పంచాయతీలకే పవర్‌!

0
277
Spread the love

గ్రామ పంచాయతీలు ‘పవర్‌’ఫుల్‌ కానున్నాయి. పంచాయతీ నిధులను ఇకపై పాలకవర్గమే ఖర్చు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు సాధికారత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక పరిమితి దాటిన తర్వాత విధిగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలన్న నిబంధనకు చెల్లుచీటీ ఇచ్చింది. అయితే గ్రామ సభ తీర్మానం, పంచాయతీలో ఉన్న నిధుల ఖర్చు కోసం నిబంధనలను పాటించాల్సిందేనని సూచించింది. గ్రామ పంచాయతీల నిధుల వినియోగానికి సంబంధించి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా శనివారం జీవో నం.18 జారీ చేశారు. దీంతో ఉన్నతాధికారుల అనుమతి అవసరం లేకుండా పంచాయతీలే నేరుగా నిధులు ఖర్చు చేసుకునే వెసులుబాటు లభించింది. కాగా, నల్లగొండ జిల్లా మినహా రాష్ట్రమంతటికీ ఈ నిబంధనలు తక్షణమే వర్తిస్తాయి. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత అక్కడ కూడా నిబంధనలు అమలులో ఉంటాయి.

ప్రస్తుత పరిస్థితి ఇదీ..

గ్రామ పంచాయతీ నిధుల ఖర్చుపై ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం సివిల్‌ పనులకు మేజర్‌ గ్రామ పంచాయతీలు రూ.2 లక్షలు, మైనర్‌ పంచాయతీలు రూ.లక్ష వరకు పరిపాలనా ఆమోదం, అనుమతులను ఇవ్వచ్చు. మేజర్‌ గ్రామ పంచాయతీల్లో రూ.2-3 లక్షల వర కు, మైనర్‌ పంచాయతీల్లో రూ.1-3 లక్షల వరకు డివిజనల్‌ పంచాయతీ అధికారి అనుమతులు ఇవ్వాలి. రూ.3 లక్షలు దాటితే జిల్లా కలెక్టర్‌ అనుమతిస్తారు. పంచాయతీల్లోని అన్ని రకాల గ్రాంట్ల నిధులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. గ్రామ సభ నిర్వహించి, పనుల ప్రాఽధాన్యాన్ని గుర్తించి వార్షిక బడ్జెట్‌ను రూపొందించాలి. పంచాయతీ నిధుల వినియోగంపై ఇప్పటివరకు ఉన్న ఈ నిబంధనలతో అనుమతులు, పనుల నిర్వహణ ఆలస్యమయ్యేది.

మరమ్మతులు మినహా అన్ని పనులకూ ఉన్నతాధికారుల అనుమతులు అవసరమయ్యేవి. దీంతో గ్రామసభ తీర్మానం, నిధుల వివరాలను పొందుపరిచి ఉన్నతాధికారులకు పంపితే కొన్ని సందర్భాల్లో అనుమతులకు నెలలు కూడా పట్టేవి. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పల్లె ప్రకృతి వ నాలు, రహదారుల నిర్మాణం, డంపింగ్‌ యార్డులు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, రైతు కల్లాలు.. ఇలా అన్ని పనులకూ జిల్లా స్థాయి అనుమతులు తీసుకున్నారు. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపినందున ఉన్నతాధికారులు వేగంగానే అనుమతులిచ్చారు. ఇక నుంచి ఈ అనుమతులన్నీ పంచాయతీల స్థాయిలోనే జరుగుతాయి.

నిబంధనల మేరకే: ఎర్రబెల్లి

గ్రామసభ ఆమోదంతో నిబంధనల మేరకు నచ్చిన పనులకు పంచాయతీ నిధులను వినియోగించుకోవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో పల్లె ప్రగతి మరింత పరుగులు పెట్టనుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here