‘‘పెద్ద ఎన్నికలు వస్తే.. పాకిస్థాన్ బోర్డర్‌ల లొల్లి అయితది. ఇక్కడ చిన్న ఎన్నికలు వస్తే భైంసాలో లొల్లి అయితది.. ఎందుకో ఆలోచించండి! కొట్లాట పెట్టాలె.. కలిసి ఉండనివ్వొద్దు.. ఆగం చేసి విడగొట్టాలె. హిందూ, ముస్లిం భావన తెచ్చి నాలుగు ఓట్లు వేయించుకొని అవతల పడాలె! ఇదీ బీజేపీ మార్క్ రాజకీయం’’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యావంతులు, పట్టభద్రులు ఆలోచన చేయాలని సూచించారు. పొరపాటున బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే.. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలను పరోక్షంగా ఆమోదిస్తున్నారని చెప్పి.. ఇంకా పెంచే ప్రమాదముందని హెచ్చరించారు. రూ.1000 ఉన్న సిలిండర్ ధర రూ.2000 అయినా ఆశ్చర్యం లేదన్నారు. శుక్రవారం తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘తెలంగాణ జీవితం-సామరస్య విలువలు’ అనే అంశంపై బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో నిర్వహించిన సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

‘‘మాది జాతీయవాదమని బీజేపీ నేతలు చెబుతరు. మీ జాతీయవాదంలో తెలంగాణ జాతి ప్రయోజనాలు లేవా?’’ అని ప్రశ్నించారు. కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. నిధులు, విద్యాసంస్థలను తెలంగాణకు ఇవ్వలేదన్నారు. ఆరు ఐఐఎంలు, 82 నవోదయ పాఠశాలలు, ఐదు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్‌లు, 157 మెడికల్ కళాశాలలు, సైనిక్ పాఠశాలలు, రెండు ఐసర్‌లు వివిధ రాష్ర్టాలకు మంజూరు చేశారని, కానీ, తెలంగాణ దక్కినవి మాత్రం సున్నా అని తెలిపారు. బుల్లెట్ రైలు ఢిల్లీ నుంచి ముంబయి వరకు గుజరాత్ మీదుగా వెళ్తుందని, హైస్పీడ్ రైలు జాబితాలో హైదరాబాద్ ఉండదని విమర్శించారు. వీటిని ప్రశ్నిస్తే అక్బర్, బిన్ లాడెన్, బాబర్.. అని గులకరాళ్లు డబ్బాలో వేసి ఊపినట్టు అవే మాటలు మాట్లాడతారని అన్నారు.
ఏపీ కోసం ఎందుకు మాట్లాడొద్దు?
‘‘బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని రద్దు చేసినరు. ఉన్న విశాఖ ఉక్కునే తుక్కుతుక్కు చేసి అమ్మాలని చూస్తున్నరు. అదేంటని అడిగితే ఏపీలో నీకేం పనంటరు? ఏపీ దేశంలో లేదా? మేం మాట్లాడొద్దా..? ఇవ్వాళ అక్కడమ్ముతున్నవు.. రేపు మా సింగరేణి, ఈసీఐఎల్, బీహెచ్‌ఈఎల్ మీద పడుతవు. ఇవ్వాళ వాళ్లకు కష్టమొచ్చిందని మేం నోర్మూసుకొని కూర్చుంటే రేపు మాకు కష్టం వచ్చినప్పుడు ఎవరుంటరు? మనం తెలంగాణ బిడ్డలం. కానీ, ముందుగా భారతీయులం. దేశంలో ఎక్కడ తప్పు పని జరిగినా ప్రశ్నించాలె’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 30 రోజుల్లో 100 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం ఎలా? అనే ఫార్మాట్‌ను నీతి ఆయోగ్ రెడీ చేసిందని ఎద్దేవా చేశారు. నగరంలో ఉన్న ఐడీపీఎల్ ఖతం చేశారని, హిందూస్థాన్ కేబుల్, బీఎ్‌సఎన్‌ఎల్‌లో 80 వేల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం లేదని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆరేళ్లలో 1.32 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఎక్కడా సాధ్యం కాదని, మొత్తం జనాభాలో ఒక శాతమే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని తెలిపారు. టీఎ్‌సఐపాస్ ద్వారా పరిశ్రమలకు సులభతర అనుమతులు జారీచేసి.. ప్రైవేట్ సెక్టార్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు.
తెలంగాణకు ప్రాధాన్యమివ్వని వారికి ప్రాధాన్య ఓటెందుకు..?
‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ ప్రాధాన్యాల్లో తెలంగాణ లేదని స్పష్టమైన సంకేతాలనిస్తోంది. అలాంటప్పుడు మన ప్రాధాన్య ఓటు వాళ్లకెందుకు వెయ్యాలి? ప్రశ్నించే గొంతుకను అంటున్న సిటింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు.. ఐటీఐఆర్ రద్దయినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? సిలిండర్ ధర పెరిగినప్పుడు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రద్దు చేస్తానన్నప్పుడు ఆయన నోరెందుకు పెగల్లేదు?’’ అని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన నేత అన్న గౌరవం లేకుండా ముఖ్యమంత్రిని దూషించేందుకు మాత్రం మాట్లాడతారని మండిపడ్డారు. మన్మోహన్ చేతకానితనం వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని ఒకప్పుడు నరేంద్రమోదీ అన్నారని, కానీ.. మోదీ ప్రధాని అయినప్పుడు సిలిండర్ ధర రూ.450 ఉంటే.. ప్రస్తుతం రూ.950 అయిందని తెలిపారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారని, ఆరేళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు.
వీసీల నియామకాలపైనా రాజకీయం..
వర్సిటీల వైస్ చాన్స్‌లర్ల నియామకాలనూ రాజకీయం చేసిన చరిత్ర బీజేపీదని, హెచ్‌సీయూలోని విద్యార్థి సంఘాల విషయాల్లో వీసీ జోక్యంతో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీలను నియమించామని, పదవీ కాలం ముగిసిన చోట సీనియర్ ఐఏఎ్‌సలు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారని తెలిపారు. ఉద్యోగులు, న్యాయవాదులు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు, సింగరేణి కార్మికులు, ఇతర ఉద్యమకారులతో తమది పేగు బంధమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వ బాధ్యతల నేపథ్యంలో మీకు కొంత దూరమయ్యాం. వారం, పది రోజులుగా ఉద్యమ కాలంలో పని చేసిన వారిని కలుస్తున్నాం. నాటి పోరాటాలను వారు గుర్తు చేస్తుంటే ఆనందంగా ఉంది. అందరం కలిసి పోరాడితేనే రాష్ట్రం సిద్ధించింది. ఇప్పుడున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదు. మన సర్కారు. మనందరి ఆకాంక్షల వేదిక సర్కారు’’ అని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు పుట్టుకొస్తున్న ప్రేమ రాజకీయ ప్రయోజనాల కోసమేనన్నారు. ఉద్యోగులకు 45 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకొంటామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, కానీ.. వాళ్లు ఎక్కడ పోటీలో ఉన్నారో ముందు చెప్పాలని ఎద్దేవా చేశారు. ఈ సదస్సులో తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్, ఆయాచితం శ్రీధర్, సినీ దర్శకుడు శంకర్, ప్రొఫెసర్ లింబాద్రి, డాక్టర్ జయంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు.