వినియోగం కేసు నీరుగారిపోయింది. 2017-18 లో రూ. 37.47 లక్షలు, 2018- 19 లో రూ. 43.69 లక్షలు, 2019- 20 లో రూ. 29.97 లక్షలు సదరు ప్రాజెక్టు డైరెక్టర్‌ మింగేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదేతరహాలో ఉమ్మడి వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో… శిక్షణలు, విజ్ఞాన- విహారయాత్రలు, ప్రదర్శన క్షేత్రాల పేరుతో నిధులు దుర్వినియోగం అయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కానీ ప్రాథమిక విచారణలు జరిపించి వదిలేస్తున్నారే తప్ప… సమగ్ర విచారణలు చేపట్టడంలేదు. నిధుల రికవరీ చేయటంలేదు. నిధుల దుర్వినియోగంలో హస్తమున్న అధికారులకు ఫోకల్‌ పోస్టులు ఇస్తూ… కమిషనరేట్‌ ఉన్నతాధికారులే అండదండగా ఉంటున్నారు. విచారణ జరిపిస్తే.. ఆదిలాబాద్‌ తరహాలో అన్ని జిల్లాల అఽధికారుల బండారం బయటపడే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here