‘మండలి’ కలిపింది!

0
327
Spread the love

ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ వర్గాలకు రెండున్నరేళ్లుగా దూరంగా ఉన్న గులాబీ దళాన్ని పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు దగ్గరికి చేరుస్తున్నట్లు కనిపిస్తోంది. 2018 పార్లమెంట్‌ ఎన్నికల నుంచి ఆయా వర్గాలకు క్రమంగా దూరమవుతున్న టీఆర్‌ఎస్‌.. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో మేల్కొంది. మండలి ఎన్నికల నోటిఫికేషన్‌ అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వపరంగా నష్టనివారణ చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలు క్రమంగా ఫలితాలను ఇస్తున్నట్లే కనిపిస్తోంది. మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు మద్దతునిస్తూ పలు సంఘాలు ప్రకటనలు చేస్తున్నాయి. ఒకటి రెండు తప్ప.. 90 శాతానికి పైగా సంఘాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల వెంటే ఉంటామని ప్రకటించాయి. వేతన సవరణ విషయంలో తాత్సారంపై ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఒకింత ఆగ్రహంతో ఉండగా.. రెండు వారాలుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తిరిగి చేరువ అవుతున్నారనే సంకేతాలను ఇస్తున్నాయి. ఇవన్నీ మండలి ఎన్నికల్లో తమకు ఆశాజనక ఫలితాల దిశగా పడుతున్న అడుగులేనని అధికార టీఆర్‌ఎస్‌ నమ్మకంతో ఉంది.

గత 10 రోజులుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, మాజీ ఉద్యోగులు, గ్రూప్‌-1 అధికారులు, విద్యుత్తు ఉద్యోగులు/అధికారులు ప్రభుత్వానికి సమర్థన ఇస్తూ… టీఆర్‌ఎస్‌ నిలబెట్టిన అభ్యర్థులకు మద్దతునిస్తామని ప్రకటిస్తున్నారు. తాజాగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం కూడా ప్రతిఫలం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఏపీలో అమలవుతున్న మధ్యంత ర భృతి(ఐఆర్‌) కన్నా ఎక్కువే ఫిట్‌మెంట్‌ ఇస్తామని, వయో పరిమితి 61 ఏళ్లకు పెంచుతామని, సీజీహె చ్‌ఎ్‌స తరహాలో ఈహెచ్‌ఎ్‌స అమలు చేస్తామని, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉద్యోగులను రప్పిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఆయా వర్గాలన్నీ అనుకూల జాబితాలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇక వైద్య అధ్యాపకులకు యూజీసీ వేతనాలు అమలు చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, రాష్ట్రంలో 60 వేల మందికి పైగా ఉన్న విద్యుత్తు ఉద్యోగులకు కొత్త డీఏ(కరువుభత్యం) విడుదల చేస్తూ విద్యుత్తు సంస్థలు తీసుకున్న నిర్ణయం కూడా ఆయా వర్గాల్లో ప్రభుత్వం పట్ల అనుకూలతను పెంచినట్లు చెబుతున్నారు.

బెదిరింపుల నుంచి బుజ్జగింపుల దిశగా..

తొలుత మండలి ఎన్నికల ప్రచారం బెదిరింపులు, శాపనార్థాల నుంచి బుజ్జగింపుల దిశగా నడుస్తోంది. పట్టభద్రులతో వ్యవహరించే పద్ధతి ఇది కాదని సంకేతాలు రావడంతో వారం రోజులుగా మంత్రుల ప్రచార సరళి కూడా మారుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కూడా ఉద్యోగులకు దూరమయింది వాస్తవమేనని, దీనికి క్షంతవ్యులమంటూ క్షమాపణ చెప్పుకొన్నారు. పీఆర్సీ ఆలస్యంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు దూరమయ్యారని మరో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ప్రకటించి.. ఆయా వర్గాల సానుభూతిని పొందారు. తాజాగా సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం పీఆర్సీపై క్లారిటీ వచ్చిందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తమ పట్ల అనుకూలతను పెంచిందన్న అభిప్రాయాలు గులాబీ శిబిరంలో వ్యక్తమవుతున్నాయి. ఇక అమాత్యుల ప్రచారం కూడా ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులను మచ్చిక చేసుకునేలా సాగుతోంది. ఉపాధ్యాయుల్లో మూడు సంఘాలు బలంగా ఉండగా… అందులో రెండు సంఘాలు ఇదివరకే ఇతర అభ్యర్థులకు మద్దతు ప్రకటించాయి. అయితే బలమైన సంఘం మాత్రం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. ఒక దశలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేరు వేరు అని పరోక్షంగా సంకేతాలిచ్చి.. ప్రకంపనలు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉపాధ్యాయ సంఘంతో భే టీ సమయంలో ఇరువురు ఒకటే అన్నట్లు తెలుస్తోంది. ఇక సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీలు), భాషా పండితులు తనకు రెండు కళ్లలాంటి వారని సీఎంకేసీఆర్‌ చేసిన ప్రకటన కూడా ఆయా వర్గాలను బుజ్జగించేలా ఉంది.

ఏ వర్గాన్నీ వదలకుండా..

హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి క్రితంసారి జరిగిన టీఎన్జీవోల సంఘం పూర్వ అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చినప్పటికీ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు అండగా నిలవకపోవడంతో ఆయన ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో ఈసారి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తెను బరిలోకి దింపి.. ఏ ఒక్క వర్గాన్నీ వదులుకోకుండా అన్ని గడపలనూ తడుతోంది. పట్టభద్రుల ఓటర్లుగా పేర్లు న మోదు చేసుకున్న అన్ని వర్గాలకూ చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌ వర్గాలు క్రమంగా ప్రభుత్వం దగ్గరికి చేరుతుండటంతో ఈ పరిణామాలు మండలి ఎన్నికల్లో తమను గట్టెక్కిస్తాయనే భావనతో టీఆర్‌ఎస్‌ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here