కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందనిటీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీల వల్ల ఎటువంటి లాభం లేకపోయిందని, రాష్ట్ర ప్రతిపాదనలను ఒక్కటి కూడా బడ్జెట్‌లో కేంద్రం ప్రస్తావించలేదని అన్నారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలు నెట్‌వర్క్‌ను విస్తరించడానికి నిధులు కేటాయించలేదని, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై ప్రకటన లేదని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించిందని, తెలంగాణపై కేంద్రానికి ఎందుకింత వివక్ష అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం వద్ద తెలంగాణ ప్రయోజనాలను సీఎం కేసీఆర్ తాకట్టుపెట్టడం వల్లే రాష్ట్రాన్ని కేంద్రం విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. ఆశ్రిత పెట్టుబడిదారులకు దోచిపెట్టేలా బడ్జెట్ ఉందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. బడ్జెట్‌తో తెలుగు రాష్ట్రాలకు శూన్యహస్తమే మిగిలిందని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తారని భావిస్తే దానికి భిన్నంగా రైతులను పూర్తిగా విస్మరించారని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. ఓబీసీలకు కేటాయింపులు ఏమీ లేవని, ఇది ఓబీసీ జీరో బడ్జెట్ అని టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ కత్తి వెంకటస్వామి అన్నారు.
కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. కేంద్ర బడ్టెట్ సామాన్యుల నడ్డి విరిచేలా ఉందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. బడ్జెట్ దేశానికి వ్యతిరేకంగా ఉందని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకుడు పోటు రంగారావు అన్నారు. కార్పొరేట్లను అందలం ఎక్కించేలా, పేదలు మరింత పేదలుగా మారేలా బడ్జెట్ ఉందని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.