బమ్మెరలో మంత్రుల పర్యటన.. పోతన సమాధికి నివాళులు

0
213
Spread the love

తెలుగు పద్యానికి చిరునామాగా నిలిచిన మహాకవి పోతన. తన పద్యరత్నాలతో పండితపామరులను మెప్పించి.. అశేషాంధ్రులకు గర్వకారణమయ్యారు. ఆయన రచించిన ఆంధ్ర మహాభాగవత పద్యాలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి.  పోతన జీవిత కథ ఆధారంగా చిత్తూరు నాగయ్య భక్త పోతన సినిమా తీసిన విషయం తెలిసిందే. సాహితీ సభల్లో ఉండే మేధావులకే కాదు.. పశువులను కాసే వారికి కూడా పోతన పద్యాలు కంఠతా వచ్చేవి. అంతటి మహాకవి జన్మించిన బమ్మెర గ్రామ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కళాక్షేత్రం ఆడిటోరియం నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.   

బమ్మెర గ్రామంలో శుక్రవారం రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. అక్కడ ఉన్న పోతన సమాధిని సందర్శించి.. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం ఆదేశాలతో బమ్మెర గ్రామంలో నిర్మిస్తున్న ‘కళాక్షేత్రం’ ఆడిటోరియం పనులను పరిశీలించినట్టు శ్రీనివాస్ గౌడ్ ట్వీట్ చేశారు. దీన్ని రూ.10కోట్లతో నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు.

బమ్మెరను మరో బాసరగా తీర్చిదిద్దుతామని గత పర్యటనలో మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. బమ్మెర అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ఇష్టమని, పోతన ఇష్టమైన కవి అని పేర్కొన్న ఆయన.. ఏడాది లోపు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆడిటోరియం ప్రారంభిస్తామని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన సహచర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మరోసారి అభివృద్ధి పనులను పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here