నేర స్థలికి పోలీస్‌ డ్రోన్‌

0
209
Spread the love

రోడ్డు ప్రమాదం, మహిళలపై అఘాయిత్యం, వ్యక్తుల అపహరణ, చోరీలు, దాడుల వంటి ఘటనల సందర్భంలో మనకు తక్షణమే గుర్తొచ్చేది.. పోలీసులు! అయితే, కొన్నిసార్లు వారు వాహనాల్లో వచ్చేసరికి పరిస్థితి చేజారుతుంది. ఇరుకు గల్లీలైతే పోలీసుల రాక మరింత ఆలస్యం అవుతుంది. ఈలోగా జరగాల్సింది జరిగిపోతుంది. ఇకపై మాత్రం ఇలాంటి వాటికి అవకాశం లేదు. సైరన్‌తో గాల్లో ఎగురుకుంటూ ‘‘పోలీస్‌ డ్రోన్లు’’ నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకోనున్నాయి. సైరన్‌ మోతతో నేరగాళ్లు అక్కడినుంచి పరారయ్యేలా చేయనున్నాయి. అత్యాధునిక కెమెరాలు, ప్రత్యేక లైటింగ్‌, స్పీకర్లతో జీపీఎస్‌ ఆధారితంగా పనిచేసే ఈ డ్రోన్లు క్షేత్ర స్థాయి పరిస్థితులను క్షణాల్లో పకడ్బందీగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరవేస్తాయి. టెక్నాలజీ వినియోగంలో తిరుగులేని హైదరాబాద్‌ పోలీసులు విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతంటెస్ట్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. మొదట హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అమలు చేయనున్నారు. తర్వాత నగర పరిధిలోని మిగతా కమిషనరేట్లు, జిల్లాలకు విస్తరించనున్నారు. ఇటీవల కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన సూచనలతో యంత్రాంగం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ డ్రోన్లను ‘ఐ డ్రోన్‌ కెమెరా 100’ పేరిట వ్యవహరించనున్నారు.

ఆపదలో ఉన్నవారు స్మార్ట్‌ఫోన్‌లోని హాక్‌ ఐ యాప్‌లో ఉండే ‘‘ఎస్‌వోఎస్‌’’ బటన్‌ నొక్కగానే లొకేషన్‌ సమాచారంతో జీపీఎస్‌ ద్వారా సమీప ఠాణా నుంచి డ్రోన్‌ ఘటనా స్థలికి వెళ్తుంది. అనుమానిత వ్యక్తులు, వస్తువుల సమాచారం, ఫొటోలు సేకరిస్తుంది. వీటి ద్వారా పోలీసులు పరిస్థితిని అంచనా వేసి సిబ్బందిని అప్రమత్తం చేేస వీలుంటుంది. అంబులెన్స్‌, అగ్నిమాపక శాఖ వంటి అత్యవసర సేవలను వాడుకునే అవకాశం ఉంటుంది. డ్రోన్లకు ఉండే సైరన్‌తో నేరగాళ్లకు పోలీసులు వస్తున్నారన్న భయం కలుగుతుంది. ఇదే సమయంలో డ్రోన్ల ద్వారానే బాధితులతో పోలీసులు మాట్లాడవచ్చు. దీంతో వారికి ధైర్యం వస్తుంది. ఒక్కో పోలీస్‌ డ్రోన్‌ మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిని కవర్‌ చేస్తుంది. పగలు, రాత్రి వేళల్లో కెమెరాల సామర్థ్యం, నేర స్థలికి చేరడంలో ఎదురయ్యే అవరోధాలు, బాధితులకు పోలీసులు ఇచ్చే సూచనలు స్పష్టంగా వినిపించేలా స్పీకర్ల సామర్థ్యం పెంపు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఆకతాయిలు డ్రోన్లను రాళ్లతో కొట్టి పాడు చేయకుండా.. ఎంత ఎత్తులో ఆపరేట్‌ చేయాలన్న అంశంపై అధ్యయనం చేస్తున్నారు. వినియోగానికి అనుమతికి కోసం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)కి దరఖాస్తు చేశారు. మరోవైపు ఐ డ్రోన్‌ కెమెరాను వినియోగిస్తూ.. 100 నంబర్‌ సర్వీ్‌సను కూడా ప్రారంభించడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here