విద్యార్థులనూ..వీడని దా‘రుణాలు’

0
295
Spread the love

ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల పేరుతో జరుగుతున్న దారుణాల దందా.. అభంశుభం ఎరుగని విద్యార్థులనూ వదలడం లేదు. ఇప్పటికే ఈ యాప్‌ల దారుణాలతో పలువురు ఆత్మహత్యలు చేసుకోగా.. పోలీసులు కేసులు పెట్టి నిర్వాహకులకు బేడీలు వేశారు. తాజాగా ఈ యాప్‌లు విద్యార్థులను టార్గెట్‌గా చేసుకున్నాయి. తమ యాప్‌లలో ‘స్టూడెంట్‌’’ కేటగిరీని కొత్తగా చేర్చాయి. ‘ఎంప్లాయీస్‌’ కేటగిరీలో రుణాలకు.. ఉద్యోగం వివరాలు, పేస్లి్‌పను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ‘స్టూడెంట్‌’ కేటగిరీకి ఇవేమీ అవసరం ఉండవు. రుణానికి కారణం చెబితే సరిపోతుంది. అంటే.. స్కూలు/కాలేజీ ఫీజు కట్టేందుకా? లేక పాకెట్‌ మనీ కోసమా? అనే వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. విద్యార్థి కేటగిరీలో రూ. 2 వేల వరకు రుణాలు ఇస్తున్నారు. ఇక్కడ మెలిక ఏంటంటే.. 1, 2, 3 నెలల గడువు ఉంటుంది. ఒకవేళ ‘ఎంపాకెట్‌’ అనే యాప్‌లో ఒక విద్యార్థి రూ.2,000 రుణం తీసుకుని, మూడు నెలల గడువు తీసుకుంటే.. ఆ తర్వాత అతను అసలుకు రూ.600 వడ్డీ కలిపి.. రూ.2,600 చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత తేదీలోగా ఆ మొత్తం చెల్లించకుంటే.. రోజుకు రూ.16 చొప్పున జరిమానా విధిస్తారు. 

అంతటితో ఆగకుండా.. తమ యాప్‌లో చొప్పించిన మాల్‌వేర్‌ ద్వారా ఆ విద్యార్థి మొబైల్‌ ఫోన్‌లోని కాంటాక్టులను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటారు. వాటిలోని బంధుమిత్రుల ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేసి, పరువు తీసేస్తారు. ఇలా ఓ విద్యార్థి 3 నెలల క్రితం రూ.2 వేలు రుణం తీసుకున్నాడు. మార్చి 15కు అతడి 3 నెలల గడువు ముగిసింది. రోజుకు రూ. 16 చొప్పున జరిమానాలతో చెల్లించాల్సిన మొత్తం ఇప్పుడు సుమారు రూ.3 వేలకు చేరింది. అంతేకాకుండా ఆ విద్యార్థికి వేధింపులు ప్రారంభమయ్యాయి.  తక్షణం లోన్‌ మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని, లేనిపక్షంలో సోషల్‌ మీడియాలో రుణ ఎగవేతదారుగా ప్రకటిస్తూ.. పేరు, ఫొటో పెడతామంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. 

మరో విద్యార్థి తీసుకున్న స్పల్ప మొత్తానికి వడ్డీ, జరిమానాలు కలిపి రూ.10 వేలు చెల్లించాలంటూ వేధింపులు మొదలయ్యాయి. ఇంకో విద్యార్థి విషయంలో అతని అక్క, పెదనాన్న, ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి, తీసుకున్న రుణం చెల్లించడంలేదంటూ పరువు తీశారు. ఇంకో యాప్‌ నిర్వాహకులు మరో అడుగు ముందుకేసి.. విద్యార్థి చదువుతున్న కాలేజీ హెచ్‌వోడీకి ఫోన్‌చేసి పరువు తీశారు. విద్యార్థులకు ఎలాంటి ఆదాయం ఉండదని తెలిసీ ఎలాంటి హామీలు లేకుండా చిన్నమొత్తంలో రుణాలిచ్చి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల దందాపై పోలీసులు సీరియ్‌సగా ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు చైనీయులు సహా పదుల సంఖ్యలో నిర్వాహకులను అరెస్టు చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోగా విద్యార్థులు కూడా బాధితులుగా మారుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here