ఆహార భద్రత కార్డుల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఆశావహులకు త్వరలో మోక్షం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా హాలియాలో ఇటీవల నిర్వహించిన బహిరంగసభలో త్వరలో బియ్యం రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించటంతో దరఖాస్తులు వరదలా వచ్చిపడుతున్నాయి. పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఇప్పటికే 9 లక్షలకు చేరగా.. సీఎం ప్రకటనతో మరింత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. పంచాయతీరాజ్ శాఖలో వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుల సంఖ్య 80 వేల వరకు పెడింగ్ ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,56,112 ఆహార భద్రత(బియ్యం రేషన్) కార్డులు ఉన్నాయి. కార్డుల కింద 2,80,58,651 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో జాతీయ ఆహార భద్రత కార్డులు 53,29,382 ఉన్నాయి. ఈ కార్డులపై 1,91,61,960 మంది లబ్ధిదారులు ఉండటం గమనార్హం. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు సఢలించి జారీ చేసిన ఆహార భద్రత కార్డులు 34,25,189 ఉన్నాయి. వీటిపై 88,79,655 మంది వినియోగదారులు ఉన్నారు. ఆహార భద్రత కార్డులను ప్రధానంగా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ చేయటానికే పరిగణనలోకి తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్డుల జారీకి రూ.1.50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షల వరకు ఉండాలి. 3.5 ఎకరాల తరి, 7.5 ఎకరాల కుష్కి భూమి ఉన్నవారిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. జనాభా పెరగటం, కుటుంబ సభ్యులు వేరుపడటంతో అర్హుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రెండేళ్లుగా కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలేదు.

మీ- సేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొన్ని నెలలు అవి కూడా ఆపేశారు. మళ్లీ ఇటీవల మీ-సేవలో అవకాశం ఇచ్చారు. 2019 నుంచి ఇప్పటివరకు మీ-సేవలో దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య 9 లక్షలకు చేరింది. వీటిలో సింహభాగం దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయింది. తొలుత ఇన్‌స్పెక్టర్ స్థాయిలో వీఆర్వో/రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విచారణ చేస్తున్నారు. తర్వాత తహసీల్దారు విచారణ చేస్తున్నారు. ఆ తర్వాత డీఎ్‌సవో స్థాయిలో విచారించి ధ్రువీకరిస్తున్నారు. ఆ తర్వాత డీకేఆర్(డైనమిక్ కీ రిజిస్టర్)లో నమోదు చేస్తారు. ఈ మూడంచెల ప్రక్రియ పూర్తి చేసుకున్న దరఖాస్తుల సంఖ్య 5 లక్షల వరకు ఉన్నట్లు తెలిసింది. మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. ఎలాగూ కార్డులు ఇవ్వట్లేదని ఇంకా కొంత మంది దరఖాస్తులు చేసుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించటంతో… దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పెరుగుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా ఒక్క కార్డు కూడా జారీకాకపోవటంతో… ఇప్పటికే మండలస్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కార్యాలయం చుట్టూ కూడా ఆశావహులు తిరుగుతున్నారు. కార్డుల కోసం అధికారులను నిలదీస్తున్నారు. తమచేతుల్లో ఏమీ లేదని, ఆహార భద్రత కార్డులు జారీ చేయడం, చేయకపోవటం ప్రభుత్వ నిర్ణయమని చెప్పి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రతినిఽధులకు కూడా క్షేత్రస్థాయిలో ఇవే సమస్యలు ఎదురవుతున్నాయి.
వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులు పెండింగ్
వృద్ధాప్య పింఛన్ల కోసం అర్హులైన వారు చేసుకున్న దరఖాస్తులు కూడా 80వేల నుంచి లక్ష వర కు పెండింగ్ ఉన్నట్లు సమాచారం. 2018 నుంచి ఈ పింఛన్లు జారీచేసే ప్రక్రియ నిలిచిపోయింది. దరఖాస్తులు తీసుకోవటమే తప్ప మంజూరు లేదు. దీంతో అర్హులైన వృద్ధులు ఎదురు చూస్తున్నారు. ఇతరత్రా అన్నిరకాల పింఛన్ దరఖాస్తులు కలిపి 2 లక్షల వరకు ఉంటాయని సమాచారం. వయోపరిమితి తగ్గిస్తే ఈ సంఖ్య సుమారు 7.50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం 65 ఏండ్ల వయో పరిమితి ఉంది. దీనిని రాష్ట్రప్రభుత్వం 57 ఏండ్లకు తగ్గిస్తే.. అంతా కలిపి 8 లక్షల పైచిలుకు అర్హులు ఉంటారు. ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారితే మార్చి 22 వరకు కూడా కార్డులు గానీ, పింఛన్లు గానీ మంజూరు చేసే అవకాశం ఉండదు. ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుంటే తక్షణమే సమస్య పరిష్కారం అవుతుంది.
చత్వరలో అంటే ఎప్పుడు?
ఆహార భద్రత కార్డులు త్వరలో జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ఈ నెల 10న ప్రకటించారు. ఇంతవరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు అందుకు సంబంధించిన ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఈలోగా 11 తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఆహార భద్రత కార్డుల పంపిణీ అనేది కొత్త పథకం కాదు. నిరంతరంగా నిర్వహించే ప్రక్రియ. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. త్వరలో జారీ చేస్తామని సీఎం చెప్పినప్పటికీ.. త్వరలో అంటే ఎప్పుడు? అనే చర్చ జోరుగా సాగుతోంది. అర్హులైన పేదలు మాత్రం ఆహార భద్రత కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.