నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ఓ ఎస్సై, మరో ఏఎస్సైపై వేటు వేశారు. వారిని కూడా అరెస్టు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. బోధన్ నుంచి ఎంతమంది రోహింగ్యాలకు పాస్‌పోర్టులు జారీ అయ్యాయనే లెక్క తేల్చే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు 72 మంది ఇలా పాస్‌పోర్టులు తీసుకున్నారని, ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు వెరిఫికేషన్‌లో లోపాలున్నట్లు నిగ్గుతేల్చారు. కొందరు రోహింగ్యాలు గత నెల 26న పాస్‌పోర్టుపై ఇతర దేశాలకు వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లగా.. అక్కడి ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది. జిల్లా పోలీసులు దీనిపై సీరియ్‌సగా దర్యాప్తు చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు.. గత ఆరేళ్లలో జారీ అయిన పాస్‌పోర్టులను పరిశీలిస్తున్నారు. ఒకే ఇంటి నుంచి 32 పాస్‌పోర్టులు జారీ అయినట్లు గుర్తించారు. ఆ ఇల్లు.. అప్పట్లో ఏఎస్సైగా పనిచేసిన మల్లేశ్‌కు సంబంధించిందని నిర్ధారించారు. ఆయనను సస్పెండ్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా చేర్చి, అరెస్టు చేశారు. ఆయన తర్వాత వచ్చిన ఏఎస్సై అనిల్ కూడా.. ఈ వ్యవహారంలో సహకారం అందించినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. ఇద్దరు మీ-సేవ నిర్వాహకులు, నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.

బంగ్లాదేశీ ద్వారా..
తొలుత బంగ్లాదేశీయుడైన ఓ వ్యక్తి బోధన్‌లో నివాసమేర్పరుచుకున్నాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆయుర్వేద డాక్టర్ పరిమళన్‌గా స్థానికులకు పరిచయం చేసుకున్నాడు. 2014లో అతను కొందరు యువకులను బోధన్‌కు రప్పించి.. వారికి ఏఎస్సై మల్లేశ్ ఇంట్లో అద్దెకు దింపాడు. అలా.. ఆ ఇంటి చిరునామాతో 32 పాస్‌పోర్టులు పొందారు. పాస్‌పోర్టు దరఖాస్తులో ఒకే ఫోన్‌నంబరును ఇచ్చారు. ఇలా మరికొందరు యువకులు కూడా.. ఆ ఇంటి చుట్టుపక్కల ఉంటూ.. పాస్‌పోర్టు వచ్చాక వెళ్లిపోయినట్లు పోలీసులు తేల్చారు. వారంతా తన బంధువులేనని పరిమళన్ చెప్పడంతో ఎవరికీ అనుమానం రాలేదని పోలీసులు అంటున్నారు. అప్పట్లో స్పెషల్ బ్రాంచ్(ఎ్‌సబీ)లో పనిచేసిన ఓ అధికారి సహకారం వల్లే.. ఇంత మంది సులభంగా పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తించారు. మీ-సేవ నిర్వాహకుల సహకారంతో వారు సులభంగా పాస్‌పోర్టులు తీసుకున్నట్లు తేల్చారు.
విచారించే పాస్‌పోర్టులు ఇచ్చారా?
నిజానికి పాస్‌పోర్టు పోలీసు వెరిఫికేషన్ చాలా క్లిష్టంగా ఉంటుంది. స్పెషల్ బ్రాంచ్(ఎ్‌సబీ) అధికారులు ఇందుకోసం ప్రత్యేకంగా పనిచేస్తారు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుడు పేర్కొన్న చిరునామాకు వెళ్లి వివరాలను సరిచూసుకుంటారు. నిజంగా దరఖాస్తు దారుడు ఏడాది కాలంగా అక్కడ ఉంటున్నాడా? అనే ఆధారాలను సేకరిస్తారు. ఇరుగుపొరుగును కూడా వాకబు చేస్తారు. పాస్‌పోర్టు దరఖాస్తులో పేర్కొన్న ఇద్దరు ‘రిఫరెన్స్’ వ్యక్తులనూ ప్రశ్నిస్తారు. వారి సంతకాలు, ఆధార్ నంబరు సేకరిస్తారు. అన్నీ సవ్యంగా ఉన్నా.. సమీప పోలీ్‌సస్టేషన్‌లో దరఖాస్తుదారుడిపై ఏమైనా కేసులున్నాయా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత తమ నివేదికను సంబంధిత అధికారి కార్యాలయానికి(జిల్లాల్లో అడ్మిన్ ఎస్పీలు/అదనపు ఎస్పీలు, కమిషనరేట్లలో జాయింట్ కమిషనర్లు) పంపిస్తారు. అక్కడ కూడా వివరాలను సరిచూసుకున్నాక.. పాస్‌పోర్టు ఇవ్వొచ్చా? లేదా? అనే విషయాన్ని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తెలియజేస్తారు. బోధన్‌లో ఈ తంతంగమంతా లేకుండానే.. ఏజెంట్ల సహకారంతో ‘‘మమ’’ అనిపించారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
మందిని అరెస్టు చేశాం: సజ్జనార్
నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్‌లు తీసుకున్న కేసులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి.సజ్జనార్ అన్నారు. తప్పుడు పత్రాలతో బంగ్లాదేశీయులు పాస్‌పోర్టులు తీసుకున్నారని.. వాటి ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వారిని గుర్తించామని ఆయన వివరించారు. వారి పాస్‌పోర్టులు సీజ్ చేసి విచారణ ప్రారంభిస్తే బోధన్‌లో ఉన్న ముఠా లింక్ దొరికిందన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో నలుగురు బంగ్లాదేశీయులు, ఇద్దరు బోధన్‌కు చెందిన వారు, వారికి సహకరించిన మరో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారని తెలిపారు. ఈ ముఠా వెనక స్థానిక అధికారుల ప్రమేయాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం ఇమ్మిగ్రేషన్, ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి లేఖలు రాశామన్నారు.