కరోనా కష్టకాలంలో చరిత్రాత్మక నిర్ణయం

0
179
Spread the love

ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ సహా ఇతర సమస్యలను పరిష్కరిస్తూ అసెంబ్లీలో సోమవారం సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి.. కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఇక, కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పటానికి నేతలు క్యూ కట్టారు. సభలో ప్రకటన తర్వాత అసెంబ్లీ లాబీల్లోని తన చాంబర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్‌ చెప్పటానికి మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పోటీ పడ్డారు. వారిలో మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పీఆర్‌టీఎస్-టీఎస్‌ అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్‌, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్‌, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి గౌతమ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు. కాగా, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉద్యోగుల వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారంపై సోమవారం శాసన మండలిలో ప్రకటన చేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి టీచర్‌ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌ రెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్‌ ఉద్యోగులకు కుటుంబ పింఛను కల్పించాలంటూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో లక్షన్నర మంది సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం భద్రత కల్పించిందని ఆ సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఙ తెలిపారు. 1980 రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్స్‌ ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పింఛను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు.

సీఎం కేసీఆర్‌ ఉద్యోగ బాంధవుడు: గ్రూప్‌-1 అధికారుల సంఘం

సీఎం కేసీఆర్‌ ఉద్యోగ బాంధవుడని గ్రూప్‌-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి హన్మంత్‌ నాయక్‌ సోమవారం ఒక ప్రకటనలో కొనియాడారు. పీఆర్సీ నివేదికతో సంబంధం లేకుండా ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించటాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా బంగారు తెలంగాణ నిర్మాణంలో మరింత ఉత్సాహంగా పాలుపంచుకుంటారని పేర్కొన్నారు.

పాత పెన్షన్‌ వర్తింపజేయాలి: సీపీఎస్‌ సంఘం

2004 సెప్టెంబరు ఒకటో తేదీకి ముందు నోటిఫికేషన్‌ విడుదలై.. నియామక ప్రక్రియ మొదలుపెట్టి.. 1-9-2004 తర్వాత నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ సౌకర్యం వర్తింపచేయాలని సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దాముక కమలాకర్‌, చీటీ భూపతిరావు ఒక ప్రకటనలో కోరారు. కుటుంబ పింఛను ఇవ్వాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. సీపీఎ్‌సను రద్దు చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని గుర్తు చేశారు. వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

చారిత్రక వేతన సవరణ: టీఎన్జీవోల సంఘం పూర్వ అధ్యక్షుడు

దీర్ఘకాలికంగా పెండింగ్‌ లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు ఏప్రిల్‌ నుంచి వేతన సవరణ చేయాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం పట్ల టీఎన్జీవోల సంఘం పూర్వ అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, వరంగల్‌ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ పరిటాల సుబ్బారావు హర్షం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపాయన్నారు. కరోనా కష్టకాలంలో తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమని తెలిపారు.

వయో పరిమితి తగ్గింపుపై పెన్షనర్ల హర్షం

అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ పొందే వయసును 75 నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ స్వాగతించింది. 30 శాతం వేతన సవరణ నిర్ణయంపై జేఏసీ చైర్మన్‌ కె.లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్‌ సుభాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here