‘‘ఆస్తి పన్ను మదింపు కోసం అన్ని రాష్ట్రాల్లోనూ ఆస్తి పన్ను మదింపు బోర్డును నియమించాలని 13వ ఆర్థిక సంఘం సూచించింది.

కానీ, తెలంగాణలో ఇప్పటి వరకూ ఇది అమలు కాలేదు’’ అని 15వ ఆర్థిక సంఘం నివేదిక పేర్కొంది. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను నివేదిక ప్రస్తావించింది. రాజ్యాంగ నియమాలను తెలంగాణ పాటించడం లేదని, 2015లో మొదటి ఆర్థిక సంఘాన్ని నియమించినప్పటికీ ఇప్పటిదాకా నివేదిక ఇవ్వలేదని ఆక్షేపించింది. ప్రతి నెలా గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.308 కోట్లు మంజూరు చేసి సరిపెడుతోందని పేర్కొంది. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న 29 అధికారాల్లో కేవలం 10 మాత్రమే గ్రామీణ స్థానిక సంస్థలకు బదలాయించారని తెలిపింది. తెలంగాణ విద్యుత్తు సంస్థల ఖర్చు, ఆదాయం మధ్య అంతరం ఉందని పేర్కొంది. కాగా, భూ రికార్డుల కంప్యూటీకరణపై రాష్ట్రానికి ప్రశంసలు దక్కాయి. మహారాష్ట్రతోపాటు తెలంగాణలో 99శాతం భూ రికార్డుల కంప్యూటీకరణ జరిగినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, రాష్ట్రంలో 91.1శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని పేర్కొంది. దేశంలో 58.6 శాతం పిల్లలకు రక్తహీనత ఉండగా.. తెలంగాణలోని 60.7 శాతం పిల్లల్లో ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మహిళలకు ఎక్కువగా రక్తహీనత ఉందని పేర్కొంది. రాష్ట్రంలో తలసరి వైద్య ఖర్చు రూ.1,405 ఉండగా.. దేశంలో రూ.1,218గా ఉందని వివరించారు. రాష్ట్రంలో 77.9 శాతం ఇళ్లకు మాత్రమే సురక్షితమైన తాగునీరు అందుతోందని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రంలో 69.1శాతం కుటుంబాలు మరుగుదొడ్లను వినియోగించుకుటున్నాయని, దేశ వ్యాప్తంగా చూస్తే ఇది 61.1 శాతమేనని వెల్లడించింది.