మాయమాటలు చెప్పి వేల కోట్ల అవినీతికి పాల్పడిన మంత్రి జగదీశ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. ‘పొలం బాట-పోరు బాట’లో భాగంగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని బండమీదిచందుపట్ల, బీమ్లాతండా గ్రామాల్లో ఎస్సారెస్పీ కాల్వలో నీళ్లు లేక ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించ రైతులతో ముచ్చటించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రైతులతో ముఖాముఖీలోనూ ఆయన మాట్లాడారు. సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ కాల్వలో ప్రస్తుతం వస్తున్న నీరు కాళేశ్వరం జలాలు కావని ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో రూ.10 వేల కోట్ల అవినీతి జరిగిందని, దీన్ని ఆధారాలతోసహా నిరూపిస్తానని మంత్రి జగదీశ్‌రెడ్డికి సవాల్ విసిరారు. శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యేలోగా ఈ రెండు సవాళ్లను స్వీకరించి చర్చకు సిద్ధం కావాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐక్య ఉద్యమాలతో ప్రదానికి, సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని, ఈ పోరాటంలో రైతులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
