మళ్లీ మహమ్మారి

0
299
Spread the love

రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ పెరుగుతోందా!? సెకండ్‌ వేవ్‌ మొదలైందా? గాంధీ సహా ఆస్పత్రుల్లో చేరేవారు పెరుగుతున్నారా!? విద్యా సంస్థలను కూడా అందుకే మూసివేశారా? గాంధీ ఆస్పత్రిలో ఓపీని నిలిపివేసి మరోమారు కొవిడ్‌ సేవలే అందించాలని ప్రభుత్వం భావిస్తోందా!? ఈ ప్రశ్నలకు వైద్య వర్గాల నుంచి ‘ఔను’ అన్న సమాధానమే వస్తోంది. మార్చి 12వ తేదీ నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. విచిత్రం ఏమిటంటే, రాష్ట్రంలో గత ఏడాది మార్చి 2న తొలి కేసు నమోదు కాగా.. ఈ ఏడాది మార్చి 12 నుంచి కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలు అధికారికంగా చెప్పడం లేదు కానీ.. సెకండ్‌ వేవ్‌ దాదాపు మొదలైందనే సంకేతాలు మాత్రం ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల చూస్తుంటే, సెకండ్‌ వేవ్‌కు దారి తీస్తుందేమోనని అనిపిస్తోందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఓ చానల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. నిజానికి, డిసెంబరు నుంచి కరోనా తీవ్రత తగ్గుతూ వచ్చింది. జనవరి, ఫిబ్రవరిల్లో దాని ప్రభావం ఇక లేదన్నట్లు కనిపించింది. కానీ, మార్చి నుంచి మళ్లీ విజృంభిస్తోంది. ప్రజల నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణమని వైద్య శాఖ చెబుతోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌కు దారి తీయకుండా ఉండాలంటే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

గాంధీలో మళ్లీ…

గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌లు పెరుగుతుండడంతో సీరియస్‌ కేసులన్నీ గాంధీ ఆస్పత్రికే వస్తున్నాయి. 15 రోజుల కిందట అక్కడ వెంటిలేటర్‌పై కేవలం 15 మంది రోగులే చికిత్స పొందారు. సోమవారం రాత్రి 8 గంటల సమయానికి ఆ సంఖ్య 55కు పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని గాంధీ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, కొత్తగా ఇన్‌పేషెంట్స్‌కు అవకాశమివ్వవద్దని ఉన్నతాఽధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా, గైనకాలజీ విభాగంలో సేవలను పూర్తిగా నిలిపివేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి మంగళవారం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావుతో సమావేశమయ్యారు. కేసుల సంఖ్య బాగా పెరిగితే గాంధీ ఆస్పత్రిని మళ్లీ పూర్తిస్థాయిలో కొవిడ్‌ సేవలకే వినియోగించే యోచనలో వైద్య ఆరోగ్య శాఖ ఉంది.

రెండు నెలలకు సరిపడా ఔషధాలు సిద్ధం

కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాబోయే 2-3 నెలలకు సరిపడా ఔషధ నిల్వలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.

సరిహద్దు జిల్లాలు, గ్రేటర్‌లో భారీగా కేసులు

తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌ల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయని, వాటి ప్రభావం రాష్ట్ర సరిహద్దు జిల్లాలపై ఎక్కువగా ఉంటోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా, ఆదిలాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, నిజామాబాద్‌; సంగారెడ్డి జిల్లాల్లో సర్వైలెన్స్‌ బృందాలను మరింత అప్రమత్తం చేశారు. గత వారం రోజుల్లో ఆదిలాబాద్‌లో 83, కామారెడ్డిలో 84, నిర్మల్‌లో 122, నిజామాబాద్‌లో 81, సంగారెడ్డిలో 79 పాజిటివ్‌లు వచ్చాయి. ఇక, గ్రేటర్‌ హైదరాబాద్‌లో కూడా పక్షం రోజులుగా కేసులతోపాటు ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారం రోజుల వ్యవధిలో గ్రేటర్‌లో 461, మేడ్చల్‌లో 207, రంగారెడ్డిలో 310 పాజిటివ్‌లు నమోదు అయ్యాయి. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో 24 గంటల వ్యవధిలో 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా, విద్యా సంస్థల్లో కేసుల సంఖ్య బాగా పెరగడంతో ఆ ప్రభావంతో విద్యార్థుల నుంచి తల్లిదండ్రులు, వృద్ధులకు వ్యాప్తి అవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఆ నేపథ్యంలోనే, విద్యా సంస్థలను మూసివేయాలని సర్కారుకు నివేదిక ఇచ్చింది.

మరో 23,023 మందికి తొలి డోసు

రాష్ట్రంలో సోమవారం మరో 23,023 మంది కొవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్నారు. వీరిలో 60 ఏళ్లు పైబడినవారు 12,065 మంది ఉండగా, కోమార్బిడిటీస్‌ ఉన్నవారు 9,011 మంది. వెరసి, ఇప్పటి వరకు తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య 7,47,287కిచేరింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here