ధాన్యం కొంటారో? కొనరో?

0
190
Spread the love

‘రానున్న రోజుల్లో ధాన్యం కొంటారో? లేదో? అని రైతులకు భయం ఉంది. అన్నదాతలు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనే శక్తి ఏ వ్యాపారికీ, షావుకారుకూ లేదు. ఐకేపీ సెంటర్ల ద్వారానే కొనుగోళ్లు సాధ్యమవుతాయి. తద్వారా మహిళలకు ఉపాధి దొరుకుతుంది. కానీ, ఆ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి’’ అని మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్‌ అన్యాయం చేయడనే నమ్మకం రైతులకు ఉన్నా కేంద్ర నిర్ణయాలతో కొంత ప్రమాదమైతే పొంచి ఉందని అన్నారు. అందుకే ఢిల్లీ ఆందోళనకు తెలంగాణ రైతులు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాల, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కమలాపూర్‌లో రైతువేదికలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం నిర్ణయాలు రైతులను మళ్లీ అభద్రతలోకి నెట్టివేసేలా ఉన్నాయని ఆరోపించారు. అందుకే రైతుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలుపుతున్నామన్నారు.

మద్దతు ధరతో పంటలను కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం ఇప్పటికైనా పునరాలోచన చేయాలని కోరారు. కమలాపూర్‌ రైతు.. ఢిల్లీకి వెళ్లి పంటను అమ్ముకోగలడా? అని ప్రశ్నించారు. ‘‘ఇది రాయకీయం కాదు. ఓట్ల పంచాయితీ, సీట్ల పంచాయితీ అసలే కాదు. ఇది 135కోట్ల ప్రజల బతుకుకు సంబంధించిన విషయం. దీనిపై కేంద్ర పునరాలోచించాలి’’ అని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ తాము చెప్పడం లేదని, కేంద్రం వేసిన స్వామినాథన్‌ కమిటీ, రామచంద్రన్‌ కమిటీ, జీసీ గోస్‌ కమీషన్‌ కమిటీ చెప్పిన విషయాలేనని తెలిపారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో చెరువులు కళకళలాడుతున్నాయని, కాలువల్లో నీళ్లు పారుతున్నాయని, కరెంట్‌ కష్టాలు, నీళ్ల కష్టాలు పోయాయని, బోర్లు వేసుకునే బాధ తప్పిందని… ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆశలపై నీళ్లు చల్లవద్దని, కళ్లలో మట్టికొట్టవద్దని కోరారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని, కొత్త చట్టాలు ప్రజల బతుకులను మార్చేలా ఉండాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here