లీటర్‌కు 5..దోపిడీ ఖరీదు

0
171
Spread the love

(సెంట్రల్‌ డెస్క్‌)

పెట్రోల్‌ ధరలను ఎడాపెడా పెంచేస్తూ.. సామాన్యుడి నడ్డి విరుస్తున్న చమురు సంస్థలు.. సెస్సుల పేరుతో జేబులు గుల్ల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో దోపిడీకి సిద్ధమయ్యాయి. పర్యావరణ పరిరక్షణ.. కర్బన ఉద్గారాల నిరోధం పేరుతో పెట్రోల్‌లో మరింత ఇథనాల్‌ను కలపాలని నిర్ణయించాయి. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించేలా ఎలాంటి పరికరాలను సిద్ధం చేసుకోకున్నా.. మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నాయి. గతంలో పెట్రోల్‌లో 5ు ఇథనాల్‌ను కలిపేవారు. అయిదారేళ్లుగా దాన్ని రాష్ట్రాల వారీగా 10శాతానికి పెంచుతూ వచ్చారు. ఇప్పుడు 20శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.

చకచకా ఆదేశాలు జారీ

భారత్‌లో 2001లో పరిమిత ప్రాంతాల్లో పెట్రోల్‌లో 5ు ఇథనాల్‌ను కలపడం ప్రారంభమైంది. అప్పట్లో మహారాష్ట్రలోని మిరాజ్‌, మన్నాడ్‌, యూపీలోని బరేలీలో ఇది అమలైంది. 2003 జనవరి నుంచి ఉమ్మడి ఏపీ సహా.. 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేశారు. 2006 సెప్టెంబరు 20 నుంచి 5ు ఇథనాల్‌ను వాడుతున్న రాష్ట్రాల సంఖ్య 20కి పెరిగింది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి.. అండమాన్‌-నికోబర్‌, లక్షద్వీపాలు మినహా.. దేశంలోని అన్ని ప్రాంతాల్లో 10ు ఇథనాల్‌ వాడకం అమల్లోకి వచ్చింది. అయితే.. అప్పట్లో ఇథనాల్‌ లభ్యత ఏటా 189 కోట్ల లీటర్లకే పరిమితమవ్వడం.. మరో 200 కోట్ల లీటర్ల డిమాండ్‌ ఉండడంతో.. చాలా ప్రాంతాల్లో 5ు ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ విక్రయాలు జరిగాయి. గత ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాల్లో 10ు ఇథనాల్‌ వినియోగం కొనసాగుతోంది. నిజానికి పెట్రోల్‌లో ఇథనాల్‌ కలుపుతున్న విషయాన్ని వినియోగదారులకు స్పష్టంగా వివరించాల్సి ఉన్నా.. పెట్రోల్‌ బంకుల్లో ఆ వివరాలను ప్రదర్శించాల్సి ఉన్నా.. కేంద్రం గానీ, చమురు సంస్థలు గానీ.. ఆ దిశలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ను ‘గ్యాసోలిన్‌’ అని పేర్కొనాల్సి ఉంటుంది. ఈ విషయం వినియోగదారులకు తెలియకపోవడంతో.. తాము కొంటున్నది స్వచ్ఛమైన పెట్రోలే అని భావిస్తున్నారు. పెట్రోల్‌తో పోలిస్తే.. ఇథనాల్‌ ధర చాలా తక్కువ. బల్క్‌లో లీటర్‌ ఇథనాల్‌ (సీ-గ్రేడ్‌) రూ. 40కి లభిస్తోంది. అంటే.. ఒక వినియోగదారుడు 10 లీటర్ల పెట్రోల్‌ కొట్టిస్తే.. అందులో ఒక లీటరు ఇథనాల్‌ ఉంటుంది. అయితే.. ఆ ఒక్క లీటరు ఇథనాల్‌ని కూడా వినియోగదారుడు రూ. 90 వెచ్చించి కొంటున్నాడు. గత ఏడాది డిసెంబరు 11న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌(జీఎ్‌సఆర్‌ 757-ఇ) ప్రకారం.. 20ు ఇథనాల్‌ను కలపాలనే ప్రతిపాదన అమల్లోకి వస్తే.. వినియోగదారుడి ప్రతి పది లీటర్లకు రూ. 100 చొప్పున దోపిడీకి గురవుతాడు. ఇథనాల్‌ను పెంచాలని ఒత్తిడి చేస్తున్న కేంద్రం.. ఆ మేరకు పెట్రోల్‌ ధరల్లో ఊరటనివ్వకపోవడం గమనార్హం.

ఆయుధాల్లేకుండా యుద్ధానికి..

ఇథనాల్‌ విషయంలో చమురు సంస్థల తీరు ఆయుధాల్లేకుండా యుద్ధానికి వెళ్తున్నట్లు ఉంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం అంత తేలిక కాదు. ఆ రెండింటినీ చమురు ప్లాంట్లలో ‘బ్లెండింగ్‌’ యంత్రాలతో కలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం 10ు ఇథనాల్‌ మిక్సింగ్‌ను కూడా అడ్డగోలు పద్ధతుల్లో కలుపుతున్నారు. పెట్రోల్‌ను రవాణా చేసే ట్యాంకులో 9 వేల కిలోలీటర్ల పెట్రోల్‌ను లోడ్‌ చేసి.. ఒక కిలోలీటరు ఇథనాల్‌ను అందులో వేస్తున్నారు. ఇది ప్రపంచ ప్రమాణాల (ఏఎ్‌సటీఎం డీ4806)కు, భారత ప్రమాణాల (ఐఎ్‌స-2796:2008)కు పూర్తిగా విరుద్ధం. సరిగ్గా బ్లెండింగ్‌ కాని ఇథనాల్‌కు తేమ తాకితే.. నీరుగా రూపాంతరం చెందుతుంది. ఫలితంగా ఆ పెట్రోల్‌ను వాడే వాహనాల ఇంజన్లు దెబ్బతింటాయి. చమురు సంస్థలు బ్లెండింగ్‌ పరికరాలను సమకూర్చుకోకపోవడం వల్ల జరిగే నష్టం వినియోగదారుడిపైనే పడుతుంది. తొలినాళ్లలో మహారాష్ట్రలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు ఫెయిల్‌ అవ్వడానికి ప్రధాన కారణం బ్లెండింగ్‌ లేకపోవడమే. అప్పట్లో అధికారులు జరిపిన తనిఖీల్లో.. దక్షిణ ముంబైలోని హెచ్‌పీసీఎల్‌ ప్లాంట్‌లో ఎలాంటి బ్లెండింగ్‌ పరికరాలు లేవని, దాంతో.. ఇథనాల్‌ నిల్వ పెట్రోల్‌ మధ్య లేయర్లలో ఉందని గుర్తించారు.

దీంతో.. ప్రమాణాలు పాటించకుండా 10ు ఇథనాల్‌ను కలపడాన్ని.. దాన్ని ఇప్పుడు 20శాతానికి పెంచాలనే ప్రతిపాదనను పెట్రోల్‌ డీలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై గత నెల 5న కేంద్ర రోడ్డురవాణా శాఖ సంయుక్త కార్యదర్శికి ఓ లేఖ కూడా రాశారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటించేదాకా.. ఈ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అయినా.. కేంద్రం మొండివైఖరితో 20ు ఇథనాల్‌ మిక్స్‌ ప్రతిపాదనల విషయంలో ముందుకు వెళ్తోంది..

ఇథనాల్‌ ఎందుకు?

నిజానికి పర్యావరణ వేత్తలు దశాబ్దాలుగా పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపాలనే డిమాండ్‌ చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణంలోకి కార్బన ఉద్గారాల విడుదల తగ్గుతుంది
కొన్ని సందర్భాల్లో పెట్రోల్‌ ఇంజన్‌లోకి వెళ్లాక పూర్తిగా మండదు. ఫలితంగా కర్బన ఉద్గారాలు పొగ రూపంలో బయటకు విడుదలవుతాయి. ఇథనాల్‌లో ఆక్సిజన్‌ ఉంటుంది. ఇథనాల్‌ కలిపిన ఇంధనం ఇంజన్‌లోకి వెళ్లగానే.. ఆక్సిజన్‌ వల్ల అది పూర్తిగా మండుతుంది. కర్బన ఉద్గారాల విడుదలకు బ్రేకులు వేస్తుంది
కేంద్రం అంచనా ప్రకారం.. పెట్రోల్‌లో 20ు ఇథనాల్‌ను కలిపితే.. ఏటా 25 లక్షల టన్నుల మేర కర్బన ఉద్గారాల విడుదలకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది
ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌ (ఈబీపీ) వల్ల దేశానికి వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది

విదేశాల్లో ఎంత కలుపుతున్నారు?

విదేశాల్లో చాలా వరకు ఇథనాల్‌ శాతం 10కే పరిమితమైంది. ఇథనాల్‌ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో కూడా చాలా రాష్ట్రాల్లో 10ు ఇథనాల్‌ కలుపుతున్నారు. మంచు అధికంగా ఉండే ప్రాంతాల్లో మాత్రం పెట్రోల్‌లో 75-85ు దాకా ఇథనాల్‌ను వినియోగిస్తున్నారు. అయితే.. ఆటోమొబైల్‌ రంగం అందుకు తగ్గట్లుగా ఇంజన్లను తయారు చేస్తోంది.

పెట్రోల్‌లో 20ు కంటే ఎక్కువగా ఇథనాల్‌ను కలుపుతున్న దేశాల్లో బ్రెజిల్‌ అగ్రస్థానంలో ఉంది. 1970 నుంచే అక్కడ 27.5ు ఇథనాల్‌ను వాడుతున్నారు. ఇందుకు కారణం.. చమురు కొరత నెలకొనడమే. ఇప్పటికీ బ్రెజిల్‌లో 18-27.5ు ఇథనాల్‌ వినియోగం కొనసాగుతోంది
థాయ్‌లాండ్‌లో 2007 నుంచి 20ు ఇథనాల్‌ను వినియోగిస్తున్నారు. దాన్ని 2013 నుంచి తప్పనిసరి చేశారు. పెట్రోల్‌ కొరత వల్లే అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రియా, ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌ దేశాల్లో 10ు ఇథనాల్‌ వినియోగం ఐచ్ఛికంగా కొనసాగుతోంది. చైనాలోని తొమ్మిది రాష్ట్రాల్లో, కొలంబియా, జమైకా, మాలావీ, ఫిలిప్పైన్స్‌, ఫిన్‌లాండ్‌ దేశాల్లో 10ు ఇథనాల్‌ వినియోగాన్ని తప్పనిసరి చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here