మన మార్కెట్లను కాపాడుకుందాం

0
174
Spread the love

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన సాగు చట్టాలకు సంబంధం లేకుండా మన మార్కెట్లను మనం కాపాడుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ దిశగా అధికారుల చర్యలు ఉండాలన్నారు. తెలంగాణలో ఉద్యాన పంటల సాగు మరింత విస్తరించాలని, ఈ దిశగా పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగు కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలని, దీనికోసం ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని 300 ఎకరాలను కేటాయిస్తామని ప్రకటించారు. ఉద్యాన విశ్వవిద్యాలయం మౌలిక సౌకర్యాల కల్పన, అభివృద్ధి కోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు. ఉద్యాన పంటల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక అంశంపై శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్‌ విధానాన్ని రూపొందించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఇది వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఉండాలన్నారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మూస పద్ధతిలో సాగింది. ప్రాజెక్టుల కింద కాల్వల నీళ్లతో సాగయిన వరి పంటకే ఆనాటి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిచ్చాయు. దీంతో సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న తెలంగాణలో వ్యవసాయం బాగా వెనకబడిపోయింది. పండ్లు, కూరగాయలు, ఆకు కూరల్లాంటి తక్కువ నీటితో ేసద్యమయ్యే ఉద్యాన పంటల సాగు విస్మరణకు గురైంది. కానీ, ఇప్పుడు స్వయంపాలనలో సాగునీటి ప్రాజెక్టులతో నీరు పుష్కలంగా లభిస్తున్నందున తక్కువ నీటి వాడకంతో ఎక్కువ లాభాలు గడించేలా మన రైతాంగాన్ని ఉద్యాన పంటల సాగు దిశగా ప్రోత్సహించాలి’’ అని సీఎం అన్నారు.

కూరగాయలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహాలు..

ఉద్యాన నర్సరీలను నెలకొల్పే రైతులకు, పంటల సాగుకు ముందుకు వచ్చే ఔత్సాహిక రైతులకు రైతుబంధుతో పాటు ప్రత్యేక ప్రోత్సాహాకాలు అందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకునే స్థాయినుంచి ఎగుమతి చేసే స్థాయికి చేరే దిశగా ఉద్యానశాఖ చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యాన శాఖకు ప్రస్తుతం ఒకే కమిషనర్‌ ఉన్నారని, ఇకనుంచి పండ్లు పండ్లతోటల సాగుకోసం, కూరగాయలు ఆకుకూరల సాగు కోసం, పామాయిల్‌ సాగు కోసం మొత్తంగా నలుగురు ఉన్నతాధికారులను నియమించాలని నిర్ణయించారు. ఉద్యానశాఖలో తక్షణం పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, తగినంత సిబ్బంది నియామకానికి విధివిధానాలు రూపొందించాలని అన్నారు. ఒంటిమామిడి, రామగిరి ఖిల్లా వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. పత్తి సాగును వీలైనంత మేర పెంచాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వ్యవసాయ, ఉద్యానశాఖల కార్యదర్శులు జనార్దన్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, హార్టికల్చర్‌ యూనివర్సిటీ వీసీ నీరజ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here