
గలగల పారే గోదారమ్మకు ఎగువకు ఎగిసే గడుసుదనాన్ని అబ్బేలా చేసి.. నెర్రలు తేలిన బీడు భూములను జలసిరితో నిండా తడిపి.. ఏడాదంతా పచ్చని పంటలు పండేలా చేసి.. రైతుల వాకిళ్లలో ధాన్యపు రాశులను కురిపించేందుకు రూపుదిద్దుకొని.. తెలంగాణ తల్లికి పచ్చలహారాన్ని తొడిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇక పర్యాటక ప్రియులనూ ఆకర్షించనుంది. దైవ భక్తులు.. ప్రకృతి ప్రేమికుల కోసం ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతంగా సింగారించుకుంటోంది. ప్రాజెక్టు పరిధిలో ఉన్న అన్ని ఆలయాల అభివృద్ధి.. ఉద్యాన, స్మృతి వనాలు, థీమ్ పార్కుల ఏర్పాటు.. విడిది కోసం కాటేజీలు.. కమ్మని భోజనం కోసం రెస్టారెంట్లు.. నదీ జలాల్లో షికార్ల కోసం లాంచీలు.. క్లిష్టమైన మార్గాల్లో రోప్‌వేలు.. ఆటపాటల్లో తేలియాడాలనుకునేవారి కోసం క్రీడా మైదానాల రూపకల్పన.. ఇలా ఓ విహారయాత్ర పరంగా అన్ని సౌకర్యాలతో పర్యాటకులకు గొప్ప అనుభూతిని మిగిల్చేందుకు ఓ కంప్లీట్ ప్యాకేజీగా కాళేశ్వరం సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అద్భుత పర్యాటక ప్రాంతంగా కాళేశ్వరం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకుగాను ఇప్పటికే తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు కాళేశ్వరం బ్యారేజీలు, గ్రావిటీ కెనాల్స్ సమీపంలో అభివృద్ధి చేయాల్సిన పనులపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేసి కేసీఆర్‌కు అందించారు.
రూ.600 కోట్లతో కాళేశ్వరం ప్రాంతంలో థీమ్ పార్కులు, రిసార్టులు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. 145 ఎకరాల్లో 15 ప్రత్యేక థీమ్ పార్కులు, ఉద్యావన వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 200 ఎకరాల్లో మూడు తోటలు, 61 ఎకరాల్లో ఎనిమిది స్మృతి వనాలు, పదెకరాల్లో తొమ్మిది క్రీడా మైదానాలు, 26 ఎకరాల్లో రెండు స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక తయారు చేశారు. వీటితో పాటు రిసార్టులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు బస చేసేందుకు అతిథి గృహాలు నిర్మించనున్నారు. ఎక్కడెక్కడ వేటివేటిని నిర్మించాలనే విషయంలో అధికారులకు కేసీఆర్ ఇప్పటికే సలహాలు, సూచనలు కూడా ఇచ్చినట్లు సమాచారం. కన్నెపల్లి పంపుహౌజ్, మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ ఉద్వాన వనాలు, తోటలు, రిసార్టులు, థీమ్ పార్కులు, క్రీడా మైదానాలు, స్మృతివనాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వీటితో పాటు పాజెక్టులో భాగంగా నిర్మించిన అన్ని బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, గ్రావిటీ కెనాల్స్ వద్ద కూడా పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం నిధులను కేటాయిస్తోంది. మొదటి విడతలో రూ.600 కోట్లు కేటాయించింది. రెండో విడతలో మరో రూ.400కోట్ల వరకు నిధులు సమాకూర్చనుంది.
యాదాద్రి స్థాయిలో ముక్తీశ్వరాలయం
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఆధ్యాత్మికంగా ప్రధానమైంది శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరాలయం. యముడు, శివుడు ఒకే పానవట్టంపై కొలువైన అత్యంత పురాతనమైన ఈ క్షేత్రం, మహారాష్ట్ర సరిహద్దులో గోదావరి, ప్రాణహిత నదులు కలిసే చోట ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రహదారుల అభివృద్ధి జరగడంతో ఈ ఆలయానికి భక్తుల రాక పెరిగింది. ప్రాజెక్టు కారణంగా ఈ ఆలయ ప్రాశస్త్యం విశ్వవ్యాప్తం కావడంతో ఇతర రాష్ట్రాల భక్తులనూ ఆకర్షించేలా ఈ క్షేత్రాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలని కేసీఆర్ సంకల్పించారు.
8 కిలోమీటర్ల మేర లాంచీ షికారు
ఏపీలోని రాజమండ్రి నుంచి మన రాష్ట్రంలోని భద్రాచలం దాకా పాపికొండల అందాలను వీక్షిస్తూ సాగే లాంచీ యాత్ర తరహా ఆహ్లాదం కాళేశ్వరం సందర్శించే యాత్రికులకూ కలగనుంది. ఈ మేరకు కాళేశ్వరం నుంచి మేడిగడ్డ దాకా ఎనిమిది కిలోమీటర్ల మేర యాత్రికుల లాంచీ షికారుకు ప్రణాళిక రూపొందించారు. మార్గమధ్యలో మూడు చోట్ల ఆలయాలు, పార్కులు, రెస్టారెంట్లు, అతిథి గృహాలు కూడా నిర్మించాలని భావిస్తున్నారు. దీని కోసం రూ.180 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
పర్యాటక మణిపూస.. మిడ్‌మానేరు
కాళేశ్వరంలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో మానేరువాగుపై 27 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన శ్రీరాజరాజేశ్వర మిడ్‌మానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం 25 టీఎంసీల నీళ్లతో తొణికిసలాడుతోంది. మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌తో సిరిసిల్లలోని మానేరు వంతెన వరకు నీటి అలలు ఆహ్లాదపరుస్తున్నాయి. దీనికి అనుసంధానంగా కరకట్ట నిర్మాణం చేపట్టారు. కరకట్టను పట్టణం చివరివరకు నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు. కరకట్ట వద్ద రూ.2 కోట్లతో హరిత హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సిరిసిల్లకు 13 కిలోమీటర్ల దూరంలోనే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉండటంతో మిడ్‌మానేరు చుట్టూ ఉన్న గుట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కాటేజీల నిర్మాణం, గుట్టలపైకి రోప్ వే వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. మిడ్‌మానేరు ముందు పార్కు నిర్మాణం తదితర ఏర్పాట్లకు రూ.300 కోట్లు అవసరమవుతాయని అంచనా. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద సరస్వతి పంప్‌హౌస్, పార్వతి బ్యారేజ్, అంతర్గాం మండలం గోలివాడ వద్ద పార్వతి పంప్‌హౌస్, ధర్మారం మండలం నంది మేడారం వద్ద అండర్ టన్నెల్‌లో నంది పంప్‌హౌస్, పైన చిన్న రిజర్వాయర్‌ను నిర్మించారు. వీటిని పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది.
కొండపోచమ్మ సాగర్ కిటకిట
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కుక్, ములుగు మండలాల పరిధిలో నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ ఇప్పటికే పర్యాటకులతో కిటకిటలాడుతోంది. హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో నిత్యం వందల మంది ఇక్కడికి వస్తున్నారు. రిజర్వాయర్ చుట్టూ ఉన్న గౌరారం, పాములపర్తి, భవానందపూర్, మర్కుక్ గ్రామాల పరిధిలోని చెట్ల కింద భోజనం చేస్తూ వనభోజన అనుభూతికి లోనవుతున్నారు. పక్కనే ఉన్న వర్గల్‌లోని సరస్వతీ మాతను, అయినాపూర్ సమీపంలోని కొండపోచమ్మ ఆలయాన్ని, కొమురవెల్లిలో మల్లికార్జునస్వామిని దర్శించుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలో గల చందలాపూర్‌లో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. మూడు టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ మధ్యలోనే 60 ఎకరాల విస్తీర్ణంలో పల్లగుట్ట ఉంది. అక్కడికి ప్రత్యేకంగా రహదారిని నిర్మించారు. గుట్ట చుట్టూరా ఘాట్ రోడ్డులను తలపించేలా కొత్త మార్గాలను తవ్వించారు. గుట్టపై కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంతోపాటు ప్రత్యేక సూట్‌లతో అందమైన గెస్ట్‌హౌ్‌సను కట్టారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను గత డిసెంబరు 10న కేసీఆర్ సందర్శించి ఇక్కడ పర్యాటకరంగ అభివృద్ధికి రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
90 ఎకరాల్లో థీమ్ పార్క్
కాళేశ్వరం 16వ ప్యాకేజీలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ వద్ద 11.39 టీఎంసీల సామర్ధ్యంతో నృసింహస్వామి రిజర్వాయర్ నిర్మాణం కొనసాగుతోంది. హైదరాబాద్‌కు సమీపంలో చారిత్రక భువనగిరి ఖిల్లా, ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి ఆలయానికి దగ్గరలోని ఈ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దాదాపు 90 ఎకరాల విస్తీర్ణంలో మైసూర్ బృందావన్ గార్డెన్స్ తరహాలో థీమ్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈపార్క్‌లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో రిసార్ట్‌లు, వెల్‌నెస్ సెంటర్‌తోపాటు సాహస క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. యాదాద్రి క్షేత్రం నుంచి బస్వాపూర్ రిజర్వాయర్ వరకు మూడు కిలోమీటర్ల మేర కేబుల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించారు.