అతను ఆవుల కిషన్ అలియాస్ కత్తుల కిషన్. ఒకప్పుడు గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత. 24 కత్తులను నోటిలో నుండి కడుపులోకి పెట్టుకొని గిన్నిస్ బుక్ రికార్డ్ కెక్కిన ఆ వ్యక్తి నేడు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పూట గడవక కుటుంబ పోషణ భారమై చాలా ఇబ్బందులు పడుతూ గత్యంతరంలేని పరిస్థితులలో ఓ చౌరస్తా వద్ద తోపుడు బండి పై టిఫిన్లు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు…
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన ఆవుల కిషన్ 2012 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో 22 కత్తులను ఒకేసారి నోటిలో పెట్టుకుని గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. ఆ తర్వాత ఇటలీలో 24 కత్తులతో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవరూ తిరిగి రాయలేదు. ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ఇతర దేశాలలో విన్యాసాలు చేస్తూ ఇన్ని రోజులు జీవనం సాగించాడు. దాదాపు 20 సంవత్సరాల నుండి ఈ వృత్తిని నమ్ముకొని కుటుంబమంతా జీవనం సాగించారు.
ఈ కుటుంబాన్ని గిన్నిస్ బుక్ రికార్డు ఆదుకోలేదు , ప్రభుత్వం ఆదుకోలేదు. ఇదే పరిస్థితులలో కరోనా వైరస్ విజృంభించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రదర్శనలు చేయడం కోసం ఏ దేశంలో వీలు కాక తన సొంత గ్రామమైన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామానికి వచ్చి కొన్ని రోజులు కష్టాలు ఎదుర్కొని చివరకు గత్యంతరం లేక తోపుడు బండి పై దోశ, ఇడ్లి, వడలు వేసుకుంటూ సుల్తానాబాద్ మండలంలోని సుగ్లంపల్లి చౌరస్తా వద్ద టిఫిన్ సెంటర్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. చిన్నకల్వల గ్రామంలోనే కాక సుల్తానాబాద్ మండలంలో ఆవుల కిషన్ అంటే ఎవరికీ తెలీదు. కానీ, కత్తుల కిషన్ అంటే వెంటనే చెప్పేస్తారు. ప్రస్తుతం ఇతని పరిస్థితి ఇతని కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
‘నేను ఒకప్పుడు గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీతని. కానీ నాకు ఏ రికార్డులు బతుకుదెరువు చూపలేదు. నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో నాకు విన్యాసాలు చేసే అవకాశం లేక బయటి దేశాల నుంచి నన్ను పంపించేశారు. నాకు బ్రతుకు తెరువు లేక నేను సుగ్లంపల్లి చౌరస్తా వద్ద టిఫిన్ సెంటర్ పెట్టుకొని నేను నాకుటుంబం జీవనం సాగిస్తున్నా.’ అని న్యూస్18కి చెప్పారు కిషన్. ఆఫీసుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ దాదాపు పది సంవత్సరాలు తిరిగినా ఏ రాజకీయ నాయకుడూ తనకు ఎలాంటి సహకారం అందించలేదని, చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు వెళ్లి నాలుగు రోజులు అక్కడే ఉన్నా కూడా సీఎం నుంచి సాయం అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తన పరిస్థితి కరోనా వైరస్ నేపథ్యంలో పూర్తిగా దిగజారిపోయిందని వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు గాని, ప్రజాప్రతినిధులు తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.