సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా గెలిచినట్లే. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మాత్రం లెక్కింపు ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రాధాన్య ఓట్ల విధానంతో ఫలితాలు ఎప్పుడు, ఎటు మారతాయోనన్న ఉత్కంఠ? ఒక్కో రౌండ్‌కు చివరన ఉన్న అభ్యర్థులను తొలగిస్తూ.. తదుపరి రౌండ్‌కు వెళతారు. ఇలా ఫలితం తేలేవరకు లెక్కించాల్సిన పరిస్థితి రావచ్చు. దీంతో బుధవారం జరిగే ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ నుంచి 93 మంది, నల్లగొండ- ఖమ్మం- వరంగల్ నుంచి 71 మంది పోటీ చేశారు. ప్రాధాన్య ఓటింగ్ విధానంలో ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడడం దేశంలో ఇదే తొలిసారి అన్న అంచనాలు ఉన్నాయి.
ఒక్కో నియోజకవర్గంలో 5 లక్షలకు పైగా ఓట్లు ఉండగా పోలింగ్ శాతాన్ని బట్టి రెండు చోట్లా 3-3.5 లక్షల వరకు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు, జంబో బ్యాలెట్ పత్రాలతో కౌంటింగ్ రెండు రోజులకు పైగానే పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాధాన్య ఓటింగ్ విధానంలో విజేత కావడానికి కోటా నిర్ణయిస్తారు. ఇది చె ల్లుబాటు ఓట్లలో సగాని కంటే ఒకటి ఎక్కువ. ఉదాహరణకు 10 మంది అభ్యర్థులు పోటీ చేశారనుకుందాం. మొత్తం ఓట్లు 350000 కాగా.. పోలైనవి 320000, చెల్లినవి 280000 అనుకుంటే.. విజేతకు కావాల్సిన కనీస ఓట్లు 140001.
లెక్కింపు ఇలా..
మొదటి రౌండ్: చెల్లిన ఓట్లు 280000లలో పది మందిలో ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కిస్తారు. ఈ రౌండ్‌లోనే ఎవరికైనా 140001 గానీ అంతకన్నా ఎక్కువ ఓట్లు వస్తే అతను నేరుగా విజేత అవుతారు. ఏ ఒక్కరికి ఈ సంఖ్య రాకపోతే రెండో రౌండ్‌కు వెళతారు.
రెండో రౌండ్: మొదటి రౌండ్‌లో చివరన ఉన్న(అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన) అభ్యర్థికి మొదటి ప్రాధాన్యం కింద 2000 ఓట్లు వచ్చాయనుకుందాం. చివరన ఉన్నందున అతనిని పోటీ నుంచి తప్పిస్తారు. అతనికి వచ్చిన 2000 ఓట్లలో ఎవరెవరికి రెండో ప్రాధాన్య ఓట్లు ఎన్ని వచ్చాయో లెక్కించి, పై తొమ్మిది మంది అభ్యర్థులకు కలుపుతారు. అయితే, తొలగించిన అభ్యర్థికి పడిన 2000 ఓట్లలో చాలా వరకు రెండో ప్రాధాన్యం ఇవ్వక.. కేవలం 1500 బ్యాలెట్ పత్రాల్లోనే రెండో ప్రాధాన్యత ఇచ్చారనుకుందాం. అంటే ఈ రౌండ్‌లో లెక్కించే బ్యాలెట్ పత్రాలు కేవలం 1500 మాత్రమే. అప్పటికీ ఏ ఒక్కరికి కూడా మెజారిటీ రాకపోతే మూడో రౌండ్‌కు వెళతారు. అప్పుడు 9వ స్థానంలో ఉన్న అభ్యర్థిని పోటీ నుంచి తప్పించి, అతనికి వచ్చిన ఓట్లలో ఉన్న రెండో ప్రాధాన్య ఓట్లను పై 8 మంది అభ్యర్థులకు కలుపుతారు. తదుపరి 8వ స్థానంలో ఉన్న అభ్యర్థిని తప్పిస్తారు. ఫలితం తేలే వరకు లేదా చివరన ఇద్దరు మాత్రమే మిగిలే వరకు లెక్కింపు కొనసాగుంది.
చివరన ఉన్న అభ్యర్థులను క్ర మంగా తొలగిస్తూ.. ఇద్దరు మాత్రమే మిగిలి ఉంటే, అప్పుడు కోటాతో సంబంధం లేకుండా ఎక్కువ ఓట్లున్న వ్యక్తి విజేత అవుతారు. ఒక్కో రౌండ్‌లో ఎవరికి, ఎన్ని ఓట్లు లభించాయి? అన్నదానిని పరిగణించి తదుపరి రౌండ్‌కు వెళుతుంటారు. దీంతో ఎన్ని రౌండ్‌ల వరకు వెళ్లాల్సి వస్తుందన్నది? లెక్కింపు రోజున వచ్చే ఓట్ల ప్రాధాన్యంపైనే ఆధారపడి ఉంటుది.

జీహెచ్‌ఎంసీలో ఏర్పాట్లు..
శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలైంది. బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం రానుంది. ఎనిమిది హాళ్లలో 56 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. 5.31 లక్షల ఓట్లకుగాను.. 3.57 లక్షల ఓట్లు పోలయ్యాయి. మొదట అభ్యర్థుల వారీగా తొలి ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తారు. వివిధ జిల్లాల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు సరూర్‌నగర్ స్టేడియానికి బ్యాలెట్ బాక్సులు వచ్చాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో జిల్లాల నుంచి వాహనాలు ఒకేసారి రావడంతో 3 గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయ్యిందని అధికారులు చెప్పారు. ఇక హైదరాబాద్ స్థానానికి సంబంధించి 9 జిల్లాల్లోని 799 కేంద్రాల్లో ఓటింగ్ జరగ్గా 67.26 శాతం పోలింగ్ నమోదైనట్టు వెల్లడించారు. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 80.81 శాతం, వికారాబాద్‌లో 80.55, వనపర్తిలో 80.33 శాతం మంది ఓటు వేశారు. అత్యల్పంగా హైదరాబాద్‌లో 60.77 శాతం పోలింగ్ నమోదైంది.
రౌండ్‌లపై ఉత్కంఠ
అభ్యర్థులు, పోలైన ఓట్లు, పోలింగ్ సరళిపై అంచనాలతో లెక్కింపు రౌండ్‌లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొదటి రౌండ్‌లోనే నేరుగా కోటా ఓట్లు సాధిస్తే ఫలితం 17న సాయంత్రానికి లేదా అర్ధరాత్రికి వెలువడే అవకాశాలున్నాయి. కోటా ఓట్లు ఎవరికీ రాకపోతే రౌండ్‌లు కొనసాగుతాయి. ఈ 2 స్థానాల్లోనూ చాలా రౌండ్‌లు పూర్తయితేగానీ ఫలితాలు రాకపోవచ్చన్న అంచనాలున్నాయి.