క్విక్‌సపోర్టుతో ముంచేశారు..

0
181
Spread the love

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆర్మీ అధికారులనూ సైబర్‌ నేరగాళ్లు వదలడంలేదు… అవకాశం ఉన్న ప్రతి ఒక్కరినీ దోచుకుంటూనే ఉన్నారు.. మాటలతో నమ్మించి ఖాతాలు కొల్లగొడుతున్నారు. ట్విట్టర్‌ ద్వారా సమస్యను చెబుతామనుకున్న ఓ ఆర్మీ అధికారికి.. తాము సదరు సంస్థ ప్రతినిధులమంటూ ఫోన్‌ చేసి రూ. 1.75 లక్షలు టోకరా వేశారు.. మరో ఘటనలో ఫేస్‌బుక్‌ ద్వారా వస్తువులు కొందామనుకున్న మరో ఆర్మీ అధికారికి రూ. 1.75 లక్షలు బురిడీ కొట్టించారు.. పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ ప్రాంతం లో నివాసముండే ఓ ఆర్మీ అధికారికి ఇండస్‌ బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల విషయంలో సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన ఇండస్‌బ్యాంకు ప్రధాన కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ట్విట్టర్‌లో సమస్య గురించి పోస్ట్‌ చేశాడు. అందులో ఉన్న బాధితుడి ఫోన్‌ నంబర్‌ను తీసుకున్న సైబర్‌నేరగాళ్లు.. తాము ఇండస్‌ బ్యాంకు కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మించారు.

క్విక్‌సపోర్టుతో ముంచేశారు..

మీ సమస్య పరిష్కరించాలంటే క్విక్‌సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పగా డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు.. అనంతరం ఒక నంబర్‌ వస్తుందంటూ ఆ యాప్‌ యాక్సెస్‌ కోడ్‌ను తీసుకున్నారు. దీంతో సైబర్‌నేరగాళ్లు ఆర్మీ అధికారి సెల్‌ఫోన్‌ ద్వారా జరిగే ప్రతి విషయాన్ని పరిశీలించారు. రూ. 78 ఫీజు చెల్లిస్తే సమస్య సరిపోతుందంటూ ఒక నంబర్‌ పంపించారు. దీంతో తన సెల్‌ఫోన్‌లో నుంచి ఆ డబ్బును సైబర్‌నేరగాళ్లు సూచించిన ఖాతాకు బదిలీ చేశాడు. ఈ క్రమంలో ఆర్మీ అధికారి పాస్‌వర్డ్‌, యూజర్‌ నేమ్‌ను తెలుసుకున్న సైబర్‌నేరగాళ్లు, ఆ ఖాతాలో నుంచి రూ. 1.75 లక్షలు కాజేశారు.

మరో ఘటనలో.. ఫేస్‌బుక్‌ ద్వారా ఇంట్లోకి కావాల్సిన వస్తువులను హోల్‌సెల్‌లో కొనాలని మరో ఆర్మీ అధికారి ప్రయత్నించాడు. దీంతో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ నంబర్‌ ఇచ్చి.. తాము సరఫరా చేస్తామంటూ నమ్మించారు. ముందుగా అడ్వాన్స్‌ అని ప్రారంభించి, ఆ తరువాత మీకు వస్తువులు పంపిస్తున్నామంటూ డబ్బులు వసూలు చేస్తూ వెళ్లారు. మొత్తం రూ. 1.75 లక్షలు డిపాజిట్‌ చేసిన తరువాత సైబర్‌నేరగాళ్లు సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here