నిన్నటి వరకు చుక్కనీరు లేక బీడువారిన నేలలు.. నేడు పచ్చటి మాగాణులై సిరిలొలికిస్తున్నాయి. వానాకాలంలోనూ సాగు నీటికోసం యాతన పడే ఈ ప్రాంతంలో ఇప్పుడు మండే ఎండల్లోనూ జలకళతో ఉట్టిపడుతున్నాయి. ప్రస్తుత యాసంగిలోనూ ఊరూరా గోదావరి గలగలలు వినిపిస్తున్నాయి.. చెరువులు, చెక్‌డ్యాములు మత్తళ్లు దుంకుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల ఫలితంగా ఈ దృశ్యం ఇప్పుడు సిద్దిపేట ప్రాంతంలో సాక్షాత్కారమవుతోంది. వానలపై ఆధారపడి సాగు చేసిన పంటలకు సకాలంలో నీరు అందక ఎండిపోతే అప్పు లు తీర్చలేక, బతుకు బండిని నడపలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఈ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి.

అలాంటి బతుకుచిత్రాలను మారుస్తూ నేడు ‘కాళేశ్వరం’ ఫలితాలు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. సిద్దిపేట పట్టణ శివారులో 3టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను గత ఏడాది ఏప్రిల్ నెలాఖరులో ప్రారంభించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి ఇక్కడికి గోదావరి నీటిని ఎత్తిపోస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంత్రి హరీశ్‌రావు యాసంగి సాగు కోసం రంగనాయకసాగర్ నుండి నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కాలువల ద్వారా విడుదలైన ఈ నీటితో చెరువులు, చెక్‌డ్యాములు జలకళను సంతరించుకున్నాయి. 11,500 ఎకరాలకు సరిపడా ఇప్పటికే నీళ్లు చేరాయి. ఇంకా మరో 30వేల ఎకరాలకు నీటిని తరలించేలా చర్యలు చేపట్టారు. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, నంగునూరు మండలాల్లోని గ్రామాలకు ఇప్పటికే నీళ్లు తరలాయి. దీంతో ఈ ప్రాంతంలోని రైతులు వరి, మిర్చి పంటలను విస్తృతంగా సాగు చేశారు. తమ కష్టం ఫలించిందని, తమ భూములు పచ్చటి మాగాణులై విరాజిల్లుతున్నాయన్న ఆనందం ఇప్పుడు రైతుల మోములో తొణికిసలాడుతోంది.
ఆత్మహత్యల నుంచి ఆత్మవిశ్వాసం దిశగా..
ఎండాకాలం వచ్చిందంటే బావులు ఎండటం, రైతుల ముఖాలు మొగులు వైపు చూడటం, పొలాల్లో ఉరితాళ్లు, ఆత్మహత్యల బాధలు ఎక్కువగా ఉండేవి. నేడు ఆత్మహత్యల బాధ నుండి ఆత్మవిశ్వాసాన్ని రైతుల్లో కలిగించడంలో కాళేశ్వరం ప్రాజెక్టు దోహదపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో సిద్దిపేట ప్రాంతంలో యాసంగి పంటలకూ గోదావరి నీళ్లందుతున్నాయి.
హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇగ నీళ్ల రంది పోయింది
నాకు ఆరెకరాల భూముంది. పోయిన యాసంగి నీళ్లు లేక బీడు పెట్టిన. వానికాలం ఇంత పొలం, ఇంత పత్తేసిన. ఇగ మళ్ల యాసంగిలో నీళ్లు వదుల్తరని తెలిసి మూడెకరాలు పొలం పెట్టిన. ఇగ ఇప్పుడు మా ఊర్లోకి గోదారి నీళ్లు వచ్చినయి. మిగిలిన మూడెకరాలు పొలం చేస్తా. నాకే గాదు మా ఊరోళ్ల రంది తీర్చిన మా కేసీఆర్, హరీశ్‌రావు సార్ల రుణం తీర్చుకుంటం.
తోకల రాజయ్య, రైతు, గుర్రాలగొంది
12 ఎకరాలు సాగు చేశా..
యాసంగి పంటలకు నీళ్లొస్తాయంటే ఎవ్వరం కూడా ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. నాకు 12 ఎకరాలు ఉంటే యాసంగిలో పోయినేడు 3 ఎకరాలు సాగు చేశాను. కానీ నీళ్లు అందక నష్టం వచ్చింది. ఇప్పుడు రంగనాయకసాగర్‌తో మా ఊర్లోకి నీళ్లు వచ్చినందుకు 7 ఎకరాల్లో వరి, మిగతా 5 ఎకరాల్లో మిర్చి, పొద్దుతిరుగుడు సాగు చేశా.
ఏలేటి రవీందర్‌రెడ్డి, రైతు, మాచాపూర్