హైదరాబాద్ : అతని పేరు గులామ్ మోహియుద్దీన్ జాఫర్. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ (పీసీ 9468)గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఓ ఫంక్షన్ నిమిత్తం సికింద్రాబాద్ వెళ్లాడు. రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి వస్తుండగా… కోఠి ఆంధ్రాబ్యాంకు ఎదురుగా ఉన్న దుకాణాల వద్ద దట్టమైన పొగలు, మంటలు కనిపించాయి. జనమంతా ఉరుకులు పరుగులు తీస్తున్నారు. అప్రమత్తమైన గులామ్ మోహియుద్దీన్ తన బైకును పక్కన ఆపి ఫోన్ చేతిలో పట్టుకున్నాడు. వెంటనే ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. స్థానిక పోలీసులను అప్రమత్తం చేశాడు. 10 నిమిషాల వ్యవధిలో గౌలిగూడకు చెందిన ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి.

మంటలు వ్యాపించకుండా..
సుల్తాన్ బజార్ పీఎస్ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదంతో తనకు సంబంధం లేకపోయినా… డ్యూటీని మరవలేదు. ఫైరింజన్ అక్కడికి చేరుకోగానే తాను పోలీసునేనని ఫైర్ సిబ్బందికి చెప్పి మంటలార్పే కార్యక్రమంలో మునిగిపోయాడు. అగ్నిమాపక సిబ్బందికి తోడుగా ఓ ఫైరింజన్ నీటి పైపును తీసుకుని రంగంలోకి దూకాడు. మంటలు ఎక్కువగా వ్యాప్తి చెందకుండా తన ప్రయత్నం చేశాడు. ఈ విషయమై గులామ్ మోహియుద్దీన్‌ను ఆంధ్రజ్యోతి పలకరించగా… ‘‘ఫంక్షన్‌కు వెళ్లినా.. ఇంటి వద్ద ఉన్నా.. విధుల్లో ఉన్నా నేను పోలీసునే’’ నని చెప్పారు. ఆపదకాలంలో కార్యరంగంలోకి దిగడం అలవాటేనన్నారు.