జగదేవ్‌పూర్: వార్తా పత్రిక తిరగేస్తుంటే ఫలనా చోట ఫలానా రైతు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త గనక కనిపిస్తే అయ్యో పాపం అనుకుంటాం. ఆయన అలా అనుకొని ఊరుకోరు. బరువెక్కిన హృదయంతో బలవన్మరణానికి పాల్పడిన ఆ రైతు ఇంటికి వెళతారు. ఇంట్లో వాళ్లను పరామర్శించి వారి బాధను పంచుకుంటారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో కనుక్కుంటారు. ఆ కుటుంబం వివరాలను రాసుకొని వెళతారు. కొన్నాళ్లకు ఎవరెవరో దాతలను ఆయనే వెంటబెట్టుకొని మళ్లీ ఆ ఇంటికి వెళతారు. వారితో తోచినంత ఆర్థిక సాయాన్ని ఇంట్లోవాళ్లకు ఇప్పిస్తారు. తానూ కొంత సాయం చేస్తారు. ఆ సమయంలో బాధితుల కళ్లలో ఉన్న కన్నీటి చార తొలగి జీవితంపై ఆశతో కూడిన ఓ వెలుగును చూసి గానీ ఆయన హృదయం తేలికపడదు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం మళ్లీ మొదలవుతుంది. మరో బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో!

..పులి రాజు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిదీ ఔదార్యం.జనాలకు అన్నంపెట్టి.. ఆకలి తీర్చే రైతన్న అంటే ఆయనకు ఇష్టం.. అపారమైన గౌరవం. అలాంటి అన్నదాతలు, అప్పులపాలై జీవితమ్మీద విరక్తితో ఆత్మహత్య చేసుకున్నారని తెలిస్తే ఆయనకు గొంతులో ముద్ద దిగదు. బాధిత కుటుంబాన్ని ఏదో రకంగా ఆదుకునేదాకా మనసు మనసులో ఉండదు. బాధిత కుటుంబాలకు తాను సాయం చేసి.. ఇతరులతోనూ సాయాన్ని ఇప్పించడమే కాదు, ఆ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందేలా ప్రభుత్వంపైనా ఒత్తిడి తెస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల చదువు కొనసాగేలా చూస్తారు. వారి ఉన్నత చదువుల కోసం తనవంతు సహకారాన్ని అందిస్తారు. బాధిత కుటుంబాలకు చెందిన కొంత మంది పిల్లలను తానే దత్తత తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు పులిరాజు తీసుకున్న ఈ సంకల్పం ఇప్పటిదికాదు. ఇరవై ఏళ్లుగా రైతుల కోసం ఆయన శ్రమిస్తున్నారు.
ఎవరీ పులి రాజు?
పులి రాజుది సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్. 2002లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం వర్గల్ మండలం తునికి ఖల్సా పాఠశాలలో పనిచేస్తున్నారు. 1997లో పత్తి రైతుల ఆత్మహత్యలు అప్పట్లో కాకతీయ వర్సిటీలో పీజీ చేస్తున్న పులి రాజును కలిచివేశాయి. 2000 సంవత్సరం నుంచి మెదక్ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా రైతు ఆత్మహత్యల వివరాలను ఆయన నమోదు చేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా 2 వేల కుటుంబాలను ఆయన ప్రత్యక్షంగా కలిశారు. ఉపాధ్యాయుడిగా విఽధుల్లో పాల్గొంటూనే సెలవు రోజుల్లో ఆయన రైతు కుటుంబాల వద్దకు వెళతారు.
‘ఎక్స్‌గ్రేషియా’ కోసం కృషి
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇప్పించడానికి పులి రాజు ప్రత్యేక కృషి చేశారు. 2004లో వైఎస్, తెలంగాణలో పాదయాత్ర చేసిన సమయంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. తర్వాత వైఎస్ సీఎం అయ్యాక మరోసారి కలవడంతో స్పందించిన ఆయన, ఆ రైతుల కుటుంబాలకు రూ.1.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవిధంగా జీవో జారీ చేశారు. ఈ జీవో కింద 1997 నుంచి తాను నమోదు చేసిన బాధితుల కుటుంబాలను ఆదుకోవాలంటూ పులి రాజు చొరవ తీసుకోవడంతో వేలాది కుటుంబాలకు రూ.1.5 లక్షఽల ఎక్స్‌గ్రేషియా అందింది. తెలంగాణ వచ్చాక ఎక్స్‌గ్రేషియాను పెంచాలంటూ పులి రాజు ఆధ్వర్యంలోని రైతు సంఘాల బృందం కోరడంతో సాయాన్ని రూ.6లక్షలకు పెంచారు.
పులి రాజుకు పలు అవార్డులు
2015లో సివిల్ సొసైటీ ఆల్ ఆఫ్ ఫేం సంస్థ పులి రాజుకు అవార్డు అందజేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా రైతునేస్తం అవార్డును అందుకున్నారు. మంజీర రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రెండుసార్లు రైతుబాంధవుడు అవార్డును అందజేశారు. 2019లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా సీఎం కేసీఆర్ నుంచి అవార్డును అందుకున్నారు. 2012లో గజ్వేల్ మండల ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు వచ్చిన సందర్భంలో రైతు ఆత్మహత్యలు ఆపాలని డిజీమాండ్‌చేస్తూ ఆ అవార్డును తిరస్కరించారు.
ఆత్మహత్యలు ఆగాలి: పులి రాజు
అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్య చేసుకోకూడదు. మన కడుపు నింపడానికి తను పంటలు పండిస్తూ అప్పుల పాలు కావడం అనేది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. రైతు ఆత్మహత్యలు ఆపాలి. ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఎంతో కొంత సాయమందించగలుగుతున్నాం. కానీ ఆత్మహత్యలే జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు పౌరసమాజంపై కూడా ఉంది. రైతు కుటుంబాలకు సాయమందిస్తున్న దాతలకు ధన్యవాదాలు. మరింత మంది ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలి.