హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పినందుకు సంతోషమని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యమే ఆందోళనకరంగా తయారైందన్నారు. అధికార పార్టీ దోపిడీలతో సామాన్య ప్రజల జీవన పరిస్థితులే ప్రమాదంలోకి పడిపోతున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. ‘‘సీఎం పదవి పేరుతో దళిత బిడ్డలను మోసగించి వారసుడికెట్లా ఆ పదవి కట్టబెడతావని ప్రజలు, బీజేపీ నిలదీస్తున్న భయానికి 10 ఏళ్లు ఆయనే సీఎం అంటూ…. ఏవో మాయమాటలు చెప్పి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. మబ్బుల మాటున ఉండే వానా కాలపు సూర్యుడిలా…. మరో పదేళ్లపాటు ఎప్పుడు ప్రగతిభవన్‌లో కనిపిస్తాడో… ఎప్పుడు ఫాం హౌస్‌లో దర్శనమిస్తాడో అర్థంకాని అయోమయంతో జనం భరించాలని హెచ్చరిస్తున్నట్టుంది. పదేళ్ళ వరకూ ఎందుకు కేసీఆర్ ‘కారు’మబ్బుల్ని తెలంగాణ ప్రజలు మరో మూడేళ్లలోనే చెదరగొడతారని ఆయన అర్థం చేసుకునే రోజులు దగ్గర పడుతున్నాయి.’’ అని విజయశాంతి విమర్శించారు.
