నారు అమ్ముకోవడానికి బయలు దేరిన అన్నదమ్ముల జీవితాలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. దేవరకొండ- డిండి ప్రధాన రహదారిలోని మైదలవాగుపై ఉన్న ఇరుకు వంతెనపైనుంచి లారీ కిందపడడంతో క్యాబిన్‌లో ఉన్న అన్నదమ్ములు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాజిల్లా కీసర గ్రామానికి చెందిన అన్నదమ్ములు చలమల వెంకటేశ్వరరావు(53), చలమల చిన్న నరసింహారావు(50) 30 ఏళ్లుగా టమాటా, మిరప, ఉల్లి నారు విక్రయిస్తూ జీవనం గడుపుతున్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌లో సంత ఉండడంతో తమ సోదరుడి కుమారుడు నాగేశ్వరరావుతో కలిసి శనివారం అర్ధరాత్రి నాగర్ కర్నూల్‌కు బయలు దేరారు. జగ్గయ్యపేటనుంచి అచ్చంపేట వెళ్తున్న సిమెంట్ లోడు లారీని చిలకల్లు దగ్గర ఆపి క్యాబిన్‌లో ఎక్కారు.

ఆదివారం తెల్లవారు జామున 5.30 గంటలకు దేవరకొండ- డిండి ప్రధాన రహదారిలోని మైదలవాగుపై ఉన్న ఇరుకు వంతెన మీద లారీ అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో లారీ 18 అడుగుల ఎత్తునుంచి కిందకు పడింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు, చిన నరసింహారావు అక్కడికక్కడే మరణించారు. లారీ డ్రైవర్ రవి, నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడి బయటకు రాలేక క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. స్థానికులు, 108 సిబ్బంది కలిసి వారిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం దేవరకొండ నుంచి హైదరాబాద్‌కు తరలించారు.