నాగార్జున సాగర్ శాసనసభ స్థానంతో పాటు పన్నెండు రాష్ట్రాల్లో రెండు లోక్‌సభ, 14 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వీటన్నింటికీ ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహించనున్నారు. మంగళవారం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ స్థానం ఉన్నాయి. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు(వైసీపీ), కర్ణాటకలోని బెల్గాం ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ అంగాడీ(బీజేపీ) గత ఏడాది సెప్టెంబరులో కొద్ది రోజుల వ్యవధిలో కొవిడ్-19తో మరణించారు. డిసెంబరు 1న తెలంగాణలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(టీఆర్‌ఎస్) గుండెపోటుతో మరణించారు. ఈ స్థానాలతో పాటు గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, రాజస్థాన్, నాగాలాండ్, ఒడిసా, ఉత్తరాఖండ్‌లలో ఒక్కో శాసనసభా స్థానానికి, కర్ణాటకలో రెండు శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదలవుతుంది.

నామినేషన్ల స్వీకరణ 30తో ముగుస్తుంది. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఏప్రిల్ 3 వరకు అవకాశం ఇచ్చారు. ఎనిమిది దశల్లో జరుగుతున్న బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఐదో ఫేజ్ ఎన్నిక ఏప్రిల్ 17న జరగనుంది. అదే రోజు నాగార్జునసాగర్, తిరుపతి సహా 12 రాష్ట్రాల్లోని 16 సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. అప్పటికి తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్ఛేరి ఎన్నికలు ముగుస్తాయి. ఓట్ల లెక్కింపు మే 2న తమిళనాడు, కేరళ, అసోం, బెంగాల్, పుదుచ్ఛేరి శాసనసభ ఎన్నికల కౌంటింగ్‌తోపాటు జరుగుతుంది. ఉప ఎన్నికలు జరుగుతున్న చోట్ల ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుంది. బిహార్ ఎన్నికల సమయంలోని కొవిడ్ నిబంధనలే ఇప్పుడూ అమల్లో ఉంటాయి.