ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌కు 25 కోట్లు

0
377
Spread the love

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జరపనున్న ‘‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’ను తెలంగాణలో ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. వీటి నిర్వహణకుగాను కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవాలకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం జరుగుతున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతం పోషించిన పాత్ర ప్రత్యేకమైనదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా స్వయం పాలనలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, దేశాభ్యుదయంలో తెలంగాణది ఉజ్వలమైన భాగస్వామ్యమని తెలిపారు.

ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది అంటే..2022 ఆగస్టు 15 వరకు 75 వారాలపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వ్యవహరిస్తారని, సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, మునిసిపల్‌ శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ, విద్యాశాఖల కార్యదర్శులు, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌, సభ్య కార్యదర్శిగా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా ఉంటారని సీఎం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎ్‌సను ఆదేశించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యాన్ని, విధి విధానాలను, లక్ష్యాలను ప్రధాని వివరించారు. ఆయా రాష్ట్రాలు 75 వారాలపాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరపాలి..

పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర సమరయోధులను, అమరవీరులను స్మరించుకుని జోహార్లు అర్పించాలన్నారు.ప్రధానితో వీడియో కాన్పరెన్స్‌ అనంతరం.. కార్యక్రమ నిర్వహణ విధి విధానాల కోసం, సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 75వ స్వాతంత్ర్యోత్సవ ఉత్సవాలకు గుర్తుగా సంజీవయ్య పార్కులో ఉన్న జాతీయ పతాకం తరహాలో తెలంగాణ వ్యాప్తంగా 75 ముఖ్యమైన ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగరేయాలని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా వివిధ స్థాయిల్లో కవి సమ్మేళనాలు, వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని సూచించారు. మార్చి 12న ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకావిష్కరణ, పోలీస్‌ మార్చ్‌, గాలిలో బెలూన్లు వదలడం తదితర దేశభక్తి కార్యక్రమాలుంటాయని సీఎం తెలిపారు. కాగా, ఆజాదీ కా మహోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా మార్చి 12న హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో, వరంగల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్‌, వరంగల్‌లో ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌ రాజు, డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ తదిరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here