నగదు రహిత వైద్యం

0
273
Spread the love

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అనారోగ్యంతో చికిత్స కోసం ఒక్కసారి ప్రైవేటు ఆస్పత్రిలో అడుగుపెడితే.. జీవితకాలం సంపాదించినదంతా వైద్యానికి త గలేయాల్సివస్తోంది. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్) అత్యవసర పరిస్థితుల్లో (గుండె సంబంధ చికిత్సలు, ప్రమాదాలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైతే) సర్కారు దవాఖానాల్లో తప్ప.. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చెల్లుబాటు కావడంలేదు. దీని పరిస్థితి కూడా ఆరోగ్యశ్రీ లాగే మారింది. సకాలంలో ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో వైద్యం అందించడానికి ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వైద్యం కోసం ఆస్పత్రులకు రూ.లక్షలు చెల్లిస్తున్న ఉద్యోగులు.. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుంటే 10 శాతం నుంచి 20 శాతం కూడా చేతికి రావడంలేదు. దీంతో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా చేస్తున్న విజ్ఞప్తికి ప్రభుత్వంలో తాజాగా కదలిక వచ్చింది. ఈ పథకం ప్రభావవంతంగా అమలు కావడానికి తమ వంతు పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నామని సంఘాలు చెప్పడంతో ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దాంతో త్వరలో విధి విధానాలు ఖరారు కానున్నాయి.

ప్రభుత్వానికే మేలు

వాస్తవానికి ఏటా రూ.300 కోట్ల నుంచి రూ.350 కోట్ల దాకా ప్రభుత్వం మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకం కోసం వెచ్చిస్తోంది. సకాలంలో చెల్లింపులు లేకపోవడం వల్లే ఆస్పత్రులు ఎడాపెడా బిల్లులు వసూలు చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌వోసీ) కింద అందినకాడికి దండుకుంటున్నాయి. సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో అపెండిసైటిస్ కు నగదు చెల్లిస్తే రూ.60 వేలకే చికిత్స అందించే ఆ ఆస్పత్రి, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ తెచ్చుకోవడంతో ఆ ఆపరేషన్‌ కోసం ఏకంగా రూ.1.20 లక్షలు బిల్లుగా వేసుకొని ప్రభుత్వం నుంచి వసూలు చేసుకుంది. ఇక రూ.45 వేలకు అయ్యే ఆపరేషన్‌కు ఏకంగా రూ.1.20 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి. అయితే దీనికోసం ఉద్యోగుల వాటాను వ సూలు చేసుకొని, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్ ) తరహాలో చెల్లింపులు చేస్తే ప్రభుత్వంపై కూడా భారం తగ్గుతుందని పలువురు సూచిస్తున్నారు.

సీజీహెచ్‌ఎస్లో ఇలా..

ఉద్యోగులు/అధికారులు సర్వీసులో ఉన్నప్పుడు లెవల్‌ 1 నుంచి 5 దాకా ఉన్న ఉద్యోగులు నెలకు రూ.250, లెవల్‌-6 అధికారులు రూ.450, లెవల్‌ 7-11 అధికారులు రూ.650, లెవల్‌-12 ఆపై అధికారులు రూ.1000 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. పెన్షనర్‌లు అయితే పదవీ విరమణ చేసే సమయంలో పదేళ్ల ప్రీమియం ఒకేసారి కట్టాల్సి ఉంటుంది.

అత్యవసర సమయంలో కార్డుతో సీజీహెచ్‌ఎస్ ఆమోదించిన ఏ ఆస్పత్రిలో చేరినా పరిమితి లేకుండా వైద్యం చేయించుకోవొచ్చు. ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోపు సీజీహెచ్‌ఎస్ అధికారులు ఆస్పత్రిని సందర్శించి.. చేరిన రోగి వివరాలు తెలుసుకొని ఆమోదం తెలుపుతారు. ఇతరత్రా సమయంలో అయితే డిస్పెన్సరీకి వెళ్లి.. రిఫరల్‌ లెటర్‌తో ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది.

ఏడాది కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో పలు ఆస్పత్రులు సీజీహెచ్‌ఎస్ కింద నిధులు చెల్లించడానికి విముఖత చూపుతున్నాయి. ప్రస్తుతం ఈహెచ్‌ఎ్‌సలాగే సీజీహెచ్‌ఎస్ మారింది.

ఏడాది కిందటి దాకా ఏ ఆస్పత్రి అయినా సీజీహెచ్‌ఎ్‌స కార్డుదారులకు పరిమితి లేకుండా నగదు రహిత వైద్యం అందించడం గమనార్హం.

ప్రస్తుత ఈహెచ్‌ఎస్లో…

అత్యవసర సమయంలో ప్రభుత్వం గుర్తించిన ఏ ఆస్పత్రిలోనైనా ఈహెచ్‌ఎస్ కార్డుతో నగదు రహిత వైద్యం అందించాలి. ఇతర సమయాల్లో రాష్ట్రంలో 13 వెల్‌నెస్‌ కేంద్రాల్లో ప్రాథమిక చికిత్సకు వెళితే… వారి సూచన ప్రకారం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రిఫరల్‌ లెటర్‌తో చేరాల్సి ఉంటుంది.

ప్రస్తుతం దంత వైద్యం అందించే ఆస్పత్రులే ఈహెచ్‌ఎస్ ను ఆమోదిస్తున్నాయి. నిమ్స్‌లో కూడా పరపతి ఉంటే తప్ప చెల్లుబాటు కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here