దావత్‌.. లేదంటే ప్యాకేజ్‌!

0
224
Spread the love

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి ఇక పది రోజులే సమయం ఉండడంతో బరిలో మిగిలిన ప్రధాన అభ్యర్థులు ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో సూక్ష్మ స్థాయిలో పనిచేయటం మొదలుపెట్టారు. ఓటర్లయిన పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 14న ఎన్నికలు జరగనుండగా 12తో ప్రచారం ముగియనుంది. దీంతో రెండు స్థానాల్లోనూ పార్టీలకు అతీతంగా అభ్యర్థుల మధ్య పోరు రోజు రోజుకీ వేడెక్కుతోంది. ఎవరికి వారుగా ఓటర్లకు చేరువ కావటానికి అన్ని అస్త్రాలనూ ప్రయోగిస్తున్నారు. పట్టభద్రులైన ఓటర్లలో ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, న్యాయవాదులు, ఇతర వృత్తుల్లో స్థిరపడ్డ వారు ఉన్నారు. ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకుంటే, క్రమ సంఖ్య ప్రకారం పట్టభద్రులు ఒకే ప్రాంతంలో ఉండటంలేదు. దీంతో వృత్తులు, ప్రాంతాల వారీగా ఓటర్ల విభజన చేపట్టిన అభ్యర్థులు ఒక పద్ధతి ప్రకారం వారిని ప్రసన్నం చేసుకోవటానికి పోటీ పడుతున్నారు. ఎక్కడికక్కడ బహిరంగ సమావేశాలు పెట్టటం అటుంచి, అంతర్గత వ్యవహారాలకు పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టభద్రులైన ఓటర్లను బృందాలుగా విడగొట్టి దావత్‌లు ఇస్తున్నారు. తాగినంత మద్యం అందుబాటులో ఉంచుతున్నారు.

నాన్‌-వెజ్‌ వంటకాలను వండి వారుస్తున్నారు. ఒకే చోట కనిష్ఠంగా 10, గరిష్ఠంగా 100 వరకు ఓటర్లు ఉన్న చోట్ల ఈ తరహా విందులు జరుగుతున్నాయి. అందులో వేర్వేరు వృత్తుల్లో ఉన్న వారు, భావ సారూప్యం కలిగిన వారు ఉంటే, విడివిడిగా విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక పట్టభద్రులైన ఓటర్లు అధిక సంఖ్యలో ఉండే విద్యా సంస్థలకు సంబంధించి వాటి యాజమాన్యాలనే మేనేజ్‌ చేస్తున్నారు. వారితో ప్యాకేజ్‌లు మాట్లాడుకుంటున్నారు. ఆయా విద్యా సంస్థల పరిధిలో వందల్లో ఉండే ఓటర్లు గంప గుత్తగా తమకే ఓటు వేసేలా పలువురు అభ్యర్థులు ఈ సందర్భంగా ఒప్పందం చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతోంది. వారు స్థానిక నాయకత్వాలకు ఈ బాధ్యతలు అప్పగించారు. ‘మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మీకు ఇంత బడ్జెట్‌ కేటాయిస్తున్నాం. మీ పరిధిలోని పట్టభద్రుల ఓట్లు అన్నీ నాకే పడాలి’ అని వారికి అభ్యర్థులు స్పష్టంచేస్తున్నారు. దీంతో స్థానిక నాయకత్వాలు దావత్‌లు ఇవ్వటం, ప్యాకేజీలు కుదిర్చే పనిలో పడ్డారు.

ప్రచారంలో ఇక్కట్లు..

ముందు నుంచి ప్రచారంలో పాలుపంచుకుంటున్న అభ్యర్థులను పక్కన పెడితే, ఆలస్యంగా ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు, వారి తరఫు నాయకులకు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తప్పటంలేదు. పట్టభద్రులైన ఓటర్లు పరిమితంగా ఉండటం, వారు గడప గడపకు ఉండే పరిస్థితి లేకపోవటం, ఓటర్ల జాబితా ముందు వేసుకున్నప్పటికీ, క్రమ సంఖ్య ప్రకారం పట్టభద్రుల నివాసాలు వేర్వేరు చోట్ల ఉండటం ప్రచారంలో పాల్గొంటున్న వారికి సమస్యగా మారింది. ఒక ఓటరును కలిసిన వారు మరొక ఓటరును కలవటానికి కాలనీలు మారాల్సి వస్తోందని, దూరం ప్రయాణించాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. ఆలస్యంగా ప్రచారం మొదలుపెట్టిన అభ్యర్థులు వృత్తులు, కులాల వారీగా సమావేశాలు పెట్టటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే సోషల్‌ మీడియా ద్వారా ప్రచారానికి, ఓటర్ల సెల్‌ఫోన్‌ నంబర్లకు మెసేజ్‌లు, వాయిస్‌ రికార్డులు పంపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here