కోలుకున్నాక.. కొత్త సమస్యలు!!

0
170
Spread the love

కొవిడ్‌ నుంచి కోలుకున్న కొందరిని.. కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో కరోనా ఇన్ఫెక్షన్‌ నుంచి బయటపడ్డ ఎంతోమంది మూడు నుంచి ఆరు నెలలకే మళ్లీ ఆస్పత్రుల పాలవుతున్నారు. కరోనా ఇన్ఫెక్షన్‌ కలిగించిన ఇబ్బంది కంటే ఈ ఇతర జబ్బులే రోగులను ఎక్కువగా అవస్థలపాలు చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటికి చికిత్స అందించడం వైద్యులకు కూడా పెనుసవాలుగా మారింది. ఈ రోగుల్లో 40-50% మంది త్వరగా కోలుకుంటుండగా, 15 నుంచి 20% మందిని కొత్త ఆరోగ్య సమస్యలు అలుముకుంటున్నాయి. వీరిలో కొందరికి ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రాణాపాయ స్థితి ఎదురవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

స్టెరాయిడ్స్‌ను వాడటం వల్లే..

కరోనా నుంచి కోలుకున్న పలువురు ‘మ్యూకర్‌ మైకోసిస్‌’ అనే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో గత ఏడెనిమిది నెలల్లో 60కిపైగా ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే దాదాపు 10 మందికి ఈ చికిత్స అందించారు. శ్వాసకోశ సమస్యలతో పాటు జ్వరం, కళ్లలో వాపు, ముక్కు దిబ్బడ, తలనొప్పి, ముఖం తిమ్మిరి వంటివి ‘మ్యూకర్‌ మైకోసిస్‌’ ఇన్ఫెక్షన్‌ లక్షణాలని వైద్యులు తెలిపారు. ప్రధానంగా మధుమేహ రోగుల్లో ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని, కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్స్‌ను వినియోగించడం వల్ల వారిలో ఈ ఇన్ఫెక్షన్‌ ఉత్పన్నం అవుతోందన్నారు. కరోనా వ్యాప్తి మొదలవడానికి ముందు రాష్ట్రంలో మూడు, నాలుగు మ్యూకర్‌ మైకోసిస్‌ కేసులే నమోదవగా.. ఇప్పుడవి 60కి పెరిగాయని పేర్కొన్నారు.

ఆస్పత్రుల్లో చేరేసరికే ఊపిరితిత్తులు దెబ్బతిని..

కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ వల్ల రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతుండటంతో.. బాధితులలో శ్వాసకోశ, జీర్ణాశయ, మెదడు వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వీటిని సత్వరం గుర్తించి, చికిత్స అందించకపోతే మరణానికి దారి తీయొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇబ్బందులతో హైదరాబాద్‌లోని చెస్ట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ప్రతి పది మందిలో నలుగురైదుగురు కరోనా నుంచి కోలుకు న్నవారే ఉండటం తాజా పరిణామాలకు నిదర్శ నం. చాలామందిలో ఆస్పత్రిలో చేరేసరికే ఊపిరితిత్తులు బాగాదెబ్బతిని ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఊపిరితిత్తులు ఉబ్బి ఉండడం, వాటిపై మచ్చలు ఏర్పడడం, ఆయాసం, ఆలస్యం గా ఫైబ్రోసిస్‌ జరగడం వంటి లక్షణాలను ఈ రోగుల్లో గుర్తించారు. ఈ మచ్చలు వెంటనే నయం కాకపోతే ఇన్ఫెక్షన్‌గా మారి రోగుల ప్రాణాలకు ముప్పును కొని తెస్తాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స తర్వాత కూడా కరోనా ఇన్ఫెక్షన్‌ తగ్గకుంటే తదుపరిగా శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇలాంటి వారికి ఇంట్లోనే ఆక్సిజన్‌ థెరపీ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. కొందరిలో జీర్ణకోశ ఇబ్బందులు తలెత్తుతుండగా, మరికొందరిలో రక్తం చిక్కబడి శరీర భాగాలకు రక్త సరఫరాలో ఆటంకం కలుగుతోంది. ఫలితంగా కాళ్లలో రక్తం గడ్డలుగా ఏర్పడటం, బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడం, గుండె స్పందనలు ఆగిపోవడం వంటివి చోటు చేసుకునే ముప్పు ఉంటుందని వైద్యులు చెప్పా రు. కొందరు కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.

చాలాకాలం పాటు చికిత్స

కరోనా సోకినప్పటి కంటే.. ఆ తర్వాత ప్రబలుతున్న జబ్బులతోనే రోగులు చాలా అవస్థలు పడుతున్నారు. కొంతమంది ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులతో ఆస్పత్రికి వస్తున్నారు. ఇంటిలో ఆక్సిజన్‌ తీసుకునే వారికి కొన్నిసార్లు ఇబ్బంది ఎదురైతే హుటాహుటిన ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. కొంతమంది ఏకంగా వెంటిలేటర్‌ సాయంతో ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. ఇలాంటి వారిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుని చాలాకాలం పాటు చికిత్స అందించాల్సి వస్తుంది.

డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆస్పత్రి

85% మందిలో తగ్గించొచ్చు

కొంతమంది ఆలస్యంగా ఆస్పత్రికి రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి ఆరు నెలల్లో ఎప్పుడైనా ఊపిరితిత్తులకు సంబంధించిన ఫైబ్రోసిస్‌ సమస్య రావచ్చు. 80-85ు మందిలో దీన్ని తగ్గించే అవకాశాలుండగా, 15-20ు మందిలో సమస్య తీవ్రంగా ఉండొచ్చు. ఇలాంటి రోగులలో కొందరికి ప్రాణాపాయ స్థితి ఎదురవుతుంది. కరోనా నుంచి కోలుకు న్న తర్వాత ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా వైద్యులను సంప్రదించాలి. ఆలస్యం చేస్తే ప్రమాదకరం.

డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌, సూపరింటెండెంట్‌, చెస్ట్‌ ఆస్పత్రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here