బీమా పరిహారం కోసం.. భర్తను చంపించింది

0
461
Spread the love

బీమా పరిహారం కోసం భార్యే భర్తను చంపించిన దారుణ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ దారుణంలో ప్రధాన పాత్ర పోషించిన ‘బీమా’యగాళ్ల ముఠా బాగోతం బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే.. దామరచర్ల మండలం కొండ్రపోలు గ్రామానికి చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి దామరచర్లలోని ఓ మద్యం దుకాణంలో సర్వర్‌గా పనిచేసేవాడు. రోజులాగే ఫిబ్రవరి 25న కూడా వెళ్లిన ఆయన నార్కట్‌పల్లి- అద్దంకి హైవేపై బొత్తలపాలెం స్టేజీ వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ట్రాక్టర్‌ ఢీకొనడంతో అతడు మృతిచెందాడని ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో.. కోటిరెడ్డి కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధుమిత్రులు ఆస్పత్రి వద్దకు చేరుకొని మృతదేహాన్ని చూసి శరీరంపై బలమైన గాయాలు ఉండటాన్ని గమనించారు. ఈవిషయాన్ని కోటిరెడ్డి తల్లి సీతమ్మకు చెప్పారు. తన కుమారుడి పేరిట ఉన్న బీమా పాలసీల క్లెయిమ్‌ డబ్బుల కోసమే హత్యచేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ మొదలుపెట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ తల్లి అనుమానమే నిజమని బహిర్గతమైంది. సాక్షాత్తూ కోటిరెడ్డి భార్యే అతడి హత్య కోసం బీమా ఏజెంటుతో కలిసి కుట్ర పన్ని అతడిని హతమార్చినట్లు గుర్తించారు. బీమా ముఠా వాళ్లు ఇస్తానన్న 25 శాతం క్లెయిమ్‌ డబ్బుల కోసం.. ఆమె తన భర్త ప్రాణాలను ఫణంగా పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు సహా మొత్తం 20 మంది ముఠా సభ్యులను నల్లగొండ పోలీసులు నాలుగు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్‌, మాచర్ల, ఒంగోలు ప్రాంతాల్లో బీమా దందా కొనసాగినట్లుగా పోలీసులు గుర్తించారు.

ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకొని..

అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని నిర్జీవ ప్రదేశంలో హత్య చేయడం.. అర్ధరాత్రి వేళ ఆ మృతదేహాన్ని రోడ్డుపైకి తెచ్చి పడేసి, ఇన్సూరెన్స్‌ కలిగిన వాహనాలతో వాటిని తొక్కించడం!! ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షులను సృష్టించి, దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం!! ఇదీ ‘బీమా’యగాళ్ల ముఠా చేస్తున్న నరహంతక దందా!! కోటిరెడ్డి అనుమానాస్పద మరణం వెనుక కూడా ఇదే విధమైన నేపథ్యం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేదరికం, అప్పుల ఊబిలో చిక్కుకున్న కుటుంబాలను ఈ ముఠా సభ్యులు ఎంచుకుని, అనారోగ్యంతో ఉన్న వారి పేరిట సొంత ఖర్చులతో బీమా పాలసీ చేయిస్తారు. ప్రీమియం చెల్లించడానికి ముందు ఖాళీ ప్రామిసరీ నోట్లపై కుటుంబసభ్యుల సంతకాలు చేయించుకుంటారు. పాలసీ తీసుకున్న వ్యక్తిని హతమార్చేందుకు అంగీకరించేలా నామినీగా ఉన్నవారికి డబ్బు ఆశ చూపుతారు. అందుకు అంగీకరించగానే.. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని నిర్జీవ ప్రదేశంలో హత్యచేసి.. అర్ధరాత్రి వేళ రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తారు. ఇదే తరహాలో మిర్యాలగూడ మండలం పరిధిలో ముగ్గురిని, దామరచర్లలో ముగ్గురిని, తిరుమలగిరి సాగర్‌లో ఒకరిని హతమార్చి పెద్దమొత్తంలో బీమా క్లెయిమ్‌లు చేజిక్కించుకున్నట్లు సమాచారం. దామరచర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈవిధమైన పైశాచిక దందా చేసి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.

దందాకు బీజం పడిందిలా..

బీమా పాలసీ చేయించుకున్న వ్యక్తి బతికి ఉండగానే.. చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి క్లెయిమ్‌ సొమ్మును కాజేసిన పలు ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. ఈవిధమైన ఓ కుంభకోణం 2018లో మిర్యాలగూడలో బయటపడింది. దీనిలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన ఓ అధికారి తన పైఅధికారి ఐడీ నంబర్‌ను హ్యాక్‌ చేసి బీమా సంస్థకు మరణ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయడంతో పరిహారం క్లెయిమ్‌ అయింది. బతికున్న తన భార్యనే మృతిచెందినట్లుగా నకిలీ పత్రాలను సమర్పించిన తీరు అప్పట్లో బీమా రంగాన్ని అబాసుపాలుచేసింది. దామరచర్ల మండలం రాళ్లవాగు తండాకు చెందిన ఇద్దరు బీమా ఏజెంట్లు 2017లో ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో నకిలీ బీమా పాలసీలు చేయిస్తూ పోలీసులకు దొరికిపోయారు. మరికొందరి వ్యక్తిగత వివరాలు సేకరిస్తూ దొంగ పాలసీలతో మోసం చేసేందుకు యత్నించగా తెనాలి పోలీసులు అరెస్టు చేసి చీటింగ్‌ కేసు నమోదు చేశారు. అప్పట్లోనే పోలీసులు సమగ్రవిచారణ జరిపి ఉంటే ఈ నయా దందాకు బీజంపడి ఉండేది కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here