చట్టాలను సక్రమంగా అమలు చేసి, దోషులను కఠినంగా శిక్షించినప్పుడే ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగుతాయని, మహిళలకు రక్షణ లభిస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

సంఘమిత్ర శిక్షణ పొందిన మహిళలకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్‌కేఎ్‌ససీ) అధ్వర్యంలో శనివారం హైదరాబాద్ నాగోల్‌లో సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కవిత మాట్లాడుతూ కేసీఆర్ మానస పుత్రిక అయిన షీటీమ్‌లు మహిళలకు అండగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్నాయన్నారు. ఆడ బిడ్డలకు గౌరవం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని, మహిళలు సంతోషంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. మహిళల భద్రతకు చేయూతనిచ్చేలా గృహిణులకు శిక్షణ ఇచ్చిన ఆర్‌కేఎ్‌ససీ, సంఘమిత్రల కృషిని అభినందించారు.
మహిళల భద్రతే లక్ష్యంగా సీపీ మహేష్ భగవత్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు. ఆర్‌కేఎ్‌ససీ, సంఘమిత్రలు మహిళలకు చేస్తున్న సేవలో తననూ భాగస్వామిగా చేర్చుకోవాలని కోరారు. సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ వరకట్న నిషేధ చట్టం వచ్చి 60ఏళ్లు గడచినా వేధింపులు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు అండగా మేమున్నామని సంఘమిత్రలు భరోసా కల్పించాలన్నారు. మహిళలకూ పోలీసులకు మధ్య సంఘమిత్రలు సమన్వయకర్తలుగా ఉంటారన్నారు. ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, భువనగిరి, యాదాద్రి తదితర ప్రాంతాల్లో సంఘమిత్రలుగా శిక్షణ పొందిన మహిళలకు కవిత, మహేష్‌భగవత్, షీ టీం అదనపు డీసీపీ సలీమా సర్టిఫికెట్లు అందజేశారు.