మంచిర్యాల బడిలో 15 మందికి..

0
176
Spread the love

 రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇటీవల వికారాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో పలువురికి వైరస్‌ నిర్ధారణ కాగా.. సోమవారం మంచిర్యాల, కరీంనగర్‌లోని మూడు పాఠశాలల్లో కొందరికి పాజిటివ్‌ అని తేలింది. పాఠశాలలు, వసతి గృహాల్లో కొవిడ్‌ నిబంధనలను పాటించకపోవడం, శానిటైజేషన్‌ సరిగా లేకపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలలో సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌లు బయటపడ్డాయి. మొత్తం 12 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు వంట మనుషులు, పదో తరగతి విద్యార్థినికి వైరస్‌ సోకినట్లు స్పష్టమైంది. ఈ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఇటీవల జైపూర్‌ మండలంలో జాతరకు వెళ్లి వచ్చారు. అనంతరం జలుబు, జ్వరం ఉండటంతో శుక్రవారం శాంపిల్స్‌ పరీక్షకు ఇచ్చారు. 

అలాగే విధులకూ హాజరయ్యారు. సోమవారం ఆమె పాఠశాలలో ఉండగానే.. పాజిటివ్‌ అని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో హెచ్‌ఎం.. సిబ్బంది, ఉపాధ్యాయులు, పదో తరగతి విద్యార్థులు మొత్తం 50 మందికి పరీక్షలు చేయించారు. మరోవైపు కరీంనగర్‌లోని రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సోమవారం ముగ్గురు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థికి పాజిటివ్‌ వచ్చింది. తొలుత సుభా్‌షనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడికి వైరస్‌ నిర్ధారణ అయింది. జిల్లా వైద్య ఆర్యోగ శాఖ అధికారులు పరీక్షల్లో సప్తగిరి కాలనీలోని పాఠశాలలో మరో ఉపాధ్యాయుడికి, విద్యార్థి కరోనా బారినపడినట్లు స్పష్టమైంది. అప్పటికే కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల నుంచి వెళ్లిపోయారు. వీరికి మంగళవారం పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌ పాఠశాలలో మూడు రోజుల క్రితం ఒక విద్యార్థి, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. అంతకుముందు తిమ్మాపూర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలో 54 మందికి, చొప్పదండి సైనిక గురుకుల పాఠశాలలో 12 మందికి పాజిటివ్‌ వచ్చింది.

రాష్ట్రంలో కొత్తగా 157 కేసులు; ఒకరు మృతి

రాష్ట్రంలో ఆదివారం 157 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో ఒకరు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య   3,01,318కు, మరణాలు 1,654కు పెరిగాయి. ఆదివారం 2,434 మంది కొవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు తొలి డోసు వేసుకున్నవారి సంఖ్య 5,29,551కు చేరింది. రెండో డోసు 8 మంది పొందారు. వీరి సంఖ్య 2,22,088కు పెరిగింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here