కాంగ్రెస్‌కు షాక్‌!

0
289
Spread the love

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్‌ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి మంచి అండగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు. ఏఐసీసీ నుంచి రాష్ట్ర నాయకత్వం వరకూ ప్రభుత్వంతో అమీతుమీ పోరాటం చేయట్లేదన్న అసంతృప్తితోనే ఆయన రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు ఉండే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలోనే కాంగ్రె్‌సను వీడాలన్న నిర్ణయానికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి పలు ఆలోచనలు ఉన్నాయని, కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండి వాటిపై కసరత్తు చేయడమూ సరైంది కాదన్న భావనలో పార్టీకి రాజీనామా చేసినట్లు సన్నిహితులకు ఆయన చెబుతున్నారు.

టీఆర్‌ఎస్‌ ఎంపీగా ఉన్నప్పుడే.. ఆయన ఆ పార్టీ పెద్దల పద్దతులు నచ్చక రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినా జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూనే ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై పోరాటం కోసం తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరితే.. పార్టీ నాయకత్వం ఆ స్థాయిలో పోరాటం చేయట్లేదన్న అసంతృప్తి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలో గూడు కట్టుకుని ఉంది. కాంగ్రెస్‌ నేతలను సీఎం కేసీఆర్‌ బఫూన్లని తిట్టినా.. అదే స్థాయిలో విమర్శించేందుకు నాయకత్వం ముందుకు రావట్లేదన్న అభిప్రాయాన్నీ ఆయన సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి వంటి వారు కేసీఆర్‌పై మాటల దూకుడు ప్రదర్శిస్తే.. సొంత పార్టీ నేతలే తప్పు పడుతున్నారన్న అభిప్రాయంతోనూ ఆయన ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీల పొత్తుపైనా ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నట్లు వస్తున్న వార్తలపట్లా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటిదే జరిగితే తన నిర్ణయం తాను తీసుకుంటాన్న అభిప్రాయాన్నీ ఇటీవల ఆయన మీడియా ముందు వ్యక్తం చేశారు. అలాగే పార్టీ బలోపేతం కోసం ఏఐసీసీ నాయకత్వానికి తాను సూచించిన సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా అమలుకూ ఆసక్తి చూపవ పోవడం పట్లా అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు.

కొద్ది నెలలు ఆగాక రాజకీయ భవిష్యత్తుపై కసరత్తు

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కొద్ది నెలలపాటు తన వ్యాపారాలపైనే దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్నారు. తానుపూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టడంతో వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని, వాటిని చక్కదిద్దుకుని.. రాజకీయ భవిష్యత్తుపై ఆలోచన చేస్తానని చెబుతున్నారు. అయితే, ఆయన బీజేపీలోనే చేరతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రేవంత్‌కు గట్టి దెబ్బ..!

అధికార టీఆర్‌ఎస్‌ పైన, కేసీఆర్‌ నాయకత్వంపైన మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గట్టి అండగా ఉంటూ వస్తున్నారు. పీసీసీ చీఫ్‌ రేసులో ముందున్న రేవంత్‌రెడ్డికి గట్టి మద్దతుదారుగానూ ఉన్నారు. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రేవంత్‌ నిర్వహించిన పాదయాత్రలోనూ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆ క్రమంలో జరిగిన భారీ సభకు తాను రాలేక పోయినా సంఘీభావం తెలుపుతూ సందేశాన్ని పంపారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వీడడం రేవంత్‌ శిభిరానికి గట్టి దెబ్బేనంటున్నారు. రేవంత్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్న మేడ్చల్‌ డీసీసీ మాజీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్‌ కూడా ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డీ పార్టీకి గుడ్‌బై చెప్పడం రేవంత్‌ శిబిరంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్‌కు అధిష్ఠానం పీసీసీ పగ్గాలు అప్పగిస్తే విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రె్‌సలోనే కొనసాగుతారా? అన్న దానిపైనా స్పష్టత లేదు. పీసీసీ పగ్గాలు రేవంత్‌కు ఇచ్చి.. టీఆర్‌ఎ్‌సతో కాంగ్రెస్‌ అధిష్ఠానం పొత్తు పెట్టుకుంటే ప్రయోజనం ఏముంటుందన్న అభిప్రాయాన్నీ సన్నిహితుల వద్ద విశ్వేశ్వర్‌రెడ్డి వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here