జంబో బ్యాలెట్‌!

0
177
Spread the love

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ సారి రికార్డు సృష్టించనున్నాయి. రెండు నియోజకవర్గాల్లోనూ అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉప సంహరణ గడువు ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా(బ్యాలెట్‌)ను ఎన్నికల అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో 93 మంది, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ నియోజకవర్గంలో 71 మంది బరిలో నిలిచారు. రెండు చోట్ల భారీ జంబో బ్యాలెట్‌ సిద్ధం చేయనున్నారు. మార్చి 14న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ జరగనుంది. రాష్ట్రంలో శాసనమండలిని పునరుద్ధరించాక జరిగిన ఎన్నికల్లో ఇంత భారీగా అభ్యర్థులు పోటీలో లేరని చెబుతున్నారు.

రెండుచోట్ల ఇలా…

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి మొత్తం 111 మంది నామినేషన్లు దాఖలు చేయగా, సక్రమంగా లేవని 15 తిరస్కరించారు. 96 మందిలో శుక్రవారం ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి 76 మంది అభ్యర్థులు 123 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, మూడు తిరస్కరణకు గురయ్యాయి. శుక్రవారం ముగ్గురు స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకోగా, 71 మంది మిగిలారు. 2015లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ నుంచి 22 మంది, హైదరాబాద్‌ నుంచి 31మంది మాత్రమే పోటీ పడ్డారు.

ఓటేయడానికి అత్యధిక సమయం

ఈ ఎన్నికల్లో అందరికీ ఓటేసే వీలున్నందున.. అందులోనూ ప్రాఽధాన్యతను గుర్తించాల్సి ఉన్నందున ఒక్కో ఓటరుకు 5 నిమిషాలు మించి సమయం పట్టే అవకాశం ఉంటుంది. భారీ బ్యాలెట్‌ పత్రానికి తగినట్లు పోలింగ్‌ కేంద్రంలో టేబుల్స్‌ వేయాలి. పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌ను అందుకు వీలుగా తయారు చేయాలి. దీంతో పోలింగ్‌ సమయాన్ని పెంచడం, ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఎక్కువ సంఖ్యలో కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు అనివార్యం కానుంది. బ్యాలెట్‌ బాక్సులు కూడా అధిక సంఖ్యలోనే సమీకరించాల్సి ఉంటుంది. కాగా, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ నియోజకవర్గం పరిధిలో 5.05 లక్షల మంది ఓటర్లు ఉండగా, 731 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌- రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పరిధిలో 5.60 లక్షల మంది ఓటర్లకు 799 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

వ్యయంపై నిబంధనలు లేవు

ఈ ఎన్నికలకు వ్యయం నిబంధన లేకపోవడంతో వ్యయ పరిశీలన బృందాలు ఏర్పాటు, అభ్యర్థుల ఖర్చుల నమోదు ఉండవు. కరోనా నేపథ్యంలో దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించారు. బూత్‌ లెవల్‌ అధికారులు మార్చి 2వ వరకు పోస్టల్‌ బ్యాలెట్లను అందిస్తారు. పోలింగ్‌ ముందు రోజు వరకూ పోస్టల్‌ బ్యాలెట్లు సేకరిస్తారు. పోలింగ్‌కు.. ఏడు నుంచి పది రోజుల ముందు కరోనా సోకిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here