
రాష్ట్రంలో కరోనా పరీక్షలపై హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, శుభ, అశుభ కార్యాలకు పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులను అనుమతించాలని స్పష్టం చేసింది. ఉత్సవాలలో పెద్దఎత్తున ప్రజలు గుమిగూడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సరిహద్దుల్లో స్ర్కీనింగ్ చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు పరీక్షలు చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తే.. అతి సాదాసీదాగా కౌంటర్ దాఖలు చేయడం పట్ల సీజే హిమా కోహ్లీ, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను(ఆర్‌ఏటీ) తగ్గించి కచ్చితమైన ఫలితాలు ఇచ్చే ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని కోర్టు ఆదేశిస్తే.. పలు జిల్లా కేంద్రాల్లో ఆర్‌ఏటీ టెస్టుల్లో 10ు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయలేదని ఆక్షేపించింది. మార్చి 16 నుంచి 31వరకు జిల్లాల వారీ డేటాను ఎత్తిచూపింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలను తగ్గించారని, అధికారుల చర్య కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే విధంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘మార్చి 16 నుంచి 31వరకు 9,11,661 కరోనా టెస్టులు చేశారు. అందులో 7,63,136 ఆర్‌ఏటీలే. కేవలం 1,48,525 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడం విస్మయం కలిగిస్తోంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉంటేనే అనుమతిస్తామని ఎందుకు చెప్పడం లేదని నిలదీసింది.
ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో టెస్టులు చేశామని ప్రభుత్వం తన నివేదికలో తెలిపిందని, ఏ ప్రాంతంలో ఎన్ని టెస్టులు చేశారో వివరించలేదని పేర్కొంది. పాఠశాలలు, కాలేజీలు మూసి వేశామని, మాస్కు తప్పనిసరి చేశామని చెబుతున్న ప్రభుత్వం.. బార్లు, క్లబ్‌లు, పబ్‌లను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించింది. హోటళ్ళు, జిమ్‌లు, సినిమాహాళ్ళలో ఆక్యుపెన్సీ రేట్‌ను ఎందుకు తగ్గించడం లేదని ధర్మాసనం అడిగింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 3.14లక్షలకు చేరుకున్నట్లు ప్రభుత్వం పేర్కొందని, అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వారానికి ఏడు రోజులూ…నిత్యం 24 గంటలపాటు నిర్వహిస్తున్నారా అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. 24/7 నిరంతరం వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై తగిన సమాచారం లేదని ఏజీ కోర్టుకు తెలిపారు. 48 గంటల్లో సవివరంగా తాజా నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘టెస్టులు చేయించుకున్న వారిలో పాజిటివ్ శాతం, రోగులలో మరణాల శాతం ఎంత? ఏ టెస్టులు చేస్తున్నారు? పరీక్షా కేంద్రాలు పెంచారా? విమానాశ్రయాలు, రైళ్లు, బస్సుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే వారికి ఎలాంటి టెస్టులు చేస్తున్నారు? రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీరో సర్వేలెన్స్‌లో వచ్చిన ఫలితాలు ఏంటి?’ తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఐసోలేషన్ కేంద్రాలపై ఆరా
కరోనా, లాక్‌డౌన్‌లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపై దాఖలైన పిటిషన్లలో రెండు ప్రధాన వ్యాజ్యాలు మంగళవారం ధర్మాసనం ముందు మరోసారి విచారణకు వచ్చాయి. ఐసోలేషన్ కేంద్రాలు పనిచేయడం లేదని న్యాయవాది వసుధ నాగరాజ్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో జిల్లాల వారీగా ఎన్ని క్వారెంటైన్/ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారో చెప్పాలని ధర్మాసనం అడిగింది. అన్ని జిల్లాల్లోనూ ఐసోలేషన్ కేంద్రాలు పనిచేసేలా చూడాలని, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ధర్మాసనం సూచించింది. జిల్లాల వారీగా వెంటిలేటర్ పడకలు, ఆక్సిజన్ పడకల వివరాలు, ఆయా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల వివరాలు, ప్రైవేటు/ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స పొందుతున్న వారి సంఖ్యను ధర్మాసనం అడిగింది. ఏ ఒక్క ఆసుపత్రినీ మూసివేయలేదని, గుర్తించిన అన్ని ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందిస్తున్నట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ‘కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన ఎంతమందికి ఫైన్ వేశారు? ఎంత మొత్తం వసూలు చేశారు. ఎంతమందిపై కేసులు పెట్టారు?’ వంటి విషయాలు తదుపరి విచారణ నాటికి చెప్పాలని స్పష్టం చేసింది.