పెళ్లి పేరుతో 11.5 కోట్లు లాగేశారు!

0
218
Spread the love

ఒక మైనింగ్‌ వ్యాపారికి మాయమాటలు చెప్పి ఏకంగా రూ.11.50 కోట్లు దోచుకున్న ఘరానా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు! వారి నుంచి పెద్ద ఎత్తున బంగారం, వెండి, ఖరీదైన కార్లు, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నగర శివార్లలోని బాచుపల్లిలో జరిగిందీ ఘటన. కడప ప్రాంతానికి చెందిన మైనింగ్‌ వ్యాపారి పి.వీరారెడ్డి (36) బాచుపల్లిలోని ఏపీఆర్‌ ప్రణవ్‌ అంటిల్లా విల్లా నంబర్‌ 268లో నివాసం ఉంటున్నారు. పక్క విల్లాలో ఉంటున్న అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి వీరారెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. తాను ఐపీఎ్‌సకు ఎంపికయ్యానని, తన భార్య శ్రుతి సిన్హా మానవ హక్కుల కమిషన్‌ దక్షిణ భారత విభాగానికి చైర్మన్‌ అని. తన తండ్రి రాఘవ రెడ్డి డీసీపీ అని.. తమకు 77 బస్సులున్నాయని, 32 ఎకరాల పొలం ఉందని వీరారెడ్డికి అబద్ధాలు చెప్పాడు. వీరారెడ్డి తన తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు తెలుసుకుని.. తమకు తెలిసిన ప్రవల్లిక అనే అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన వీరారెడ్డి ఆమెతో మాట్లాడుతానని అడగ్గా.. శ్రుతిసిన్హాతో ఫోన్‌లో మాట్లాడించాడు.

ఇలా విజయ్‌కుమార్‌ రెడ్డి, శ్రుతి సిన్హా 2017 నుంచి అతడిని రకరకాలుగా నమ్మిస్తూ దశలవారీగా రూ.11.50 కోట్లు తీసుకున్నారు. నిజానికి వారిద్దరూ భార్యాభర్తలు కారు. వృత్తి రీత్యా కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ అయిన విజయ్‌కుమార్‌ రెడ్డి.. భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటూ బోరబండలో సూపర్‌మార్కెట్‌ నిర్వహిస్తున్న శ్రుతి సిన్హాతో సహజీవనం చేస్తున్నాడు. విలాసవంతమైన జీవితానికి, జల్సాలకు అలవాటు పడిన వీరిద్దరూ డబ్బుల కోసం తప్పుడు దారి పట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారం వీరారెడ్డిని మోసం చేసి ఖరీదైన కార్లు, బంగారం కొనుగోలు చేశారు. నగరశివార్లలోని ఓ రిసార్ట్‌లో ఏకంగా 40 రోజులు గడిపి నలభై లక్షలు చెల్లించారు. అయితే.. విలాసాలపై శ్రుతి మోజు మరింతగా పెరగడం, వీరారెడ్డి నుంచి డబ్బు కోసం ఒత్తిడి పెరుగుతుండడంతో విజయ్‌కుమార్‌ రెడ్డి ఈ నెల 5న ఉరి వేసుకుని చనిపోయాడు.

అతడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో ఈ మోసానికి సంబంధించిన తీగ దొరికింది. అదే సమయంలో.. విజయ్‌కుమార్‌ రెడ్డి ఆత్మహత్య నేపథ్యంలో తాను మోసపోయినట్టు తెలుసుకున్న వీరారెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలింది. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి.. శ్రుతి సిన్హాను, ఆమెకు సహకరించిన రాఘవరెడ్డి, రణధీర్‌రెడ్డి అలియాస్‌ రాణా, రామకృష్ణారెడ్డి అనే మరో ముగ్గురు వ్యక్తులను (అంతా విజయ్‌కుమార్‌ రెడ్డి కుటుంబసభ్యులే) అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 50 లక్షల విలువ చేసే బంగారం, వెండి, ఏడు ఫోన్లు, మూడు బీఎండబ్ల్యూ కార్లు, రెండు ఫోర్డ్‌ కార్లు, రూ.రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here