యాసంగి ధాన్యం కొనేదెవరో?

0
250
Spread the love

పంటలు పండించడానికే కాదు.. వాటిని అమ్ముకోవడానికీ రైతులకు కష్టాలు తప్పేలా లేవు. పంటల కొనుగోలుతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని.. క్రయవిక్రయాలు ప్రభుత్వ బాధ్యత కాదని, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సాధ్యపడదని సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. రైతులకు కనీస మద్దతు ధర దక్కదు. ఈ కేంద్రాలు లేకుంటే రైతులు ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయించాల్సిందే. ఉదాహరణకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2020 వానాకాలం సీజన్‌లో 12.3లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఐకేపీ కేంద్రాలుండడంతో రైతులు సజావుగా అమ్ముకోగలిగారు. ప్రస్తుత యాసంగిలో ఉమ్మడి జిల్లాలో వరి రికార్డు స్థాయిలో 11 లక్షల ఎకరాలకు పైగా సాగైనట్టు అధికారులు అంచనా వేశారు. ఈ పంట త్వరలోనే చేతికి రానుంది. అప్పటికల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? లేదా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో వరి సాగు విసీర్ణం 50 లక్షల ఎకరాలకు చేరిన నేపథ్యంలో 1.4 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఈ ధాన్యాన్ని ఎవరు కొంటారన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రైవేటు వ్యాపారులు, రైస్‌ మిల్లర్లకే కొనుగోలు వ్యవస్థను వదిలేస్తారా? ఎఫ్‌సీఐ నేరుగా కొంటుందా? వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు రైతులంతా ధాన్యం తీసుకెళ్తే పరిస్థితి ఏమిటి? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనకు అనుగుణంగానే అధికారులు యాసంగిలో ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టలేదు.

పౌర సరఫరాల సంస్థ కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం లేదు. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ మాత్రం ఏఎంసీల్లో (వ్యవసాయమార్కెట్‌ కమిటీలు) మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఈ నెల 4న చేసిన ప్రకటన కూడా మార్కెట్‌ కమిటీల్లో విక్రయాలను ప్రోత్సహించే కోణంలోనే ఉంది. కరోనా సమయంలో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వ్యాక్సిన్‌ వచ్చినందున ఏఎంసీల్లో కొనుగోలు చేయిస్తామని, ఎఫ్‌సీఐ యథావిధిగా ధాన్యం కొంటే స్వాగతిస్తామని మంత్రి ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లతో మార్కెట్‌ కమిటీలకు ఆదాయం వస్తుంది. విక్రయాలపై ఒక శాతం మార్కెట్‌ ఫీజును రైతులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, నియోజకవర్గానికి ఒకట్రెండు ఏఎంసీలే ఉన్నాయి. 191 మార్కెట్‌ కమిటీలు, 72 సబ్‌ యార్డులకు గాను ధాన్యం కొనుగోలు చేసేందుకు 204 మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో పౌర సరఫరాల సంస్థ, పీఏసీఎ్‌సలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 6-7 వేల కేంద్రాలు అందుబాటులో ఉండేవి. ఈ సౌలభ్యం లేకపోతే మారుమూల గ్రామాల నుంచి రైతులు మార్కెట్లకు ధాన్యం తీసుకురావడం కష్టంగా మారుతుంది. రవాణా చార్జీలు తడిసి మోపెడవుతాయి. మార్కెట్‌ కమిటీల్లో లైసెన్సులు ఉన్న ట్రేడర్లు మాత్రమే ధాన్యం కొంటారు. ఎఫ్‌ఏక్యూ (ఫేర్‌ యావరేజ్‌ క్వాలిటీ) ఆధారంగా కనీస మద్దతు ధర చెల్లింపు ఉంటుంది. మార్కెట్‌ కమిటీలే పంట ఉత్పత్తుల కొనుగోళ్లను పర్యవేక్షిస్తాయి. కానీ, మార్కెట్లకు ఒకేసారి ధాన్యం పోటెత్తితే చాలా సమస్యలు వస్తాయి. దీనికితోడు వసతులు, మానవ వనరులు సరిపడా లేవు. మార్కెట్లలో ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చెప్పాలంటే.. 4 నెలలు నిరంతరాయంగా కొనుగోలు చేసినా, ధాన్యం కొనుగోలు పూర్తి కాదు.

రైస్‌ మిల్లర్లదే రాజ్యం?

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే వ్యవస్థ మొత్తం రైస్‌ మిల్లర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. గత వానాకాలం సీజన్‌లోనే మిల్లర్లు ధాన్యం భారీగా వచ్చిన సమయంలో రేటు తగ్గించారు. సన్న ధాన్యం ధర క్వింటాలుకు సాధారణంగా రూ.2 వేలకు పైగా ఉంటుంది. కానీ, మిల్లర్లు 1,600-1,700కు కొనుగోలు చేశారు. దిగుబడి తగ్గిపోయి, సీజన్‌ ముగింపు దశకు చేరగానే రూ.2,300-2,400కు పెంచారు. మొత్తంమీద మిల్లర్లు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల మధ్య రైతులు నలిగిపోయే పరిస్థితి వస్తుంది. కనీస మద్దతు ధరకు గ్యారెంటీ ఉండదు. రైతులకు డబ్బులు ఇవ్వడానికి 15-30 రోజులు వాయిదాలు పెడతారు. వెంటనే కావాలంటే 2 శాతం వడ్డీ తీసుకొని మిగిలినవి ఇస్తారు. దళారులు, వ్యాపారులు కూడా ఇదే పద్ధతిలో వ్యవహరిస్తుంటారు. వరి ధాన్యం మార్కెట్‌ కాస్తా ప్రైవేటు ట్రేడర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ యాసంగిలో వరి సాగు విస్తీర్ణం 50 లక్షల ఎకరాలకు చేరింది. 1.40 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుంది. మరోవైపు యాసంగి వరి పంటను రైతులు దాదాపుగా అమ్మేస్తారు. ఎక్కువగా బాయిల్డ్‌ రైస్‌కే పోతాయి. ఈ పరిస్థితుల్లో 1.40 కోట్ల టన్నులు కొనుగోలు మిల్లర్లు, ప్రైవేటు ట్రేడర్లకు సాధ్యపడుతుందా? అనేది అంతుచిక్కడం లేదు.

పీపీసీలతో నష్టమే లేదు

రాష్ట్ర ప్రభుత్వానికి ‘వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ)’ ఏర్పాటు లాభమే తప్ప నష్టం వాటిల్లే అవకాశం లేదు. ధాన్యం కొనడానికి పౌరసరఫరాల సంస్థకు.. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం రెండు నెలలకు వడ్డీ చెల్లిస్తుంది. ఆ రెండు నెలల్లో రీయింబర్స్‌మెంట్‌ చేసుకునే వెసులుబాటు ఇస్తుంది. క్వింటా ధాన్యం రూ.1,888 చొప్పున కొంటే.. అందులో 67 కిలోల బియ్యానికి(67ు రికవరీ) కిలోకు రూ.32.73 చొప్పున రూ.2,192.91 ఎఫ్‌సీఐ చెల్లిస్తుంది. నిర్వహణ ఖర్చుల కింద 2.5 శాతం కమీషన్‌ ఇస్తుంది. ఒక శాతం మార్కెట్‌ ఫీజును రీయింబర్స్‌ చేస్తుంది. పీపీసీ నిర్వాహకులకు క్వింటాకు రూ.32 చొప్పున కేంద్రమే కమీషన్‌ చెల్లిస్తుంది. రైస్‌ మిల్లర్లు మిల్లింగ్‌ చేసినందుకు పచ్చి బియ్యం క్వింటాకు రూ.10, బాయిల్డ్‌ రైస్‌కు రూ.20 చొప్పున ఛార్జీలు ఇస్తుంది. గోదాముల్లో బియ్యం నిల్వ చేస్తే నిర్వహణ, రవాణా ఛార్జీలు సహా ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేసుకుంటుంది. ఇంత ప్రయోజనమున్నా ప్రభుత్వం ఎందుకు వెనకడుగేస్తుందనేది సందేహంగా మారింది.

ఐకేపీ కేంద్రాలు లేకుంటే కష్టమే

ఐకేపీ కొనుగోలు కేంద్రాలు లేకపోతే ఇబ్బందులు తప్పవు. ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో తెలియదు. గిట్టుబాటు ధర రాక నష్టపోతాం. దళారుల చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

                                   సుంకరి ఉపేందర్‌, రైతు, సూర్యాపేట జిల్లా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here